OnlineJyotish


2024 తులా రాశి ఫలాలు Tula Rashi కెరీర్, ఆర్థికం, ప్రేమ, ఆరోగ్యం


2024 తులా రాశిఫలములు

2024 సంవత్సరంలో తులా రాశి ఫలములు

Tula Rashi - Telugu Rashi Phalalu (Rasi phalamulu)

2024 Rashi phalaalu
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2024 samvatsara Tula rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Tula Rashi in Telugu

image of Tula Rashiచిత్త 3, 4 పాదాలు (ర,రి),
స్వాతి నాలుగు పాదాలు (రు, రె, రో,త),
విశాఖ 1, 2, 3 పాదాలు (తి, తు, తే)


2024 సంవత్సరములో తులా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది.

తులా రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరమంతా శని కుంభ రాశిలో, ఐదవ ఇంటిలో, రాహువు మీన రాశిలో, ఆరవ ఇంటిలో మరియు, కేతువు కన్య రాశిలో 12వ ఇంటిలో సంచరిస్తారు. మే ఒకటి వరకు గురువు గోచారం మేషరాశిలో, ఏడవ ఇంటిలో ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన సంవత్సరం అంతా గురువు వృషభరాశిలో, ఎనిమిదవ ఇంటిలో సంచరిస్తాడు.

2024 సంవత్సరంలో తులా రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది.

తులా రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మే 1 వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత వ్యాపార పరంగా సామాన్య ఫలితం ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం ఏడవ ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వలన వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి మూడవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన, మిత్రులు లేదా పరిచయస్తుల సహాయంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవటానికి వీరి సహాయం అవసరం అవుతుంది. ఈ సమయంలో రాహు గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు కానీ, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కానీ మే ఒకటి లోపు ఈ పని చేయటం మంచిది. ఆ తర్వాతి సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. మే 1 వరకు గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన కోర్టు కేసులు కానీ, ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. దాని కారణంగా వ్యాపార పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి.



మే ఒకటి నుంచి గురు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల కానీ, లేదా మీ వ్యాపార భాగస్వాముల వల్ల కానీ ఈ సమస్యలు వస్తాయి. దాని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవడం లేదా అనుకున్నంత స్థాయిలో లాభాలు రాకపోవటం జరుగుతుంది. ఈ సమయంలో ఏడవ ఇంటిపై శని దృష్టి కారణంగా మీరు స్వయంకృత తప్పిదాలు కారణంగా వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కోవటం కానీ లేదా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవటం కానీ జరుగుతుంది. ఆరవ ఇంట్లో రాహువు గోచారం కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే అవకాశాలు లభించడం వలన మీరు ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు, లేదా వ్యాపార ప్రారంభాలు చేయటం అంతగా అనుకూలించదు. మిమ్మల్ని ప్రలోభ పెట్టి తమ పనులు చేసుకునేలా కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో ఆర్థికపరమైన పెట్టుబడుల విషయంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకోవడం వలన తర్వాత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇటువంటి ఒప్పందాలు చేయాల్సి వచ్చినప్పుడు నిపుణుల లేదా శ్రేయోభిలాషుల సలహా తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది.

ఈ సంవత్సరం కేతు గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు నష్టం కలిగించే వాటిపై ఎక్కువ దృష్టి పెడతారు. ముఖ్యంగా మీ ఆలోచనలపై, ఆచరణ పై ఎదుటివారి ప్రమేయం ఎక్కువగా ఉండటం వలన మీరు సొంత నిర్ణయాలు తీసుకోలేక పోతారు. వీలైనంతవరకు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

2024 సంవత్సరంలో తులా రాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఏ విధంగా ఉండబోతోంది.



తులా రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఉద్యోగ పరంగా మిశ్రమంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా గురువు దృష్టి లాభ స్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టిన పనుల ద్వారా మీరు విజయాలు సాధించడమే కాకుండా అవి మీ వృత్తిలో అభివృద్ధికి దోహదపడతాయి. అంతేకాకుండా, ఈ సమయంలో పై అధికారుల లేదా సహోద్యోగుల సహకారం కూడా మీ వృత్తిలో అభివృద్ధికి సాయపడుతుంది. ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావాలని కోరుకునే వారికి, వారు అనుకున్న ఫలితం లభిస్తుంది. వారు కోరుకున్న మార్పు లభిస్తుంది. గురుదృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీరు చేసే పనిని నిజాయితీగా, ఏకాగ్రతగా చేయటం వలన మీ కార్యాలయంలో పై అధికారుల మెప్పును పొందటమే కాకుండా మీ సహోద్యోగుల ప్రేమాభిమానాలను పొందుతారు. మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, అవసరమైనప్పుడు మీరు చేసిన సాయం కారణంగా మీ తోటి ఉద్యోగులకు లాభం జరుగుతుంది.

