Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2024 samvatsara Meena rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Meena Rashi in Telugu
పూర్వాభాద్ర 4వ పాదం (ది)
ఉత్తరాభాద్ర 4 పాదాలు (దు, శం, ఝ, థ)
రేవతి 4 పాదాలు (దే, దో, చ, చి)
మీన రాశి వారికి, ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో 12వ ఇంటిలో, రాహు మీనరాశిలో ఒకటవ ఇంటిలో, మరియు కేతువు కన్యరాశిలో ఏడవ ఇంట్లో సంచరిస్తారు. గురువు మేషరాశిలో రెండవ ఇంటిలో మే ఒకటి వరకు సంచరిస్తాడు, ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో మూడవ ఇంట్లో సంచరిస్తాడు.
మీన రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే ఒకటి వరకు రెండవ ఇంటిలో గురువు గోచారం అనుకూలంగా ఉండటం, మే ఒకటి నుంచి గురువు గోచారం మూడవ ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండటం వలన ఈ సంవత్సరం వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మే ఒకటి వరకు గురు రెండో ఇంట్లో ఉండే సమయంలో వ్యాపారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ, కొత్త వ్యాపారాలు కాని ప్రారంభిస్తారు. ఈ సమయం భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ, వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. తొందరపడి తెలియని వ్యక్తులతో ఈ రకమైన ఒప్పందాలు చేసుకొని ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో గురువు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధితోపాటు పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు, లేదా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది. మీ వ్యాపారాల్లో ఉండే వివాదాలు విజయం సాధిస్తారు. మిమ్మల్ని నష్టపరచాలని చూసే వారు ఈ సమయంలో వారి నష్టపోవడం జరుగుతుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం మూడవ ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థికంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం వ్యాపార అభివృద్ధి కొరకు కేటాయిస్తారు అలాగే దాని కొరకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులను కలుసుకోవడం, కొత్త ప్రదేశాల్లో వ్యాపార అభివృద్ధికి మార్గం సుగమం చేసుకోవడం చేస్తారు. ఈ సమయంలో మీ భాగస్వాముల కారణంగా ఆర్థిక లాభాలు కలిగినప్పటికీ, వారితో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్య విభజన విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. న్యాయ సలహా వల్ల కానీ లేదా మిత్రుల సహకారం వల్ల కానీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం 12వ ఇంటిలో ఉండటం వలన వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు విదేశాలతో కానీ దూర ప్రదేశంలో ఉన్న వ్యక్తులతో కానీ వ్యాపారం చేస్తున్నట్లయితే దానిలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ, సంస్థలు కానీ వ్యాపారం ఆపేయాలనుకోవడం కానీ, లేదా ఎక్కువ డబ్బు కోరటం కానీ జరగవచ్చు. అలాగే మే ఒకటి తర్వాత, మీరు వ్యాపారానికి సంబంధించిన పన్నుల రూపంలో కానీ, అపరాధ రుసుము రూపంలో కానీ కొంత డబ్బు ప్రభుత్వానికి చెల్లించే అవకాశం ఉంటుంది, లేదా వ్యాపార వివాదాల పరిష్కారం కొరకు చెల్లించాల్సి వస్తుంది. ఈ సమయంలో తెలియని వ్యక్తులతో, తెలియని సంస్థలతో లాభాలు వస్తున్నాయని ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త పడటం మంచిది. అలాగే ఆర్థికపరమైన లావాదేవీలు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా రాహు ఒకటవ ఇంటిలో, కేతువు ఏడవ ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఏర్పడటం, లేదా వ్యాపార వివాదాల కారణంగా మనశ్శాంతి కోల్పోవడం జరుగుతుంది. చాలావరకు సమస్యలు మీరు మొండిగా ప్రవర్తించడం, లేదా ఎదుటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం వల్ల వస్తాయి. ఏడవ ఇంట్లో కేతు సంచారం కారణంగా వ్యాపారాలను అన్ని బాగున్నప్పటికీ ఏదో ఒక విషయంగా అనవసర భయాలు ఏర్పడటం జరుగుతుంది. దాని కారణంగా ఒక్కోసారి వ్యాపారంలో అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలా చూసుకుంటే ఈ చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.
మీనరాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురువు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి ఆరవ ఇంటిపై మరియు పదవి ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు చేసే పనికి గుర్తింపు లభించడమే కాకుండా మీ పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. మీరు మీ బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చడం వలన పదోన్నతి కూడా సాధ్యమవుతుంది. ఈ సమయంలో కొత్తగా ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వారికి కానీ, పదోన్నతి కొరకు ఎదురుచూస్తున్న వారికి కానీ అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ సహోద్యోగుల సహకారం కూడా మీకు లభించడం వల్ల మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు కూడా మీ సహ ఉద్యోగులకు సహాయ పడటం వలన వారి అభివృద్ధికి కారణమవుతారు. మీరు చెప్పే మాటలు, సలహాలు ఇతరులకు మరియు మీరు ఉద్యోగం చేసే కార్యాలయ అభివృద్ధికి సహకరించడం వలన కూడా మీరు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయం ఆర్థికంగా కూడా బాగుంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం మూడవ ఇంటికి మారటం వలన ఉద్యోగంలో కానీ, ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు బదిలీ కొరకు కానీ, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి కానీ ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూల ఫలితం లభిస్తుంది. అయితే దీని కొరకు మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రయత్నాలకు కొంతమంది అడ్డు తగిలే అవకాశం ఉంటుంది. కాకపోతే మీ నిజాయితీ, మరియు మీరు గతంలో చేసిన పనుల కారణంగా మీకు మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వటం కానీ లేదా విదేశాలకు వెళ్లడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీరు అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావటం కానీ లేదా కొత్త ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావటం కానీ జరుగుతుంది. గురు దృష్టి ఏడవ ఇంటిపై, తొమ్మిదవ ఇంటిపై, మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మరియు మీరు చేసిన పనికి తగిన ఫలితం కూడా పొందుతారు.
ఈ సంవత్సరం అంతా శని గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గురువు గోచారం రెండవ ఇంటిలో ఉన్నంతకాలం మీకు ఉద్యోగ పరంగా సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ, మూడవ ఇంటికి మారిన తర్వాత మిమ్మల్ని శత్రువులుగా భావించేవారు మరియు మీపై ఈర్ష్య పెంచుకునేవారు ఎక్కువ అవుతారు. వారి కారణంగా మీరు చేసే పనుల్లో, మరియు మీకు వచ్చే అవకాశాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మీరు ఆటంకాలను విజయవంతంగా తొలగించుకున్నప్పటికీ వాటి కారణంగా మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తవకపోవటం కానీ లేదా అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోవడం కానీ జరగవచ్చు. ముఖ్యంగా మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఇటువంటి సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకునేవారు కానీ లేదా మీకు సహాయపడేవారు కానీ లేకపోవడం వలన కొంత ఇబ్బంది లోనవుతారు. అయితే మీరు నిజాయితీగా పని చేయడం మరియు ఆటంకాలకు లొంగక పోవడం వలన మీకు ఇబ్బంది పెట్టేవారు తొలగిపోతారు.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఒకటవ ఇంటిలో మరియు కేతువు గోచారం ఏడవ ఇంటిలో ఉండటం వలన ఈ సంవత్సరం మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, మరియు మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు మీరు మొండిగా ఎవరికి లొంగకుండా ఉండటం, మరికొన్నిసార్లు అహంకారంతో ఉండటం వలన మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఎదుటివారికి సాధ్యం కాకపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు సహాయం చేద్దాం అనుకునే వారు కూడా మీ ప్రవర్తన కారణంగా వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు ఈ సంవత్సరం నిజాయితీగా ఉండటం మరియు వినయంగా ఉండటం వలన మీరు వృత్తిలోనే కాదు, జీవితంలో కూడా అభివృద్ధి సాధిస్తారు.
మీన రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి నాలుగు నెలలు అనుకూలంగా ఉంటుంది మిగిలిన సంవత్సరం అంతా ఫలితాలని ఇస్తుంది. మే ఒకటి వరకు గురువు గోచారం రెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా అత్యంత అనుకూలంగా ఉంది. మీరు చేసే ఉద్యోగం ద్వారా లేదా వ్యాపారం ద్వారా ఆదాయం పెరుగుతుంది. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో గురు దృష్టి అరవ ఇంటిపై మరియు ఎనిమిదవ ఇంటిపై ఉండటం వలన మీకు వారసత్వ సంబంధ ఆస్తులు కానీ, లేదా వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన ఆస్తులు కానీ ఈ సమయంలో తిరిగి మీకు అందుతాయి. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా భవిష్యత్ అవసరాల కొరకు ఆర్దికపరమైన పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం మూడో ఇంటికి మారడం వలన ఆర్థిక స్థితిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం పరంగా అభివృద్ధి సామాన్యంగా ఉండటం మరియు ఖర్చులు పెరగడం జరుగుతుంది. గురుదృష్టి 9వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ లేదా వారసత్వంగా రావలసిన స్థిరాస్తుల వల్ల కానీ కొంత ఆదాయం లభించినప్పటికీ, ఖర్చులు అధికంగా అవటం వలన వచ్చే ఆదాయం తగ్గటం జరుగుతుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది.
