మన భారతీయ జ్యోతిష శాస్త్రములో చెప్పబడిన తొమ్మిది ప్రధాన గ్రహములు అయిన సూర్యుడు, చంద్రుడు, కుజుడు (మంగళుడు), బుధుడు, గురువు (బృహస్పతి), శుక్రుడు, శని, మరియు ఛాయా గ్రహాలు అయిన రాహు కేతువుల గురించి, వాటి ఆధిపత్యాలు, మితృత్వ, శతృత్వాలు, కారకత్వాలు మొదలైన అంశాలు ఈ పాఠం నుంచి ప్రారంభం అవుతాయి.
రాశుల తర్వాత గ్రహాల గురించి తెలుసుకుందాము. భారతీయ జ్యోతిష శాస్త్రం తొమ్మిది గ్రహాలని జాతక విశ్లేషణ కొరకు ఉపయోగించింది. 1. సూర్యుడు 2. చంద్రుడు 3. కుజుడు 4. బుధుడు 5. గురువు 6. శుక్రుడు 7. శని 8. రాహువు 9. కేతువు ఆధునిక జ్యోతిష్కులు మరో మూడు గ్రహాల్ని గుర్తించారు, అవి. 1. యురేనస్ 2. నెప్ట్యూన్ 3. ప్లూటో.
సూర్యుడు (రవి) సింహరాశికి అధిపతి. చంద్రుడు కర్కాటకరాశికి, బుధుడు మిథున, కన్యలకు, కుజుడు మేష, వృశ్చికాలకు, శుక్రుడు వృషభ, తులలకు, గురువు ధనుర్మీనాలకు, శని మకర, కుంభాలకు అధిపతి. రాహు,కేతువులు ఛాయాగ్రహాలవటం మూలాన వీటికి ప్రత్యేక గృహాలు లేవు. ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఫలాల్ని, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలాల్ని వీరు ఇస్తారు. అయితే కొంతమంది ప్రాచీన జ్యోతిష్కులు రాహు, కేతువులకు కూడా రాశ్యాధిపత్యాలను చెప్పారు. వీటిలో అభిప్రాయ భేదాలు ఉండటం వలన వాటిని ఇక్కడ ఇవ్వటం లేదు.
పరాశరుడు 27 నక్షత్రాలకు ఈ తొమ్మిది గ్రహాల్ని అధిపతులుగా చెప్తూ వాటికి సంబంధించిన దశా సంవత్సరాల్ని ఈ విధంగా కేటాయించాడు.
అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు కేతువు అధిపతి. ఈ నక్షత్రాల్లో ఎవరు జన్మించినా వారి జన్మదశ కేతుమహర్దశ అవుతుంది. అలాగే మిగతా నక్షత్రాల్లో జన్మించిన వారికి ఆ నక్షత్ర అధిపతి దశ జన్మకాల దశ అవుతుంది.
భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు శుక్రుడు అధిపతి.
కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు రవి అధిపతి.
రోహిణి, హస్త, శ్రవణాలకు చంద్రుడు అధిపతి.
మృగశిర, చిత్త, ధనిష్టా నక్షత్రాలకు కుజుడు అధిపతి.
ఆరుద్ర, స్వాతి, శతభిషంలకు రాహువధిపతి.
పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు గురువు అధిపతి.
పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు శని అధిపతి.
ఆశ్రేషా, జ్యేష్టా, రేవతి నక్షత్రాలకు బుధుడు అధిపతి.
గ్రహాలకు చెప్పబడిన దశాసంవత్సరాలు
కేతు మహాదశ 7 సంవత్సరాలు
శుక్ర మహాదశ 20 సంవత్సరాలు
రవి మహాదశ 6 సంవత్సరాలు
చంద్ర మహాదశ 10 సంవత్సరాలు
కుజ మహాదశ 7 సంవత్సరాలు
రాహు మహాదశ 18 సంవత్సరాలు
గురు మహాదశ 16 సంవత్సరాలు
శని మహాదశ 19 సంవత్సరాలు
బుధ మహాదశ 17 సంవత్సరాలు
రవి, కుజ, శని, రాహుకేతువులు, క్షీణ చంద్రుడు, పాపగ్రహాలతో కూడిన బుధుడు సహజ పాపులు.
గురు, శుక్ర, బుధ, శుక్లపక్ష చంద్రులు శుభగ్రహాలు.
గ్రహ మితృత్వ, శత్రుత్వాలు
సూర్యునికి చంద్ర, కుజ, గురువులు - మిత్రులు, శని, శుక్రులు - శతృవులు, బుధుడు - సముడు.
చంద్రునికి రవి, బుధులు - మిత్రులు, మిగిలిన గ్రహాలు సములు, శతృవులు లేరు.
కుజునికి గురు, చంద్ర, రవులు - మిత్రులు, శుక్ర, శనులు - సములు, బుధుడు శత్రువు.
బుధునికి శుక్ర, రవులు - మిత్రులు, కుజ, గురు, శనులు - సములు, చంద్రుడు శతృవు.
గురువుకు రవి, కుజ, చంద్రులు - మిత్రులు, బుధ, శుక్రులు - శత్రువులు, శని సముడు.
శుక్రునికి శని, బుధులు - మిత్రులు, రవి, చంద్రులు - శత్రువులు, కుజ, గురులు - సములు.
శనికి శుక్ర, బుధులు - మిత్రులు, రవి, చంద్ర, కుజులు - శత్రువులు, గురువు సముడు.