మే 1 నుంచి గురువు గోచారం ఎనిమిదవ ఇంటికి మారడంతో పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో ఉన్న విధంగా మీ వృత్తిలో ఇతరుల సహకారం తగ్గుతుంది. మీరంటే మిగిలిన వారికి ఈర్షకాని, ద్వేషం కానీ ఏర్పడతాయి. దాని కారణంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నిస్తారు. అలాగే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల కానీ, గతంలో మీరు చేసిన తప్పులు ఎత్తిచూపుతూ, మిమ్మల్ని అవమానపరచాలని కానీ కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాలను మీరు ధైర్యంగా, నిజాయితీగా ఎదుర్కొనటం మంచిది.

12 ఇంటిలో కేతు గోచారం కారణంగా నిర్ణయం తీసుకోవడంలో లేదా మీపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు ఎదుర్కోవటంలో మీరు కొంత భయానికి సంకోచానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు మీ కార్యాలయంలో ఒంటరివారయ్యారనే ఆత్మ న్యూనత భావానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది.

సంవత్సరం అంతా రాహు గోచారం ఆరవ ఇంటిలో అత్యంత అనుకూలంగా ఉండటం వలన మీరు కేతు గోచారం కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడ్డప్పటికీ మళ్లీ ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోగలుగుతారు. అంతేకాకుండా మీకు చెడు చేయాలనుకునే వారు కూడా మీరు ఎదురు దాడి చేయడంతో పక్కకు తొలగిపోతారు. ఉద్యోగంలో మీరు కోరుకున్న పదవిని కానీ, స్థానాన్ని కానీ పొందటానికి మీరు నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది.

ఐదవ ఇంటిలో శని గోచారం కారణంగా ఈ సంవత్సరం మే 1 నుంచి మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో మీరు తొందరపడి మాట ఇవ్వడం కారణంగా లేదా, మీకు సంబంధం లేని పనులు జోక్యం చేసుకోవడం కారణంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు మీరు ఈ సమయంలో వేరే విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీకు కేటాయించడం పనులు పూర్తి చేయడం మంచిది. చాలాసార్లు మీరు చాలా సులువుగా చేస్తాను అనుకోని మాట ఇచ్చి ఆ తర్వాత ఆ పనులు పూర్తి చేయలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాని కారణంగా మీరు ఇతరుల దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంటుంది.

2024 సంవత్సరంలో తులా రాశిలో జన్మించిన వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతోంది.



తులా రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా ప్రధమార్ధం అనుకూలమైన ఫలితాలను, ద్వితీయార్థం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురువు గోచారం ఏడవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. గురువు దృష్టి 11, 1, మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా గతంలో స్థిరాస్తుల పై పెట్టిన పెట్టుబడులు, లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వచ్చిన డబ్బులతో స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీకు లాభం చేసేవిగా ఉండటం వలన, మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇవ్వటమే కాకుండా, మీరు ఇచ్చిన సలహాలు కారణంగా ఇతరులు కూడా ఆర్థికంగా లాభపడతారు.

మే ఒకటి నుంచి గురువు గోచారం ఎనిమిదవ ఇంటికి మారటం వలన ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆదాయం తగ్గడం కానీ, రావలసిన డబ్బు రాకుండా ఆగిపోవటం కానీ జరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకున్న లాభాలను ఇవ్వకపోగా నష్టాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు తొందరపడి గానీ, గొప్పలకు పోయి కానీ చేసే ఖర్చులు, పెట్టే పెట్టుబడులు ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవు. దాని కారణంగా మీరు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీరు లాభం వస్తుందని, రిస్కు తీసుకొని ఇతరులకు ఇచ్చిన డబ్బు కూడా నష్టపోవడం కానీ లేదా అవసరమైన సమయానికి అందకపోవటం కానీ జరుగుతుంది. ఈ సమయంలో వీలైనంతవరకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఆయా రంగాల్లో నిపుణులను సంప్రదించి పెట్టుబడులు పెట్టడం మంచిది.