ఈ సంవత్సరం అంతా శనిగోచారం 12వ ఇంటిలో ఉండటం వలన గురు గోచారం బాగున్నంత కాలం మీకు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అయితే గురువు గోచారం మూడవ ఇంటికి మారిన తర్వాత కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల నిమిత్తం, మరియు వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. అంతేకాకుండా మీరు చేసే పొరపాట్ల కారణంగా మీకు రావలసిన లాభాల కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక లాభాలు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్నిసార్లు మీరు అహంకారంగా వ్యవహరించడం వలన మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాల్లో తొందరపాటు అసలు పనికిరాదు. మీరు స్థిరాస్తులు కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు సరైన వ్యక్తులను ఎంచుకోండి. లాభాలు వస్తున్నాయని అపోహలు తప్పుడు వ్యక్తులతో స్థిరాస్తి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేస్తే వాటి కారణంగా మీకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది.
మీనరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే 1 వరకు గురువు గోచారం రెండవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ కుటుంబ జీవితం ఈ సమయంలో బాగుంటుంది. మీ కుటుంబంలో శుభకార్యాలు జరగటం మరియు కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమాభిమానాలు పెరగడం జరుగుతుంది. మీ కుటుంబంలోకి నూతన వ్యక్తులు సభ్యులుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ కుటుంబ పట్ల మీ బాధ్యతలు పెరగడమే కాకుండా, మీ కుటుంబ సభ్యులు కూడా మీ మాటకు విలువ ఇస్తారు. ఒకవేళ మీరు అవివాహితులు అయ్యుండి పెళ్లి గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు పెళ్లి అయి ఉండి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో సంతానం కలిగే అవకాశం ఉంటుంది. గురువు దృష్టి ఎనిమిదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఇది మీ జీవిత భాగస్వామికి వృత్తిలో కానీ, ఆరోగ్యంలో కానీ అభివృద్ధిని ఇస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. మీరు చేసే పనుల కారణంగా మీ కుటుంబంలోనే కాకుండా, సమాజంలో కూడా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు నూతన గృహప్రవేశం చేయటం కానీ, కొత్త వాహనాన్ని కొనడం కానీ చేస్తారు.
మే ఒకటి నుంచి గురు గోచారం మూడవ ఇంటికి మారటం వలన ఈ సమయంలో మీ కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ వేరే ప్రదేశానికి వెళ్లడం, లేదా విదేశాలకు వెళ్లడం చేస్తారు. అంతే కాకుండా మీరు నివసించే ఇంటిలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బాగున్నప్పటికీ వారికి దూరంగా ఉన్నాననే బాధ మీలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా వెళ్లటం వాయిదా పడుతున్న ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కూడా చేస్తారు. గురు దృష్టి 11వ ఇంటిపై ఉండటం వలన మీరు మీ మిత్రులతో కలిసి లేదా మీ తోబుట్టులతో కలిసి కొత్తగా వ్యాపారం ప్రారంభించటం కానీ, లేదా వారు చేసే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ చేస్తారు.
