Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2024 samvatsara Vrishabha rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Vrishabha Rashi in Telugu
కృత్తిక నక్షత్రం 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ) రోహిణి నక్షత్రం 1,2,3,4 పాదములు,(ఓ,వా,వీ,వూ) , మృగశిర నక్షత్రం 1,2 పాదములలో (వే,వో) జన్మించిన వారు వృషభ రాశి జాతకులు
వృషభరాశి వారికి ఈ సంవత్సరం శని పదవ స్థానమైన కుంభరాశిలో, రాహువు 11వ స్థానమైన మీన రాశిలో, కేతు ఐదవ స్థానమైన కన్య రాశిలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తారు. మే ఒకటవ తేదీ వరకు గురువు 12వ స్థానమైన మేషరాశిలో, ఆ తర్వాత ఒకటవ స్థానమైన వృషభ రాశిలో సంచరిస్తాడు.
వృషభ రాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. పదవ ఇంటిలో శని గోచారం మరియు 11 ఇంటిలో రాహువు గోచారం కారణంగా వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు. మీరు చేసే పనికి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ప్రథమార్ధంలో ఏప్రిల్ చివరి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా శ్రమకు తగిన ఫలితం లభించకపోవడం మరియు అనవసరమైన సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోవడం జరుగుతుంది. వృత్తిలో కొన్నిసార్లు రహస్య శత్రువుల కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ మీరు విజయవంతంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. కానీ ఆ సమస్యల కారణంగా కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కోల్పోవడం జరుగుతుంది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం పదవ ఇంటిలో ఉండటం వలన వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనులు నిజాయితీతో ఉండటం మరియు లాభాపేక్ష లేకుండా చేయటం వలన మీరు అందరి మన్ననలు పొందుతారు. శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన మీరు ఎక్కువ సమయం మీ వృత్తికి కేటాయిస్తారు. దాని కారణంగా ఇంటికి దూరం అవటమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోరు. అయితే ఈ విధంగా శ్రమించడం వలన మీ కుటుంబ సభ్యుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పనితో పాటు కుటుంబానికి మరియు విశ్రాంతికి సమపాళ్లలో సమయాన్ని కేటాయించడం వలన మీరు ఆరోగ్య సమస్యల నుంచి మరియు కుటుంబంలో ఉండే అసంతృప్తి నుంచి బయటపడగలుగుతారు. శని దృష్టి 12వ ఇంటిపై మరియు ఏడవ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరం మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ వృత్తి కారణంగా విదేశాలకు వెళ్తారు.
ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 11వ ఇంటిలో ఉండటం మరియు కేతువు గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన ఈ సంవత్సరం అంతా ఉత్సాహంగా పని చేయగలుగుతారు. అయితే చాలాసార్లు మీరు చేసిన పని మీకే నచ్చక మరింత మంచిగా చేద్దామనే ఉద్దేశంతో చేసిన పనినే పదేపదే చేయటం వలన ఎదుటివారి దృష్టిలో మీరు చాదస్తం కలిగిన వారుగా కనిపిస్తారు. అంతేకాకుండా మీలో ఉత్సాహం ఎక్కువయ్యి మీరు ఇచ్చే సలహాలు కానీ, మీ ఆలోచనలు కానీ ఎదుటివారు పాటించాలని కొన్నిసార్లు వారిని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. దాని కారణంగా ఎదుటివారి దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఉత్సాహాన్ని, శక్తిని సరైన విషయాలపై వాడటం వలన మీరు మరిన్ని విజయాలు సాధించగలుగుతారు.
మే ఒకటి నుంచి గురువు గోచారం ఒకటవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ వృత్తిలో అడ్డంకులు తొలగిపోయి మీరు మరింత స్వేచ్ఛగా పనులు చేసుకోగలుగుతారు. గురు దృష్టి 9వ ఇంటిపై, ఏడవ ఇంటిపై, మరియు ఐదవ ఇంటిపై ఉండటం వలన మీ పై అధికారుల మరియు సహోద్యోగుల సహకారం మీకు ఉంటుంది. ఈ సమయంలో విదేశీయానం గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా గతంలో విదేశీయానం గురించి ప్రయత్నించి అనుకూల ఫలితాలు పొందని వారికి ఈ సమయంలో విదేశీయానం సంభవిస్తుంది
.ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు పెరగటం, భాగస్వామితో ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు రావడం వలన వ్యాపారంలో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగదు. అయితే రాహు గోచారం బాగుండటం వలన ఒక్కోసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయం పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు. పదవ ఇంటిలో శని సంచారం కారణంగా శని దృష్టి ఏడవ ఇంటిపై ఉంటుంది దాని వలన వ్యాపారం ఒక్కోసారి లాభాల దిశగా మరోసారి నష్టాల దిశగా వెలుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం వినియోగదారులతో అనవసరమైన వివాదాలకు పోకుండా ఓపికగా ఉండటం మంచిది. ఎందుకంటే చాలాసార్లు మీ ఓపికను పరీక్షించే వ్యక్తులు మీకు తారసపడతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్ధంలో ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మీకు ఎదురవుతుంటాయి.
సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఓపికగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. 11వ ఇంటిలో రాహువు మీ ఉత్సాహం కానీ, పట్టుదల కానీ తగ్గకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే వ్యాపారంలో మీరు సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు మీకు విజయాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిర్ణయాలు మే నుంచి అనుకూల ఫలితాలను ఇస్తాయి.
ఈ సంవత్సరం మే నుంచి గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. సప్తమ స్థానంపై సప్తమ స్థానంపై గురు దృష్టి వ్యాపార అభివృద్ధి తో పాటుగా కొత్త భాగస్వామ్యాలు వ్యాపార ఒప్పందాలు జరిగేలా చేస్తుంది. వీటి కారణంగా మీకు కొంత ఆర్థిక భారం తగ్గటమే కాకుండా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఒకటవ ఇంటిలో గురువు గోచారం ఒక్కోసారి అనుకోని సమస్యలను కూడా ఇస్తుంది కాబట్టి మీరు ఈ ఒప్పందాలను సరిగా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకొని పూర్తి చేయడం మంచిది. లేకుంటే అనవసరమైన సమస్యలపాలయ్యే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం ఆర్థికంగా మే ఒకటవ తేదీ వరకు సామాన్యంగా ఉంటుంది ఆ తర్వాత ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. సంవత్సరం ఆరంభం నుంచి గురువు గోచారం 12వ ఇంటిలో ఉండటం వలన ఖర్చులు పెరుగుతాయి. అంతేకాకుండా అనవసరమైన విషయాల మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులతో పాటు విందు వినోదాలకు, విలాసాలకు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ ఈ సమయంలో తిరిగి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సమయానికి మిత్రుల ద్వారా కానీ స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ డబ్బు చేతికి అందడం వలన అప్పులు తిరిగి తీర్చగలుగుతారు. సంవత్సరం అంతా శని దృష్టి 12వ ఇంటిపై, మరియు నాలుగవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాలు చేయడం కానీ లేదా వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులను తాకట్టు పెట్టడం కానీ చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు డబ్బును వృధా చేసినట్లయితే అది మీకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 11 వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో సమయానికి డబ్బు చేతికి అందటం వలన ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పడరు. అయితే ఇప్పుడు అందే డబ్బులన్నీ కూడా తాత్కాలిక అవసరాలను తీర్చేవి కాబట్టి తిరిగి డబ్బు కావలసినప్పుడల్లా వేరొకరి దగ్గర తీసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. మీరు ఖర్చులను నియంత్రించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
మే నుంచి గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన బ్యాంకుల నుంచి కానీ, ఆర్థిక సంస్థల నుంచి కానీ మీకు డబ్బు అందే అవకాశం ఉంటుంది. దానితో గతంలో చేసిన అప్పులు కానీ, లోన్లు కానీ తీర్చగలుగుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంటుంది. కొనుగోళ్ల విషయంలో తొందరపాటుకు, గొప్పలకు పోకుండా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. అలా చేసినట్లయితే మీకు డబ్బు విషయంలో ఇబ్బంది ఉండదు.
వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే ఒకటి వరకు గురువు గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన తగ్గడం కానీ లేదా మాట పట్టింపులు పెరగడం వలన కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా రాహువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య పెద్దగా ఇబ్బంది పెట్టదు. అలాగే మీరు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మానసికంగా ధైర్యంగా ఉండటం, ఉత్సాహంగా ఉండటం వలన మీరు మిగతా వారికి ధైర్యం చెప్పగలుగుతారు, మరియు కుటుంబంలోని సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు వెతుకుతారు. గురువు దృష్టి ఎనిమిదవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి సాధ్యం అవుతుంది. అంతే కాకుండా ఆర్థిక స్థితి కూడా మెరుగు పడుతుంది. ఐదవ ఇంటిపై కేతువు సంచారం కారణంగా మీ పిల్లల ఆరోగ్య విషయంలో, వారి అభివృద్ధి విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు.
మే ఒకటి నుంచి గురువు గోచారం ఒకటవ ఇంటికి మారడంతో మీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోవడం మరియు పిల్లల ఆరోగ్య మెరుగుపడటం వలన మీ మానసిక ఆందోళనలు తగ్గుతాయి. గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడటం మరియు వారి సహాయ సహకారాలు మీకు అందటం వలన గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం కానీ, ఆధ్యాత్మిక గురువులను సందర్శించడం కానీ చేస్తారు. దాని కారణంగా మానసిక ప్రశాంతతను పొందుతారు.
ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన సంతానం గురించి ఎదురుచూస్తున్న వారికి అలాగే వివాహం గురించి ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితం లభిస్తుంది.
