Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2019 -20 Vikari samvatsara Dhanussu rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Dhanussu Rashi in Telugu
మూల 4 పాదములు (యె, యో, బ, బి)
పూర్వాషాఢ 4 పాదములు (బు, ధ, భ, ఢ)
ఉత్తరాషాఢ 1వ పాదం (బె)
ఈ సంవత్సరం ధనూ రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి నాలుగవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఐదవ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశికి రెండవ స్థానమైన మకర రాశి నుంచి, మూడవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 న రాహువు ఐదవ స్థానమైన మేష రాశి నుంచి, నాలుగవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు పదకొండవ స్థానమైన తులా రాశి నుంచి పదవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.
2023 వ సంవత్సరం ధనూ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఏప్రిల్ నుంచి మాత్రం అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం శని గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గత ఏడున్నర సంవత్సరాలుగా శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మీకు ఈ సంవత్సరం నుంచి మీరు అనుకున్న విధంగా మీ ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. మూడవ ఇంటిలో శని గోచారం కారణంగా వృత్తిలో మరియు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో అనుకూలమైన మార్పులు వస్తాయి. గత సంవత్సర కాలంగా ఉన్న పని ఒత్తిడి తగ్గడం ప్రారంభమవుతుంది. అలాగే మిమ్మల్ని మీ వృత్తిలో ఇబ్బందులకు గురి చేసిన వారు దూరం అవడం వలన మీరు ప్రశాంతంగా మీ ఉద్యోగాన్ని చేసుకోగలుగుతారు. ఏప్రిల్ వరకు గురువు గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన ఈ కాలంలో పని ఒత్తిడి కొంత ఉన్నప్పటికీ అది పదోన్నతి కారణంగా వచ్చిన పని ఒత్తిడి అవటం వలన మీరు దాన్ని ఇబ్బందిగా భావించరు. అయితే ఈ సమయంలో మీరు పేరు ప్రతిష్టల కొరకు కాక, నిజాయితీగా మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తి చేయాల్సి ఉంటుంది. గురు దృష్టి ఎనిమిదవ ఇంటిపై, పదవ ఇంటిపై, మరియు 12వ ఇంటిపై ఉండటం వలన ఏప్రిల్ వరకు మీకు ఇష్టం లేకున్నప్పటికీ మీకు నచ్చని వ్యక్తులతో పని చేయాల్సి రావటం కానీ, మీకు నచ్చని ప్రదేశంలో పనిచేయాల్సి రావడం కాని జరగవచ్చు. అయితే ఈ సమయంలో మీరు మిగతా వాటిని పట్టించుకోకుండా మీకు కేటాయించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించడం వలన భవిష్యత్తులో ఇది మీ పదోన్నతికి సహాయకారిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఇతరుల విషయాల్లో కల్పించుకోవడం కానీ లేదా వారు అడగక పోయినప్పటికీ సలహాలు ఇవ్వటం చేయకూడదు. దాని కారణంగా మీ విలువ తగ్గటమే కాకుండా మీరు అవమానాల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఏప్రిల్లో గురువు గోచారం అనుకూలంగా రావటం వలన మీ కార్యాలయంలో మరియు ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. శని గోచారం మరియు గురు గోచారం ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వలన మీరు చేసే పనులు, మీరు చెప్పే సలహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం వలన మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గతంలో మీ గురించి ఉన్న అపోహలు తొలగిపోవటం గాని, మిమ్మల్ని అవమాన పరిచిన మీ సహోద్యోగులు తమ తప్పును గుర్తించి మిమ్మల్ని క్షమాపణలు వేడటం జరుగుతుంది. మీ పై అధికారులు కూడా మీ పనికి సంతృప్తి చెందటం వలన మీరు కోరుకున్న విధంగా పదోన్నతి పొందగలుగుతారు. గురువు దృష్టి ఏప్రిల్ నుంచి తొమ్మిదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విదేశీ యానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాల్లో స్థిర నివాసం గురించి కానీ లేదా విదేశాల్లో మంచి ఉద్యోగం గురించి కానీ ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితం లభిస్తుంది. ఈ సంవత్సరాంతం లోపు వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. గురువు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వలన మీకు ఉద్యోగ అభివృద్ధి తో పాటు ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. సంవత్సరం చివరలో రాహు గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన వృత్తిలో అనుకోని మార్పులు రావటం కానీ, పని ఒత్తిడి పెరగడం కానీ జరగవచ్చు. దాని కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురి అయినప్పటికీ గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య, జూలై 17 నుంచి ఆగస్టు 17 మధ్యాహ్నం మరియు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 16 మధ్య ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం కానీ లేదా పై అధికారులతో సరైన సంబంధాలు లేకపోవడం కానీ జరగవచ్చు. దాని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం, మరియు ఇతరుల పనుల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగ మార్పుకు ప్రయత్నాలు చేయడం అనుకూలమైన ఫలితం ఇవ్వకపోవచ్చు.