ఈ సంవత్సరం అంతా శనిగోచారం 12వ ఇంటిలో ఉండటం వలన ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే ఒకటి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబ జీవితం బాగుంటుంది. మే ఒకటి నుంచి గురువు గోచారం మూడవ ఇంటికి మారటం వలన మరియు సంవత్సరం అంతా శని దృష్టి కుటుంబ స్థానమైన రెండవ ఇంటిపై ఉండటం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటిలో ఆరోగ్య సమస్యలు రావటం, లేదా కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్యలో అవగాహన లభించడం జరగవచ్చు. శని దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన మీ తండ్రి గారికి ఈ సంవత్సర ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు లేదా న్యాయ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారికి సంబంధించిన స్థిరాస్తి వ్యవహారాల విషయంలో తగాదాలు ఏర్పడడం కానీ, లేదా రావాల్సిన ఆస్తి వివాదాల కారణంగా రాకుండా ఆగిపోవడం కానీ జరగవచ్చు. అయితే ఈ సమస్య కొంతకాలం తర్వాత పరిష్కారం అవుతుంది. శని గోచారం 12వ ఇంటిలో ఉండా సమయంలో మీ మాటకు విలువ తగ్గిపోవడం కానీ, లేదా మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా మీ కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురవ్వటం కానీ జరగవచ్చు.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఒకటవ ఇంటిలో మరియు కేతువు గోచారం ఏడవ ఇంటిలో ఉండటం వలన మీలో అహంకారం కానీ, ఎవరి వినని స్వభావం కానీ అలవడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీ జీవిత భాగస్వామి ఎక్కువగా ఇబ్బంది పడిన అవకాశం ఉంది. అయితే మే ఒకటి నుంచి గురు దృష్టి ఏడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి దీని కారణంగా మీ జీవిత భాగస్వామి ఉండే సమస్యలు తొందరగానే తగ్గుముఖం పడతాయి.
మీనరాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే ఒకటి వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. చిన్న, చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయట పడగలుగుతారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. గురు దృష్టి అరవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ రోగ నిరోధక శక్తి కూడా బాగుంటుంది.
మే 1 నుంచి గురు గోచారం మూడవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. అయితే గురు దృష్టి 11వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అనారోగ్యాల బారిన పడ్డప్పటికీ వాటినుంచి తొందరగా బయటపడతారు.
ఈ సంవత్సరం అంతా శని గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి మే ఒకటి వరకు ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండనప్పటికీ, మే 1 నుంచి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా శని దృష్టి రెండవ ఇంటిపై, ఆరవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన తరచుగా ఆరోగ్య సమస్యలు రావడం, ముఖ్యంగా దంతాలు, ఊపిరితిత్తులు, మరియు మూత్ర సంబంధ సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఎముకలు మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. 12వ ఇంట్లో శని ప్రభావం కారణంగా మీలో కొంతమంది ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే చాలా మటుకు ఆరోగ్య సమస్యలు తొందరగానే తగ్గుముఖం పడతాయి కాబట్టి వీటి గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా శని మనలోని లోపాల్ని సరిచేసే గ్రహం కాబట్టి, మనలో ఉండే బద్ధకం కానీ, నియమిత ఆహారం తీసుకోక పోయే గుణం కానీ, సరైన వ్యాయామాలు చేయకుండా ఆరోగ్య సమస్యలను పెంచుకునే లక్షణాలని కానీ శని తగ్గిస్తాడు. ముందుగానే ఆరోగ్య విషయంలో మరియు ఆహార విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమయంలో వచ్చే చాలా మటుకు ఆరోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా తొందరగానే నయమవుతాయి.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఒకటో ఇంటిలో ఉంటుంది కాబట్టి మెడ, తల మరియు గ్యాస్టిక్ సంబంధం ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మే ఒకటి నుంచి గురు గోచారం మధ్యమంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీనరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో వారు సరైన ఆహారపు అలవాట్లు కానీ, శారీరక అలవాట్లు కానీ లేకుండా ఉండటం వల్లనే వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, వీలైనంతవరకు బద్దకానికి తావివ్వకుండా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మరియు యోగా ప్రాణాయామం లాంటి వాటితో పాటు శారీరక వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకోవడం వలన ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
మీనరాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు అత్యంత అనుకూలంగా ఉంటుంది మిగిలిన సంవత్సరమంతా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారికి చదువుపై శ్రద్ధ పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కూడా ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా వారు పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవడం వలన వారు అనుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం పొందటమే కాకుండా మంచి గుర్తింపు కూడా పొందుతారు.