ఈ సంవత్సరం అంతా శని దృష్టి నాలుగవ ఇంటిపై మరియు 12వ ఇంటిపై ఉండటం వలన మీరు మే ఒకటి లోపు విదేశీయానం చేయడం కానీ, ఉద్యోగ కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడం కానీ జరుగుతుంది. అయితే ఇది మీకు ఇష్టం లేకున్నా తప్పనిసరిగా వెళ్లాల్సి రావడం వలన మానసికంగా కొంత ఒత్తిడికి లోన అయ్యే అవకాశం ఉంటుంది. మే ఒకటి నుంచి గురువు గోచారం కొంత అనుకూలంగా మారుతుంది కాబట్టి తిరిగి మీ కుటుంబంతో కలిసి జీవించడం కానీ లేదా మానసిక ఒత్తిడి తగ్గడం కానీ జరుగుతుంది.
ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తల అవసరం. మే ఒకటి వరకు గురు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాలేయము, వెన్నెముక మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. గురు గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అయితే సంవత్సరమంతా రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టవు.
మే 1 నుంచి గురువు దృష్టి అయిదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే సంవత్సరం అంతా శని దృష్టి 12వ ఇంటిపై, మరియు నాలుగవ ఇంటి పై ఉంటుంది మీరు మీ జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను కొంత మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బద్ధకానికి తావివ్వకుండా వీలైనంతవరకు శరీరానికి పని చెప్పండి. అంతేకాకుండా ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా తీపి పదార్థాలకు దూరంగా ఉండటం, సమయానుసారం ఆహారం తీసుకోవడం వలన చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయట పడగలుగుతారు. గురువు గోచారం అనుకూలంగా లేనప్పుడు కాలేయము మరియు మధుమేహ సంబంధ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మీరు ఈ ఆహార నియమాలను పాటించడం మంచిది.
ఈ సంవత్సరం అంతా శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులు మరియు ఎముకలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సంవత్సరం అంతా రాహు గోచారం 11వ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు మానసికంగా కుంగి పోరు దాని కారణంగా మీ ఆరోగ్య సమస్యలు కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి.
విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే వరకు గురువు దృష్టి నాలుగవ ఇంట ఉండటం వలన చదువుపై శ్రద్ధ మరియు ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో 12వ మరియు నాలుగవ ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు బద్ధకం కారణంగా లేదా అతి విశ్వాసం కారణంగా చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా రాహు గోచారం 11వ ఇంటిపై ఉండటం వలన చదువులో ఆటంకాలు ఏర్పడవు. మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఎక్కువగా శ్రమ చేసి చదవాల్సి ఉంటుంది. లేకున్నచో అనుకున్నంత స్థాయిలో మార్కులు రాకపోవటం జరుగుతుంది.
ఐదవ ఇంటిలో కేతు సంచారం కారణంగా పరీక్షల విషయంలో ఏదో ఒక భయం వీరిని ఈ సంవత్సరం అంతా వెంటాడుతుంది. అలాగే పరీక్ష సమయంలో కొన్నిసార్లు ఆరోగ్యం బాగుండక పోవడం కానీ లేదా చిన్న చిన్న అడ్డంకులు రావడం కానీ జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా కేవలం భయంకరంగా జరిగేవి కాబట్టి వీలైనంతవరకు భయానికి లొంగకుండా ఉండటం మంచిది. అలాగే చదువు విషయంలో మరియు పరీక్షల విషయంలో వాయిదాలు వేయకుండా ఉండటం మంచిది.
మే ఒకటి నుంచి గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన పరీక్షల విషయంలో ఉండే భయం తగ్గుతుంది. అంతేకాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. గురువు దృష్టి 9వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో గురువుల మరియు పెద్దవారి సహాయంతో చదువులో మంచి ప్రగతి సాధిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. ముఖ్యంగా మే నుంచి ఈ విషయంలో వీరు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. అయితే 12వ ఇంటిపై శని దృష్టి కారణంగా విదేశాలకు వెళ్లడానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించాల్సిన అవసరం రావచ్చు.
ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురువు దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వలన వారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు తద్వారా ఉద్యోగాన్ని పొందుతారు.
వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలంగా ఉండడు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారాలు చేయడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం, లేదా గురు మంత్ర జపం చేయడం చేయాలి. దీనితో పాటుగా గురుచరిత్ర పారాయణం చేయటం వలన కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గి, ఈ సంవత్సరంలో మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గురువు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులకు వారు చదువుకోడానికి తగిన సౌకర్యాలు అంటే వారికి అవసరమైన పుస్తకాలు కానీ, లేదా ఇతర చదువుకు సంబంధించిన సామాగ్రి కానీ ఇవ్వటం లేదా వారికి వీలున్నప్పుడల్లా ఉచితంగా విద్యా బోధన చేయడం వలన కూడా గురువు శుభ ఫలితాలు ఇస్తాడు.
ఈ సంవత్సరం అంతా కేతువు ఐదవ ఇంటిలో ఉండటం వలన సంతానానికి మరియు విద్యార్థులకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేతు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు కానీ, ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. దీనితోపాటు గణపతి స్తోత్ర పారాయణం కూడా చేయటం వలన కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.
వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. గురు ప్రభావం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వలన ధన నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ లేదా ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.