Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2024 samvatsara Kanya rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Kanya Rashi in Telugu
ఉత్తర 2,3, 4 పాదాలు (టొ, ప, పి)
హస్త 4 పాదాలు (పు, షం, ణ, ఠ)
చిత్త 1,2 పాదాలు (పె, పొ)
కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో, ఆరవ ఇంటిలో, రాహువు మీన రాశిలో, ఏడవ ఇంటిలో మరియు కేతువు కన్యా రాశిలో, ఒకటవ ఇంటిలో సంచరిస్తారు. మే ఒకటి వరకు గురువు మేషరాశిలో, ఎనిమిదవ ఇంటిలో సంచరిస్తాడు ఆ తర్వాత వృషభరాశిలో, తొమ్మిదవ ఇంటిలో సంచరిస్తాడు.
కన్యా రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం అంతా ఏడవ ఇంటిలో రాహు గోచారం ఉండటం మరియు మే ఒకటి వరకు గురువు గోచారం ఎనిమిదవ ఇంటిలో అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గురువు గోచారం మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మే ఒకటి లోపు వ్యాపారంలో కొన్ని చిక్కులు ముఖ్యంగా భాగస్వాములతో కానీ లేదా న్యాయపరమైనవి కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటి కారణంగా డబ్బు ఖర్చు అవ్వడం మరియు వ్యాపార పరంగా కూడా కొంత చెడు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల కానీ లేదా ఇతరుల ప్రోత్బలంతో అత్యాశకు పోయి చేసే పనుల వల్ల కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు వీలైనంతవరకు నిజాయితీగా ఉండటం మరియు ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా ఉండటం, మరియు స్వశక్తిపై నమ్మకంతో ఉండటం వలన ఈ సమయంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి ఎటువంటి నష్టం లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం తొమ్మిదవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. గతంలో ఏర్పడిన న్యాయపరమైన చిక్కులు కానీ లేదా వ్యాపార పరమైన చిక్కులు కానీ ఈ సమయంలో తొలగిపోయి మీ వ్యాపారం బాగా నడుస్తుంది. మీకు వచ్చిన చెడ్డపేరు గాని అపవాదు కానీ తొలగిపోతాయి. ముఖ్యంగా పెద్దవారి లేదా న్యాయ నిపుణుల సహకారంతో ఈ సమస్య నుంచి బయటపడతారు. గురు దృష్టి ఒకటవ ఇంటిపై, ఐదవ ఇంటిపై, మరియు మూడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, పెట్టే పెట్టబడులు మీ వ్యాపారంలో అభివృద్ధికి సహకరిస్తాయి. గతంలో సమస్యల కారణంగా విడిపోయిన వ్యాపార భాగస్వాములు తిరిగి రావటం కానీ, కొత్తగా వ్యాపార భాగస్వాములు రావడం కానీ జరుగుతుంది. దీని కారణంగా మీరు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి అవకాశం దొరుకుతుంది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం ఆరవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ అభివృద్ధిలో మరియు మీ సమస్యల్లో వారు మీకు తోడుగా ఉండటం వలన మీరు మీ వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. అయితే సంవత్సరం అంతా కేతువు గోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పటికీ లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనుకున్నప్పటికీ ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఊగిసలాడుతుంటారు. కొన్నిసార్లు మీరు వ్యాపార పరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వలన మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు మీ శ్రేయోభిలాషుల లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందడుగు వేయటం మంచిది.