ఈ సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ద్వితీయార్థంలో ఖర్చులు పెరిగినప్పటికీ మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ, ఆర్థిక సాయం ద్వారా కానీ ఈ డబ్బు మీకు అందుతుంది. తిరిగి చెల్లించాల్సిన డబ్బే అయినప్పటికీ సమయానికి మీ అవసరం తీరుస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు.

12వ ఇంటిలో కేతువు గోచారం మరియు ఐదవ ఇంటిలో శని గోచారం ఆర్థిక విషయాలకు అంతగా అనుకూలించదు. వీరిద్దరి గోచారం కారణంగా మీరు లాభం చేయని వాటిపై పెట్టుబడులు పెట్టడం కానీ, అనవసరమైన విషయాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కానీ చేస్తారు. ముఖ్యంగా ఇతరుల ప్రలోభాలకు లొంగి లేదా వారి చేతిలో మోసపోయి ఆర్థికపరమైన చిక్కులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ లాభాలను ఇచ్చేలా ఉండే రిస్క్ తో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం కంటే తక్కువ లాభాలను ఇచ్చినప్పటికి తక్కువ రిస్క్ ఉండే పెట్టుబడులు పెట్టడం మంచిది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఆయా రంగాల్లో నిపుణుల లేదా మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది.

2024 సంవత్సరంలో తులా రాశిలో జన్మించిన వారి కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతోంది.



తులా రాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే ఒకటి వరకు గురువు గోచారం ఏడవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన కుటుంబంలో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో ఉన్న అనుమానాలు కానీ, అపార్థాలు కాని తొలగిపోయి ఇద్దరి మధ్యన ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఈ సమయంలో గురు దృష్టి 11వ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన, మీ తోబుట్టులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి, మరియు వారు జీవితంలో అభివృద్ధికి వస్తారు. వారి రంగాల్లో విజయాలు సాధిస్తారు. గురు దృష్టి ఒకటో ఇంటిపై ఉండటం వలన మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులను ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. మీరు అవివాహితులు అయ్యుండి వివాహం కొరకు ఎదురుచూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లి అయి సంతానం గురించి ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితం లభిస్తుంది.

మే ఒకటి నుంచి గురువు గోచారం ఎనిమిదవ ఇంటికి మారటం వలన కుటుంబ పరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ, లేదా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవ్వటం వలన కుటుంబంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది. గురు దృష్టి 12 ఇంటిపై, రెండవ ఇంటిపై మరియు నాలుగో ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగరీత్యాకాని, ఇతర కారణాల రీత్యా కానీ మీరు కొంతకాలం మీ ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అయితే కుటుంబ సభ్యులతో సంబంధం బాంధవ్యాలు అనుకూలంగా ఉండటం వలన ఈ దూరం కారణంగా ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండదు. ఈ సమయంలో మీరు మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీలో ఉండే అసహనం కారణంగా కానీ, ఆవేశం కారణంగా కానీ మీరు మీ కుటుంబ సభ్యులను లేదా బంధువులను పరుష మాటలతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే గురు దృష్టి కూడా రెండవ ఇంటిపై ఉండటం వలన మీ తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీలైనంతవరకు ఈ సమయంలో ఆదేశానికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండటం వలన చాలా సమస్యలు దూరం అవుతాయి.

ఈ సంవత్సరం అంతా శని గోచారం ఐదో ఇంటిలో ఉండటం వలన మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే వారు చదువు రీత్యాకాని, ఉద్యోగరీత్యా కాని ఈ సమయంలో ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ కారణంగా మీరు కొంత ఆందోళనకు గురవుతారు. శని దృష్టి ఏడవ ఇంటిపై మరియు 11 ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడటం కానీ, వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని వ్యతిరేక భావనలు ఏర్పడటం కానీ జరుగుతుంది. దాని కారణంగా ఇద్దరి మధ్యలో ప్రేమాభిమానాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మీ బంధువుల కారణంగా కూడా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన, సమస్యలు వచ్చినప్పటికీ మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కునే ప్రయత్నం చేస్తారు. అయితే కొన్నిసార్లు 12వ ఇంటిలో కేతు గోచారం కారణంగా మీకు అందరు దూరం అవుతున్నారనే భావన కలిగి ఉంటారు. దాని కారణంగా కుటుంబ సభ్యుల గురించి అతి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు ఇలాంటి సందర్భాలలో మీ మనసులో వచ్చే ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అవటం మంచిది. దాని కారణంగా కేతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి.