వ్యాపారస్థులకు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏలినాటి శని కాలం పూర్తవడం అలాగే గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన వ్యాపారం కొంత మందకొడిగా సాగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా లేకపోవడం మరియు వ్యాపారంలో అనుకున్నంత లాభం రాకపోవడం వలన డబ్బుకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గతంలో మీరు తీసుకున్న అప్పులు కానీ, లోన్లు కానీ తిరిగి తీర్చాల్సిన అవసరం రావడంతో మీరు స్థిరాస్తి అమ్మకాలు చేయడం కానీ, కొత్తగా భాగస్వాములను వ్యాపారంలో చేర్చుకోవడం కానీ చేస్తారు. ఐదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీ ఆలోచనలు మీకు సరైన ఫలితం ఇవ్వకపోగా అవి మీ ప్రత్యర్థులకు లాభాన్ని చేకూరుస్తాయి. అయితే ఈ సమయంలో శని గోచారం మరియు కేతు గోచారం బాగుండటం వలన మీరు ఈ సమస్య నుంచి తొందరగానే బయట పడగలుగుతారు. ఏప్రిల్లో గురువు గోచారం అనుకూలంగా రావటం వలన వ్యాపారంలో అంత కాలంగా ఉన్న స్తబ్దత తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. గురు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వలన మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం జరుగుతుంది. దానివలన తిరిగి వ్యాపార అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతారు. ఈ సమయంలో గురు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు ఒకటవ ఇంటిపై కూడా ఉండటం వలన మీ ఆలోచనలకు, మీ కృషికి అదృష్టం కూడా తోడవుతుంది. గతంలో చేసిన అప్పులు కానీ, లోన్లు కానీ పూర్తిగా తీర్చగలుగుతారు. దాని కారణంగా మీరు మనశ్శాంతితో వ్యాపారం చేసుకోగలుగుతారు. గురువు, శని మరియు కేతువుల గోచారం అనుకూలంగా ఉండటంతో వ్యాపారంలో లాభాలతో పాటుగా ఇతర ప్రదేశాల్లో మీ వ్యాపార శాఖలను ప్రారంభించగలరు. మీ వ్యాపార భాగస్వాములు కూడా మీకు సహకరించడం వలన మీరు మరిన్ని విజయాలు సాధించగలుగుతారు. ఐదవ ఇంటిలో రాహువు గోచరము కారణంగా కొన్నిసార్లు మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు కానీ, తొందరపడి మీరు పెట్టె పెట్టుబడులు కానీ మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేయవచ్చు. అయితే సరైన సమయంలో మీరు తగిన చర్యలు తీసుకోవడం వలన ఆర్థికంగా నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు.
ధను రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మొదటి నాలుగు నెలలు డబ్బు విషయంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ తర్వాత ఎనిమిది నెలలు మీకు డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఈ సంవత్సరంతో ఏలినాటి శని పూర్తవడం వలన గత కొద్ది కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. మూడవ ఇంట్లో శని గోచారం కారణంగా స్థిరాస్తుల ద్వారా మరియు వారసత్వ ఆస్తుల ద్వారా ఈ సంవత్సరం ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శని దృష్టి పన్నెండవ ఇంటిపై ఉండటం వలన ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ సంవత్సరం మీరు స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం నాలుగవ ఇంటిలో అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో కొన్నిసార్లు ఆదాయానికి మించిన ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే మీరు కొంత డబ్బు అప్పుగా తీసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. గతంలో చేసిన అప్పులు కానీ, తీసుకున్న లోన్లు కానీ తిరిగి తీర్చాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మీరు మీ బంధువుల లేదా తోబుట్టువుల సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా రావటంతో ఆదాయలో అభివృద్ధి సాధ్యమవుతుంది. కోర్టు కేసులు కానీ, ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవడం వలన కూడా మీకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తండ్రిగారి ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ కొంత డబ్బు మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. గురువు అయిదవ ఇంటిలో సంచరించడం షేర్ మార్కెట్ కానీ, ఇతర పెట్టుబడుల ద్వారా కానీ మీరు లాభం పొందుతారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మీ ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు రాహు గోచారం అయిదవ ఇంటిలో ఉండటం వలన మీరు పెట్టే పెట్టుబడులలో కొంత శాతం ఇతరుల ఒత్తిడి వలన కానీ, వారు మిమ్మల్ని ప్రలోభ పెట్టడం వల్ల కానీ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ సమయంలో తొందరపడి ఇతరుల మాటలకు లొంగకుండా స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. సంవత్సరం చివరలో రాహువు గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన స్థిరాస్తి వ్యవహారాల కారణంగా, ఇంటి మరమ్మతుల కారణంగా, మరియు వాహనాలు కొనుగోలు కారణంగా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.