కన్యా రాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురు గోచారం, సంవత్సరం అంతా రాహువు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా మీ సహోద్యోగులతో సరైన అవగాహన లేకపోవడం మరియు చీటికిమాటికి వారితో గొడవలు రావడం వలన ఈ సమయంలో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పనిచేసే చోట ఎవరి సహకారం లేకపోవడం మరియు చేస్తానని ఒప్పుకున్న పనులు సమయానికి చేయకపోవడం వలన పై అధికారులతో అవమానాలు ఎదురవటం జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంతవరకు గొప్పలకు పోయి మీ శక్తికి, సామర్థ్యానికి మించిన పనులను చేయటానికి ప్రయత్నించటం మంచిది కాదు. దీని కారణంగా మీరు ఆ పనులు చేయకపోవడమే కాకుండా మీ సహోద్యోగుల దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంటుంది. ఏడవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీకు ఇబ్బందులు కలిగించాలని, మరియు మీ పనులకు ఆటంకాలు కలిగించాలని ఎవరో ఒకరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఈ సమయంలో శనిగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగం పోవటం కానీ, లేదా ఉద్యోగ విషయంలో ఇతర సమస్యలు కానీ ఉండవు.
మే 1 నుంచి గురువు గోచారం 9వ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు పదోన్నతితో వేరే ప్రదేశముకు మారటం వలన కానీ లేదా మీకు ఇబ్బంది పెడుతున్న వారు మీ నుంచి దూరంగా వెళ్లిపోవడం వల్ల కానీ వృత్తిలో గత కొద్ది కాలంగా ఉన్న సమస్యలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమవుతుంది. మీ ఆలోచనలు కానీ, మీరు చేసే పనులు కానీ విజయాలను ఇచ్చేవిగా ఉండటం వలన మీ పై అధికారుల మెప్పు పొందడమే కాకుండా ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. విదేశీ యానం విషయంలో గత సంవత్సర కాలంగా ఏర్పడిన ఆటంకాలు కానీ, సమస్యలు కానీ తొలగిపోవడంతో మీరు విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ చాలా కాలంగా విదేశాల్లో ఉండి తిరిగి సొంత ప్రాంతానికి రావాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. సంవత్సరం అంతా శని గోచారం 6వ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన మీరు నిజాయితీతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా తమ తప్పు తెలుసుకొని మీకు సాయం అందిస్తారు. ఉద్యోగంలో మార్పు కావాలనుకున్నవారు కానీ, కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు కానీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూల ఫలితాన్ని పొందుతారు. గురువు దృష్టి అయిదవ ఇంటిపై ఉండటం వలన మీ నైపుణ్యానికి, సృజనాత్మక తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన పనుల కారణంగా ప్రభుత్వ గుర్తింపు కానీ, ప్రజల మన్ననలు గాని పొందుతారు.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఏడవ ఇంటిలో ఉండటం, కేతు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన అప్పుడప్పుడు వృత్తి పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వచ్చిన ఆటంకాలకు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించడం వలన అనుకున్న ఫలితాన్ని పొందుతారు. అలాగే కొన్నిసార్లు భయం కారణంగా కానీ, అనుమానం కారణంగా కానీ మీకు సాధ్యమయ్యే పనులు కూడా చేయకుండా వదిలేసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మీరు మీ రంగంలో నిపుణుల లేదా మీ శ్రేయోభిలాషుల సాయం తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. ఈ సమయంలో కలిగే భయాలు కానీ, ఆందోళనలు కానీ మీకు వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం చేయవనే విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది.
కన్యారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన ఎనిమిది నెలలు అత్యంత అనుకూలంగా ఉండటం వలన గత సంవత్సర కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మే ఒకటి వరకు గురువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం మరియు ఎనిమిదవ ఇంటిపై మరియు 12వ ఇంటిపై శని దృష్టి ఉండటం వలన ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. గతంలో పొదుపు చేసిన డబ్బులు కూడా ఈ సమయంలో ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు ఉంటాయి. కుటుంబ అవసరాల నిమిత్తం, కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధ కారణాల వలన, మరియు విలాసాల కారణంగా ఈ డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడడం ప్రారంభమవుతుంది. ఖర్చులు తగ్గటం మరియు ఆదాయం పెరగడంతో ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాకుండా వృత్తి ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఆదాయం పెరగడంతో తిరిగి పొదుపు చేయడం సాధ్యమవుతుంది. ఈ సమయంలో స్థిరాస్తుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి అమ్మకాల కారణంగా లేదా వాటిని అద్దెకు ఇవ్వటం కారణంగా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు.