2024 సంవత్సరంలో తులా రాశిలో జన్మించిన వారి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉండబోతోంది.



తులా రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే ఒకటి వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు తొందరగానే వాటి నుంచి కోలుకుంటారు. గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన ఎక్కువవుతుంది. దాని కొరకు తగ్గిన ప్రయత్నాలు కూడా చేస్తారు. దీని కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

మే ఒకటి నుంచి గురువు గోచారం ఎనిమిదవ ఇంటికి వాడటంతో ఆరోగ్య విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మీలో ఆరోగ్యపరంగా నిర్లక్ష్య ధోరణి ఆరంభమవుతుంది. దాని కారణంగా మీరు మీ ఆరోగ్యానికి ప్రాముఖ్యతనివ్వక అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటారు. గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో కాలేయము, మధుమేహం, ఊబకాయం, మరియు వెన్నెముక సంబంధం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీటిలో ఎక్కువ శాతం మీరు సరైన ఆహారం తీసుకోకపోవడం మరియు శారీరక నియమాలు పాటించకపోవడం వలన వచ్చేవే అయి ఉంటాయి.

ఈ సంవత్సరం అంతా శని గోచారం ఐదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు హృదయము, దంతాలు, మూత్ర సంబంధ మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా శని దృష్టి 11వ ఇంటిపై ఉండటం వలన వ్యాధులను కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సరైన ఆహార నియమాలు, యోగ, ప్రాణాయామం లాంటి పద్ధతులను పాటించడం మంచిది.

ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఆరవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు కృంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం అంతా కేతు గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు కొన్నిసార్లు మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి ఎక్కువ భయపడటం, ఉన్న సమస్య కంటే ఎక్కువ ఊహించుకొని అతిగా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, లేదా బాధపడడం కానీ చేస్తారు. ఈ సమయంలో వీలైనంతవరకు కేతువు కారణంగా వచ్చే ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోవడం మంచిది. దాని కారణంగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా తయారవుతారు.

2024 సంవత్సరంలో తులా రాశిలో జన్మించిన వారి చదువు ఏ విధంగా ఉండబోతోంది.



తులా రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరు చదువులో బాగా రాణిస్తారు. గురు దృష్టి ఒకటవ, మూడవ, మరియు 11వ ఇంటిపై ఉండటంతో వీరిలో చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కూడా ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా తాము అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణులు అవ్వటానికి విశేషంగా కృషి చేస్తారు. ఈ సమయంలో ఉన్నత విద్య కొరకై వీరు చేసే ప్రయత్నాలు ఫలించి వారు అనుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం పొందుతారు.

మే 1 నుంచి గురువు గోచారం ఎనిమిదవ ఇంటికి మారడంతో చదువు విషయంలో వీరిలో కొంత అహంకార ధోరణి, నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది. వారు అనుకున్న లక్ష్యం సాధించడంతో చదువు విషయంలో తమకు తిరుగులేదని అహంకార ధోరణిని ప్రదర్శిస్తారు. దాని కారణంగా చదువును నిర్లక్ష్యం చేస్తారు. ఇటువంటి ప్రవర్తన కారణంగా వారు గతంలో పడిన కష్టానికి సరైన ఫలితం రాక, వచ్చిన ఫలితంతోనే తృప్తి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరు నిర్లక్ష్యానికి, అహంకారానికి తావివ్వకుండా తాము నేర్చుకోవలసినది మరియు సాధించవలసినది ఎంతో ఉంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే అది వారికి మంచి భవిష్యత్తును ఇస్తుంది.

ఈ సంవత్సరం అంతా రాహువు గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన వీరు చదువు విషయంలో తమ పోటీదారుల కంటే ఉత్తమ ఫలితాన్ని సాధించాలని తపనను కలిగి ఉంటారు. దాని కొరకు ఉత్సాహం తగ్గకుండా కృషి చేస్తారు. అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని తమ మనోబలంతో అని, విశేష కృషితో కానీ తొలగించుకొని ముందుకు వెళతారు. అయితే ఈ సంవత్సరం అంతా కేతువు గోచారం 12 ఇంటిలో ఉంటుంది కాబట్టి ఒక్కసారి వీరిలో మనోబలం తగ్గి భయం పెరిగే అవకాశం ఉంటుంది. తమ నిర్లక్ష్యం కారణంగా కానీ, తాము చేసిన తప్పుల వల్ల కానీ చదువులో ఆటంకాలు వస్తాయేమో అనే భయంతో వారు మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. అయితే రాహు గోచారం అనుకూలంగా ఉండడం వలన ఈ భయాల్ని వారు జయించగలుగుతారు. అంతేకాకుండా గురువుల మరియు పెద్ద సహకారంతో, ప్రోత్సాహంతో వారి లక్ష్యాన్ని చేరుకుంటారు.

ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సంవత్సరం మే 1 వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. గురువు గోచారం ఒకటవ ఇంటిపై ఉండటం వలన వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని, వారు కృషి చేస్తున్న రంగంలో నిపుణులను, అనుభవజ్ఞులను కలుసుకొని వారి సలహాలను, సూచనలను స్వీకరిస్తారు. మే ఒకటి నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండకపోవటం, మరియు సంవత్సరం అంతా శని గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో వీరు ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చిన తమ లక్ష్యాన్ని చేరుకోవాలని తపన, మరియు దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నట్లయితే వారు పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న ఉద్యోగాన్ని పొందగలుగుతారు.

2024 సంవత్సరంలో తులా రాశిలో జన్మించిన వారు చేసాల్సిన పరిహారాలు



తులా రాశి వారు ఈ సంవత్సరం గురువుకు, శనికి మరియు కేతువుకు పరిహారాలు చేయాలి. 5వ ఇంటిలో శని గోచారం కారణంగా సంతానం, మరియు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి పరిహారాలు చేయడం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. దీనికిగాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం, శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. వీటితోపాటు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం కానీ చేయటం మంచిది. దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం తగ్గాలంటే వీలైనంతవరకు సేవ చేయడం మంచిది. శారీరక లోపాలున్న వారికి కానీ, అనాధలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన కూడా శని ప్రభావం తగ్గుతుంది. శని మనలోని లోపాలని బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలా చేస్తాడు కాబట్టి శని ప్రభావము వలన వచ్చే సమస్యలను గురించి భయపడటం కంటే ఆ సమస్యకు కారణం ఏంటో కనుక్కోగలిగితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.

ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ, గురు మంత్ర జపం చేయటం కానీ మంచిది. దీని వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. వీటితోపాటు గురువులను, పెద్దలను గౌరవించడం, మరియు విద్యార్థులకు వారి చదువు ముందు సాగేలా వారికి తోచిన రూపంలో సాయం చేయడం మంచిది.

ఈ సంవత్సరం అంతా కేతు గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో మరియు ఆర్థిక విషయంలో వచ్చే సమస్యలు తొలగిపోవడానికి కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. దీనితోపాటు గణపతి స్తోత్ర పారాయణం కూడా చేయటం వలన కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.




2024 సంవత్సర రాశి ఫలములు

Aries (Mesha Rashi)
Imgae of Aries sign
Taurus (Vrishabha Rashi)
Image of vrishabha rashi
Gemini (Mithuna Rashi)
Image of Mithuna rashi
Cancer (Karka Rashi)
Image of Karka rashi
Leo (Simha Rashi)
Image of Simha rashi
Virgo (Kanya Rashi)
Image of Kanya rashi
Libra (Tula Rashi)
Image of Tula rashi
Scorpio (Vrishchika Rashi)
Image of Vrishchika rashi
Sagittarius (Dhanu Rashi)
Image of Dhanu rashi
Capricorn (Makara Rashi)
Image of Makara rashi
Aquarius (Kumbha Rashi)
Image of Kumbha rashi
Pisces (Meena Rashi)
Image of Meena rashi

Free Astrology

Newborn Astrology, Rashi, Nakshatra, Name letters

Lord Ganesha blessing newborn Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn. This newborn Astrology service is available in  English,  Hindi,  Telugu,  Kannada,  Marathi,  Gujarati,  Tamil,  Malayalam,  Bengali, and  Punjabi,  French,  Russian, and  German. Languages. Click on the desired language name to get your child's horoscope.

Star Match or Astakoota Marriage Matching

image of Ashtakuta Marriage Matching or Star Matching serviceWant to find a good partner? Not sure who is the right match? Try Vedic Astrology! Our Star Matching service helps you find the perfect partner. You don't need your birth details, just your Rashi and Nakshatra. Try our free Star Match service before you make this big decision! We have this service in many languages:  English,  Hindi,  Telugu,  Tamil,  Malayalam,  Kannada,  Marathi,  Bengali,  Punjabi,  Gujarati,  French,  Russian, and  Deutsch Click on the language you want to see the report in.