ఏడు రోజుల పూజా విధానాలు, Astrology Articles - Om Sri Sai Jyotisha Vidyapeetham

Puja methods for everyday



వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత వుంది. దాని ప్రకారం ఒక్కో దేవతకు ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో మన పూర్వీకులు చెప్పారు. మనమూ వారిని అనుసరిద్దాం! ఆ శుభఫలాలను అందుకుందాం.రోజుకో దేవతారాధనతో జీవితాలను సుగమం, శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు.

ఆదివారం:

అనారోగ్య నివారణకు, చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతాన క్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారం నాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారం నాడు ఉపవాసం వుండి, సూర్యారాధన లేక సూర్యాష్టకం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారం నాడు ప్రారంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి. అలా ఆచరించలేని వారు కనీసం 12 వారాలైనా చేయాలి.

వ్రతవిధానం: ఆదివారం నాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సాష్టాంగ నమస్కారములతో సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆ పైన గంగా జలాన్ని, లేదా శుద్దోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయుణిడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం వుంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.

సోమవారం:

అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనః కారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రశేకరాష్టకంతో సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారంనాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం: చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ఓం నమఃశ్శివాయ అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, చంద్రశేకరాష్టకం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పువ్వులు, శ్వేత గంధం, బియ్యంతో చేసిన పిండి వంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండి ఉంగరాన్ని ధరించాలి. పూజా సమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతో పాటు పాలు, పెరుగు, పండ్లు మరియు తెలుపురంగు వస్తువులను దానం చేయాలి.

మంగళవారం:

ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి ఆంజనేయ స్తోత్రం గాని సుబ్రమణ్య అష్టకమ్ గాని పఠించి మంగళవార వ్రతం ఆచరించాలి.

వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్దిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, ఋణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపురంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరాన్నిలేదా మూలమంత్రం పఠించాలి.

బుధవారం:

స్థితికారకుడు, శిక్షరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు మదురాష్టకాన్ని భక్తితో పఠిస్తూ ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం:

ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజ చేసే వారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చ ద్రాక్ష మొదలైన ఆకుపచ్చ రంగులో వుండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డి తినిపించడం శ్రేష్ఠం. ముడిపెసలతో చేసిన పదార్ధాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.

గురువారం:

మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివౄఎద్దిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రే యుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యా ఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గురువార వ్రతం చేయాలి.

వ్రతవిధానం:

ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్ళపాటు చేయాలి. స్నానా నంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచు లోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిసిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు. ఒకపూట తప్పనిసరిగా ఉపవాసం వుండి, స్వామికి నివేదించిన పదార్ధాలను స్వీకరించాలి.

శుక్రవారం:

దుర్గ, లక్ష్మి, సంతోషిమాతా, గాయత్రి తదితర దేవతల అనుగ్ర హాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్త్రణామం శుక్రవార పూజకు శ్రేష్ఠమైనది.

వ్రతవిధానం: ఈ పూజను శ్రావణమాసం లేదా ఏ మాసంలోనైనా శుక్లప క్షంలో వచ్చే తొలి శుక్రవారం నాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లని తల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.

శనివారం:

శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహువు, కేతువు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు నవగ్రహా స్తోత్రంతో శనివార వ్రతం చేయాలి.

వ్రతవిధానం: శ్రావణమాసం లేదా పుష్యమా సంలో వచ్చే తొలి శనివారం నాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచ రణ చేయాలి. వెంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వు లనూనె, ఆవు నెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు వత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో, సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి.

ఏ పూజ, వ్రతం చేసేటప్పుడైనా ఫలితం కోసం కాకుండా శ్రద్దాభక్తులతో చేయాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా వుండాలి. చన్నీటి స్నానం, మితాహారం, భూశయనం, బ్రహ్మచర్యం, మద్య, మాంసాలకు, అశ్లీల సంభాషణలకు, దృశ్యాలకు దూరంగా వుండాలి.

by
Rama Chandra Rao Akula

Astrology Articles

General Articles

English Articles



Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.

Read More
  

Monthly Horoscope

Check September Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.

Read More
  

Marriage Matching

Free online Marriage Matching service in English Language.

Read More
  
?php include $_SERVER["DOCUMENT_ROOT"] . '/includes/rantext.php'; ?>


Listen with an open mind and speak with kindness, good communication brings understanding.