సంవత్సరం అంతా శని గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన మొదటి నాలుగు నెలలు గురు గోచారం అనుకూలంగా లేని సమయంలో శని కారణంగా కూడా ఖర్చులు పెరిగినప్పటికీ ఆ తర్వాత గురు గోచారం అనుకూలంగా మారడంతో శని ఇచ్చే శుభ ఫలితాలు ప్రభావం కూడా కనిపిస్తుంది. ఆరవ ఇంటిలో శని గోచారం కారణంగా ఉద్యోగంలో రావలసిన బకాయిలు తిరిగి రావటం కానీ, లేదా కోర్టు కేసులు, ఆస్తి తగాదాల్లో విజయం సాధించడం ద్వారా కానీ ఈ సమయంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, మరియు ఆధ్యాత్మిక ప్రయాణ విషయంలో కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ధనకారకుడైన గురువు భాగ్యస్థానంలో సంచరించడం వలన ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కాకపోతే సంవత్సరం అంతా రాహు గోచారం ఏడవ ఇంట్లో ఉండటం శని దృష్టి, ఎనిమిది మరియు 12 ఇండ్లపై ఉండటం వలన ఈ సమయంలో శ్రమ కారణంగా వచ్చే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకొని శ్రమను వదిలేసినట్లయితే దాని ద్వారా వచ్చే డబ్బు మీకు ఉపయోగపడటం జరగదు.
కన్యారాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి నాలుగు నెలలు రాహు గోచారం తో పాటుగా గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఆరోగ్య సమస్యల కారణంగా కానీ, భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్ల కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో సరైన అవగాహన లేకపోవడం వల్ల గాని ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. అంతే కాకుండా, మీ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం ఎక్కువ అవ్వటం, వారి ప్రలోభాలకు కానీ లేదా చెప్పుడు మాటలు కానీ మీ కుటుంబ సభ్యులు లొంగిపోవడం వలన ఇంటిలో అనవసరమైన సమస్యలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లలు ఆరోగ్యం కూడా బాగుండకపోవటం లేదా, జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుండకపోవటం వలన మీరు మానసికంగా మరియు శారీరకంగా విశ్రాంతి లేని జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ మీలో ధైర్యం కానీ, ఉత్సాహం కానీ తగ్గకుండా సమస్యలను ఎదుర్కొంటారు.
ఏడవ ఇంటిలో రాహువు గోచారం భార్యాభర్తల మధ్యన అవగాహన లోపించేలా చేస్తుంది. ఒకరు చెప్పింది ఒకరు అర్థం చేసుకోకపోవడం, అలాగే ఒకరి పైన ఒకరు పై చేయి సాధించాలనే ప్రయత్నం చేయటం వలన మిగతా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒకటవ ఇంటిలో కేతు గోచారం కారణంగా మీరు అప్పుడప్పుడు ఒంటరిని అయ్యాను అనే బాధకు లోనయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆలోచనలు మీలో ఎక్కువ అవుతాయి. నిజానికి అటువంటి సమస్య ఏమీ లేనప్పటికీ మీ అనుమానాలు, భయాలు పెరగటం వల్ల మీరు నిర్లక్ష్యానికి గురవుతున్నారనే ఆలోచన మీలో ఎక్కువవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు దైవ దర్శనం చేసుకోవడం కానీ లేదా ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కొరకు ప్రయాణాలు కానీ చేయడం వలన మీలో ఉన్న మానసిక భయాలు తగ్గుతాయి.
