Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2021 samvatsara Vrishchika rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Vrishchika Rashi in Telugu
విశాఖ 4వ పాదం(తో)
అనురాధ 4 పాదాలు (న, ని,ను, నే)
జ్యేష్ట 4 పాదాలు (నో, య, యి, యు)
ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో మూడవ ఇంటిలో, రాహువు 7వ ఇంటిలో వృషభ రాశిలో , వృశ్చిక రాశిలో కేతువు ఒకటవ ఇంటిలో ఉంటారు. గురుడు ఏప్రిల్ 06న కుంభరాశిలో నాలుగవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో 3వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు, నవంబర్ 20న గురుడు మళ్లీ కుంభరాశిలో నాలుగవ ఇంటిలో ప్రవేశిస్తాడు.
వృశ్చిక రాశి వారికి, ఈ సంవత్సరం వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో అభివృద్ధి లభిస్తుంది. జనవరి నుంచి ఏప్రిల్ మధ్య లో గురు గోచారం మధ్యమంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తిలో కానీ, ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ కొన్ని మార్పులు ఉంటాయి. అయితే ఈ మార్పులు మీరు అనుకున్న విధంగా ఉండటం వలన ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా, వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో , గురువు నాలుగవ ఇంటిలో సంచరిస్తాడు. ఈ సమయంలో వృత్తి పరంగా ఒత్తిడి పెరుగుతుంది. పదోన్నతి కారణంగా వచ్చిన అదనపు బాధ్యతలతో మీరు తలమునకలై పోతారు. దీని కారణంగా కుటుంబానికి సమయం కేటాయించలేక పోతారు. మీ పై అధికారుల నుంచి కూడా పని విషయంలో ఒత్తిడి కొంత ఎక్కువగానే ఉంటుంది. అయితే మీరు నిజాయితీగా పని చేయటం వలన వారు మీ సమస్యను అర్థం చేసుకుంటారు. కొద్ది రోజుల తర్వాత ఈ అదనపు బాధ్యతల వలన వచ్చిన ఒత్తిడి కొంత తగ్గుతుంది. జన్మ రాశిపై కేతువు సంచారం కారణంగా మీలో తెలియని భయం ఎక్కువ అవుతుంది. మీకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుంటే అది వృత్తిపై ప్రభావం చూపిస్తుందని భయపడుతారు. దాని కారణంగా విశ్రాంతి లేకుండా పని చేస్తారు. మీరు సమయానికి పనులను పూర్తి చేయడం వలన పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మూడవ ఇంటిలో శని సంచారం వృత్తి పరంగా మీకు సంతృప్తిని ఇస్తుంది. కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ, గుర్తింపు మరియు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడం వలన అంతకాలం పడిన శ్రమ మర్చిపో గలుగుతారు. మీలో ఉన్న నైపుణ్యం, మీ వృత్తి పట్ల మీ కుండే నిబద్ధత మీ అభివృద్ధికి కారణమౌతుంది. వీలైనంత వరకు భయాన్ని వదిలి వేసి ముందుకు కొనసాగడం మంచిది. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది. మీ పని విషయంలో శత్రువుల కారణంగా ఆటంకాలు, సమస్యలు తలఎత్తవచ్చు. అందువల్ల ఎవరినీ నమ్మకుండా, మీ మానసిక సామర్థ్యాలను వినియోగించుకుంటూనే మీ పనిని కొనసాగించాలి.
ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు మూడవ ఇంటిలో గురు, శనుల కలయిక వల్ల మీ బలాలు, పని సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. సమాజం నుంచి గౌరవం పెరుగుతుంది. మీరు మీ శత్రువులను గెలుస్తారు. ఏడవ ఇంటిలో రాహువు గోచారం కారణంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ జీవితభాగస్వామితో అభిప్రాయ భేదాలు, విభేదాలు లేదా వాదోపవాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించండి. లగ్నంలో కేతువు సంచారం కారణంగా మీ కుటుంబం గురించి కుటుంబ సభ్యుల గురించి తెలియని భయాలు ఆందోళనలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా వారి ఆరోగ్య విషయంలో ఏ సమస్య లేనప్పటికీ ఏదో ఉందని ఊహించుకొని బాధపడతారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో గురువు గోచారం నాలుగవ ఇంటిలో అనుకూలంగా లేకపోవడం వలన కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. ఇది ముఖ్యంగా మీ ఉద్యోగం కారణంగా జరుగుతుంది. మీ పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించ లేకపోతారు. మీ తోబుట్టువులు అభివృద్ధిలోకి వస్తారు. వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ మిత్రులు కూడా కష్ట సమయంలో ఆదుకుంటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. మీ అతి జాగ్రత్త, మరియు భయం కారణంగా మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి. నిజంగా జరిగే దానికంటే మీరు ఊహించుకునేది ఎక్కువ ఉండటం వలన అనవసరమైన ఆందోళనకు గురి అవుతారు. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో వివాహం కాని వారికి అలాగే సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన ఫలితం లభిస్తుంది. మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. వారి విజయాలు మీ ఆనందానికి కారణాలవుతాయి. వారి సహాయ సహకారాలు కూడా అవసరమైన సమయంలో మీకు అందుతాయి. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సప్తమ స్థానంలో రాహు సంచారం కారణంగా వారు మీతో కొన్నిసార్లు వాదనకు దిగే అవకాశం ఉంటుంది. అయితే అది మిమ్మల్ని మరింత మెరుగుగా చేయడానికి సహకరిస్తున్న తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ఉండదు. మీ ప్రవర్తన కారణంగా వారు మీతో వాదనకు దిగే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో గురువు దృష్టి పదకొండవ ఇంటి పై ఉండడం వలన ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల కారణంగా, అలాగే వృత్తి కారణంగా ధనా దాయం ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడం జరుగుతుంది. వారసత్వ ఆస్తి కానీ, కోర్టు కేసులు మొదలైన వాటి వలన కానీ మీకు రావలసిన డబ్బు కాని ఆస్తి కానీ మీకు తిరిగి వస్తుంది. మీ జీవిత భాగస్వామి నుంచి కూడా ఆర్థిక సహాయం అందుతుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో గురు గోచారం నాలుగవ ఇంటిలో వ్యతిరేకంగా ఉండటం వలన ఆర్థికంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. అనుకోని డబ్బు కానీ, ఆస్తి కానీ రావటం వలన మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు. దీని వలన మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. గొప్పలకు పోయి కానీ, అనవసర సౌకర్యాల కొరకు కానీ మీరు చేసే ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఖర్చుల విషయంలో, పెట్టుబడుల విషయంలో ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య జాగ్రత్తగా ఉండటం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడగలుగుతారు.
ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ఒక్క శని గోచారం మాత్రమే అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు రానప్పటికీ, గురు, రాహువు మరియు కేతువు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన కొన్ని శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు దృష్టి పదకొండవ ఇంటిలో ఉండటం వలన ఆరోగ్యం బాగుంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో గురు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాలేయం, నడుము మరియు మెడకు సంబంధించిన శారీరక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జన్మ రాశిలో కేతు సంచారం కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తెలియని భయాలు ఆందోళనలకు గురవుతారు. అయితే శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగా బయట పడతారు. మీలో ఉండే పట్టుదల కారణంగా మీరు మీ సమస్యల నుంచి బయట పడగలుగుతారు. వీలైనంతవరకు ఆనందంగా, ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయండి. ఖాళీగా ఉండకుండా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోండి. దీనివలన మానసిక సమస్యల నుంచే కాకుండా శారీరక సమస్యల నుంచి కూడా బయట పడగలుగుతారు.
విద్యార్థులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. గురువు రాహు కేతువుల గోచారం అనుకూలంగా లేనప్పటికీ శని గోచారం అత్యంత అనుకూలంగా ఉండటం వలన చదువులో ఏర్పడే ఇబ్బందులను, ఆటంకాలను మానసిక స్థైర్యంతో ఎదుర్కుంటారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య లో గురువు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన చదువులో ఆటంకాలను ఎదుర్కోవడం అలాగే ఏకాగ్రతను కోల్పోవడం జరుగుతుంది. వీలైనంతవరకూ ఆపకుండా ప్రయత్నించడం వలన మీరు చదువులో ముందుకు వెళ్లగలుగుతారు. జన్మరాశిలో కేతువు గోచారం కారణంగా ఒక్కోసారి అనుమానాలకు, భయాలకు గురయి చదువు విషయంలో కొంత నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంటుంది. మీకు కలిగే భయాలేవి నిజం కావు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడం మంచిది. ఇతరులతో పోల్చుకుని మిమ్మల్ని తక్కువ చేసుకోకండి. దాని కారణంగా మీరు ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం మీకు గురువు, రాహువు మరియు కేతువు గోచారము అనుకూలంగా ఉండదు. ఈ గ్రహాలు ఇచ్చే చెడు ఫలితం తగ్గడానికి వీటికి పరిహారాలు చేయటం మంచిది. గురువు గోచారం నాలుగవ ఇంటిలో ఉన్నప్పుడు పనిలో ఒత్తిడి పెరగటం, ఆరోగ్య సమస్యలు రావడం జరగచ్చు కాబట్టి ఈ చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు గురు స్తోత్ర పారాయణం కానీ, గురు చరిత్ర పారాయణం కానీ లేదా గురు మంత్ర జపం చేయడం కానీ మంచిది. వీటితో పాటు ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదలకు తోచినంత ఆర్థిక సహాయం చేయడం వలన కూడా గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. ఏడవ ఇంటిలో రాహువు గోచారం కారణంగా జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావడం కానీ, వ్యాపారంలో సమస్యలు రావడం కానీ జరగచ్చు. ఈ దోష నివారణకు గాను ప్రతిరోజు రాహు స్తోత్రం చదవటం, లేదా రాహు మంత్ర జపం చేయటం, లేదా దుర్గ సంబంధ స్తోత్ర పారాయణం చేయటం వలన రాహువు ఇచ్చే సమస్యలు తగ్గుతాయి. లగ్నంలో కేతువు గోచారం కారణంగా కలిగే భయాలు, మానసిక సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు కేతు స్తోత్రం చదవడం కానీ, కేతు మంత్ర జపం చేయటం కానీ లేదా గణేశ ఆరాధన చేయడం కానీ మంచిది.
Onlinejyotish.com giving Vedic Astrology services from 2004. Your help and support needed to provide more free Vedic Astrology services through this website. Please share https://www.onlinejyotish.com on your Facebook, WhatsApp, Twitter, GooglePlus and other social media networks. This will help us as well as needy people who are interested in Free Astrology and Horoscope services. Spread your love towards onlinejyotish.com and Vedic Astrology. Namaste!!!