మే ఒకటి నుంచి గురు గోచారం మూడవ ఇంటిలోకి మారడంతో విద్యార్థులకు చదువుపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునేవారు వారు తాము అనుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం పొందడానికి ఈ సమయంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. గురు గోచారం మూడవ ఇంటిలో ఉండటం వలన చదువుపై కొంత ఆసక్తి తగ్గడం కానీ లేదా విదేశాలకు వెళ్లే విషయంలో సమాచార లోపం కారణంగా ఆటంకాలు ఏర్పడటం జరగవచ్చు. ఈ సమయంలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా పెద్దలు లేదా అనుభవజ్ఞుల సహాయం కాని సలహా కానీ తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ద్వితీయార్థంలో విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గటం కానీ, లేదా బద్ధకం మరియు వాయిదా వేసే స్వభావం ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుంది. దీని కారణంగా చదువులో అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధించకపోవడం కానీ లేదా వారు అనుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం లభించక పోవడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునేవారు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో అన్ని రకాల వివరాలు తెలుసుకొని ఆ తర్వాతే ప్రయత్నం ప్రారంభించడం మంచిది. శని కారణంగా మీకు తప్పుడు సమాచారం రావడం కానీ లేదా సమాచార లోపం ఏర్పడడం కానీ జరగవచ్చు లేదా విదేశాలకు వెళ్లాక అక్కడ కొన్ని ఇబ్బందులకు గురి కావడం జరగవచ్చు. కాబట్టి వెళ్లడానికి ముందే అన్ని రకాల వివరాలను తెలుసుకొని మరియు అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందడుగు వేయటం మంచిది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ద్వితీయార్థంలో విద్యార్థులకు అహంకారం కానీ, లేదా ఎదుటివారి మాటలు గౌరవించని స్వభావం కానీ ఏర్పడవచ్చు. దీని కారణంగా వీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యాసంస్థల ఎంపికలో కానీ, చదివే కోర్సుల ఎంపికలో కానీ తొందరపాటుతనం లేకుండా జాగ్రత్తగా అన్ని పరిశీలించి ఎంచుకోవడం మంచిది. అన్నీ తెలుసనే తప్పుడు భావనతో ముందుకెళ్తే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్ధం అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మీరు అనుకున్నది సాధించడానికి సరైన కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. రాహు మరియు శనుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సంవత్సరం బద్ధకానికి అలాగే అహంకారానికి తావివ్వకుండా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు.
మీనరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం శనికి, రాహువుకు, కేతువుకు, మరియు గురువుకు పరిహారాలు చేయటం మంచిది. ఈ సంవత్సరం గురు గోచారం మే ఒకటి నుంచి మూడవ ఇంటిలో ఉంటుంది కాబట్టి గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి గురువుకు పరిహారాలు చేయటం మంచిది. దీని కొరకు ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు మంత్ర జపం చేయటం లేదా గురు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేయటం వలన కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. పైన చెప్పిన పరిహారాలతో పాటుగా విద్యార్థులకు వారి చదువుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, లేదా వారికి చదువు చెప్పటం, అలాగే గురువులను గౌరవించడం మొదలైనవి చేయటం వలన గురువు ప్రభావం తగ్గుతుంది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి, శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి శనికి పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం, శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. వీటితోపాటు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం కానీ చేయటం మంచిది. దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం తగ్గాలంటే వీలైనంతవరకు సేవ చేయడం మంచిది. శారీరక లోపాలున్న వారికి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన కూడా శని ప్రభావం తగ్గుతుంది. శని మనలోని లోపాలని బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలా చేస్తాడు కాబట్టి శని ప్రభావము వలన వచ్చే సమస్యలను గురించి భయపడటంకంటే ఆ సమస్యకు కారణం ఏంటో కనుక్కోగలిగితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.
ఈ సంవత్సరం అంతా రాహువు 1వ ఇంటిలో సంచరిస్తాడు కాబట్టి, రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి రాహువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు రాహు మంత్ర జపం చేయటం లేదా ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ చదవడం మంచిది. అంతేకాకుండా దుర్గా సప్తశతి పారాయణం చేయటం వలన కూడా రాహు ప్రభావం తగ్గుతుంది. రాహువు మనను ప్రలోభ పెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రభావానికి లొంగకుండా ఉండటానికి పైన చెప్పిన స్తోత్రాలతో పాటుగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అహంకారానికి లోనుకాకుండా ఉండటం, ఇతరుల మాటలకు పొగడ్తలకు లొంగక పోవటం, ఆలోచన కంటే ఎక్కువ ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వటం చేస్తే మీరు రాహు ప్రభావం నుంచి బయట పడగలుగుతారు.
ఈ సంవత్సరమంతా కేతువు ఏడవ ఇంట్లో సంచరిస్తాడు కాబట్టి, కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతి రోజు కాని, ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. దీనితోపాటు గణపతి స్తోత్ర పారాయణం కూడా చేయటం వలన కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.
Free KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in English.
Read MoreKnow your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.
Read More