మే ఒకటి నుంచి గురువు గోచారం 9వ ఇంట్లో ఉండటం వలన కుటుంబ పరంగా మరియు వ్యక్తిగతంగా మీకున్న సమస్యలు తగ్గటం ప్రారంభమవుతుంది. గురువు దృష్టి ఒకటవ ఇంటిపై, మూడవ ఇంటిపై, మరియు ఐదవ ఇంటిపై ఉండటం వలన మీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం, మానసికంగా మీలో ఉన్న అనుమానాలు, అలజడులు తొలగిపోవడం వలన మీరు మానసికంగా బలంగా అవుతారు. తద్వారా కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. గురువు దృష్టి మూడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువుల సహాయ సహకారాలు మీకు అందటమే కాకుండా, ఈ సమయంలో వారు కూడా అభివృద్ధి చెందుతారు. మీ పిల్లలు వారి రంగాల్లో విజయాలు సాధిస్తారు.
ఒకవేళ మీరు అవివాహితులు అయ్యుండి వివాహం కొరకు ఎదురుచూస్తున్నట్లయితే, ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీకు వివాహమయ్యే యోగం ఉంటుంది. అలాగే మీరు వివాహం అయ్యుండి సంతానం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో సంతానం అయ్యే బలం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా కేతు గోచారం ఒకటో ఇంటిలో ఉంటుంది. కేతువు అనవసర అనుమానాలను, భయాలను ఇచ్చే గ్రహం కాబట్టి మీలో అలాంటి భయాలు అనుమానాలు కలిగినప్పుడు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి తప్ప వాటికి లొంగిపోయి మీతో పాటు మీ కుటుంబ సభ్యులను సమస్యల పాలు చేయకండి. ఈ సమయంలో వచ్చే భయాలు ఏవి నిజజీవితంలో జరగవు కాబట్టి వాటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
కన్యా రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. కాలేయము, వెన్నెముక, మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసికంగా ఎక్కువగా ఆందోళనకు గురవడం, ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా ఊహించుకొని భయపడటం చేసే అవకాశం ఉంటుంది. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఎక్కువ ఆందోళన చెంది ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లడం లేదా వైద్య పరీక్షలు చేయించుకోవడం చేస్తారు. ఈ సమయంలో రోగనిరోధక శక్తి కూడా కొద్దిగా తగ్గుతుంది కాబట్టి అంటు వ్యాధుల విషయంలో అలాగే ఊపిరితిత్తులు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయములో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం బాగుపడుతుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటమే కాకుండా మానసికంగా కూడా మీరు దృఢంగా మారతారు. ఒకటవ ఇంటిపై, మరియు ఐదవ ఇంటిపై గురువు గోచారం ఉండటం వలన చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. ఆరో ఇంటిలో శని గోచారం కూడా మీ ఆరోగ్యం మెరుగు పడటానికి సహకరిస్తుంది. సరైన వైద్యం కానీ, మందులు కానీ అందటం వలన మీరు మీ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలగుతారు.
ఈ సంవత్సరం అంతా రాహువు గోచారం ఏడవ ఇంటిలో మరియు కేతువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన మీరు శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఒకటవ ఇంటిలో కేతు మనలోని భయాలను, అనుమానాలను పెంచుతాడు. దానికి కారణంగా మనం ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా అది మనకు కూడా వస్తుందని భయానికి గురవుతాము. నిజానికి ఈ సమయంలో ముఖ్యంగా మే 1 నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అంతగా ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలు ఏవి మీకు రావు. కాబట్టి అతిగా భయాందోళనలకు గురవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఆరోగ్యం కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కానీ, అవి మీతో పాటుగా ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే లాగా ఉండకూడదు.
కన్యా రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ఆరంభంలో చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈ సంవత్సరం మే 1 వరకు గురువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన చదువు విషయంలో కొంత నిర్లక్ష్య ధోరణి అలబడుతుంది. అంతేకాకుండా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వటానికి సులువైన మార్గాలను వెతికే ప్రయత్నం చేస్తారు. దాని కారణంగా సమయం వ్యర్థం అవుతుంది తప్ప సరైన ఫలితం లభించదు. అంతేకాకుండా నిర్లక్ష్య ధోరణి కారణంగా గురువులు కానీ పెద్దవారు కానీ చెప్పిన మాటలను, సలహాలను పట్టించుకోరు. దాని కారణంగా వారికి వచ్చే అవకాశాలు పోగొట్టుకుంటారు. అయితే సంవత్సరమంతా శనిగోచారం ఆరవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమయానికి తమ తప్పు తెలుసుకొని శ్రమించి చదవటం వలన చదువులో మరియు పరీక్షల్లో అనుకూల ఫలితాన్ని పొందుతారు.
మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటంతో చదువు విషయంలో గతంలో ఉన్న బద్ధకం కానీ, నిర్లక్ష్య ధోరణి కానీ తగ్గుతుంది. చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన ఎక్కువ అవుతుంది. దాని కొరకు గురువుల మరియు పెద్దల సహకారం తీసుకుంటారు. ఈ సమయంలో వారు పడే శ్రమ, వారి పట్టుదల పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వటానికి మరియు తమ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గురువు తొమ్మిదవ ఇంటిలో సంచరించే సమయంలో అత్యున్నత స్థాయిలో విద్యావకాశాలు ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తగినంత కృషి చేస్తే గురు అనుగ్రహం కారణంగా వారు దేశంలో కానీ, విదేశాల్లో కానీ అత్యున్నత స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందుతారు. దీని కారణంగా వారి భవిష్యత్తు మరింత మెరుగు పడుతుంది.
ఈ సంవత్సరం అంతా కేతువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన విద్యార్థులకు చదువు విషయంలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే 1 వరకు గురు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వీరిపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఏకాగ్రత తగ్గడమే కాకుండా లేని ఒత్తిడి ఉన్నదిగా భావించి భయానికి లోనవుతారు. దాని కారణంగా చదువు వాయిదా వేయడం, లేదా చదవడం తప్పించుకోవడానికి వివిధ రకాల కారణాలు వెతుక్కోవడం చేస్తారు. ఈ సమయంలో గురువుల మరియు పెద్దవారి సహకారం వలన వారు తమ తప్పు తెలుసుకొని సరేదిద్దుకోగలుగుతారు. మిగిలిన సంవత్సరం అంతా గురు దృష్టి కేతువుపై ఉంటుంది కాబట్టి వారికి ఈ రకమైన మానసిక స్థితి ఉండదు.
ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే వరకు గురువు గోచారం బాలేనప్పటికీ ఉద్యోగ కారకుడైన శని గోచారం అనుకూలంగా ఉండటం, మే ఒకటి నుంచి గురువు గోచారం కూడా బాగుండడంతో వారి ప్రయత్నాలు ఫలించి వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అయితే ఈ సంవత్సరం రాహు కేతు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వారు ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ పట్టు వదలకుండా తామనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది.
కన్యారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మే 1 వరకు గురువు గోచారం, సంవత్సరం అంతా రాహు కేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ గ్రహాలకు పరిహార క్రియలు ఆచరించడం వలన అవి ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. మే ఒకటి వరకు 8 ఇంటిలో గురువు ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ, గురు మంత్ర జపం చేయటం కానీ మంచిది. దీని వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. వాటితోపాటు గురువులను, పెద్దలను గౌరవించడం, మరియు విద్యార్థులకు వారి చదువు ముందు సాగేలా వారికి తోచిన రూపంలో సాయం చేయడం మంచిది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 7వ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. దీనితోపాటు దుర్గా స్తోత్ర పారాయణం చేయటం లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయటం వలన కూడా రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.
ఈ సంవత్సరం అంతా కేతు గోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి కేతు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్ర పారాయణం చేయడం లేదా కేతు మంత్ర జపం చేయటం మంచిది. వీటితోపాటు గణపతి స్తోత్రం పారాయణం చేయటం కానీ గణపతి అథర్వ శీర్ష పారాయణం చేయడం కానీ లేదా గణపతికి అభిషేకం చేయటం కానీ మంచిది.
Free KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Telugu.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Telugu.
Read MoreCheck October Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.
Read More