ధను రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సర ఆరంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉండవు. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు గురువు గోచారం నాలుగవ ఇంటిలో అనుకూలంగా ఉండకపోవటం వలన మీరు కాలేయము, వెన్నెముక మరియు తలకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధ పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం శని గోచారం అనుకూలంగా ఉండటం వలన గత కొద్ది కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యసమస్యలు తగ్గుముఖం పడతాయి. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్యం మెరుగవుతుంది. దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స లభించడంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మానసికంగా కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు. నాలుగవ ఇంటిలో గురు గోచారం ఉన్నంతకాలం మీరు వృత్తి కారణంగా, మరియు కుటుంబ సమస్యలు కారణంగా వలన మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఏప్రిల్లో గురువు ఐదవ ఇంటికి మారటం వలన మీ మానసిక ఒత్తిడి తగ్గి మీరు ఉల్లాసంగా, ఆనందంగా ఉండగలుగుతారు. ఈ సంవత్సరం రాహు గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన మీరు గుండె, జీర్ణాశయం మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధ పడే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఏప్రిల్లో గురువు ఐదవ ఇంటికి మారిన తర్వాత రాహువు ఇచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. సంవత్సరం చివరలో రాహు గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన మీరు జీర్ణాశయం మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కొద్దికాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే మీకు సరైన చికిత్స లభించడంతో ఈ సమస్యల నుంచి శాశ్వతంగా పరిష్కారం పొందుతారు. ఈ సంవత్సరం మే 10 నుంచి జులై 1 మధ్యలో, తిరిగి నవంబర్ 16 నుంచి డిసెంబర్ చివరి వరకు కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుజుడు కోపాన్ని, ఆవేశాన్ని మరియు అహంకారాన్ని పెంచే గ్రహం అవటం వలన ఈ సమయంలో మీరు మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు, మరియు విద్యుత్తు సంబంధ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
ధనూ రాశి వారికి 2023 లో కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఏలినాటి శని పూర్తి అవడం వలన గత కొద్ది కాలంగా కుటుంబంలో నెలకొన్న ఇబ్బందులు, సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. ఏప్రిల్ వరకు గురువు గోచారం నాలుగవ ఇంటిలో అనుకూలంగా లేకపోవడం వలన మీరు కొన్నిసార్లు మీ ఇంటిలో ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కారణంగా కానీ, ఇతర బంధువుల కారణంగా కానీ మీరు కొన్నిసార్లు సహనాన్ని కోల్పోతారు. దానివలన మీ ఇంటిలో ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మిమ్మల్ని మానసికంగా కుంగిపోయేలా చేయవచ్చు. అయితే శని గోచారం మరియు కేతువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు వచ్చిన సమస్యలను మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అయిదవ ఇంటిలో రాహువు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు చేసే పనులు, మీ ఆలోచనలు మూర్ఖంగా ఉండడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు ఇబ్బందిని కూడా కలిగించవచ్చు. మీరు మీ కీర్తి ప్రతిష్టల కొరకు గాని, లేదా మీ స్వార్థం వలన కానీ మీరు చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ సమయంలో మీ అత్యుత్సాహాన్ని, అతి ఆవేశాన్ని హద్దుల్లో ఉంచుకోవటం వలన మీరు, మీ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఏప్రిల్లో గురు గోచారం మారటం వలన మీ ఆలోచనా విధానం మరియు ప్రవర్తనలో మార్పు వస్తుంది. గతంలో ఉన్న ఆవేశం, కోపం తగ్గటం వలన మీరు, మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండగలుగుతారు. మీ బాధ్యతలను గుర్తించి కుటుంబం గురించి ఆలోచించడం, మరియు మీ కుటుంబానికి అవసరమైన పనులు చేయటం వలన వారికి ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా వారు ప్రశాంతంగా ఉండడానికి మీరు కారణమవుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన మీ తండ్రి గారి ఆరోగ్యం, మరియు ఇంటిలో పెద్ద వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శన కానీ, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన గాని చేస్తారు. మీరు వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సంతానం అయ్యే అవకాశం బలంగా ఉంటుంది.
ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రథమార్థం సామాన్యంగా, ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం బాగుండక పోవటం వలన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. చదువుకంటే ఎక్కువ ఇతర విషయాల మీద ఆసక్తి పెరగటం వలన ఈ సమయంలో పరీక్షలలో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శని గోచారం అనుకూలంగా ఉండటం వలన వీరు తమ తప్పు తెలుసుకొని సరిదిద్దుకో గలుగుతారు. అయితే కొన్నిసార్లు అహంకార పూరితంగా ప్రవర్తించడం వలన గురువుల మరియు పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణి అధికంగా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే పరీక్షల్లో అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా మారటం వలన విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగటమే కాకుండా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవాలనే పట్టుదల కూడా పెరుగుతుంది. వారి పట్టుదలతో అనుకూలంగా కష్ట పడటం వలన వారు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై, మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన ఉన్నత విద్యాభ్యాసాన్ని వారు కోరుకున్న విద్యాలయాల్లో పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా వారి ప్రవర్తన గతంలో లాగా దురుసుగా లేకుండా ఉండటం, పెద్దలు అన్నా, గురువుల అన్నా గౌరవ మర్యాదలు పెరగటం వలన అందరి మన్ననలు పొందుతారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారి ప్రయత్నాలు సఫలమయ్యి విదేశాల్లో వారు అనుకున్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ఇతర ఉద్యోగాల కొరకు కానీ పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. ద్వితీయార్ధంలో గురువు గోచారం బాగుండటం వలన వారి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగం సంపాదిస్తారు
ఈ సంవత్సరం ధనూ రాశి వారికి ప్రథమార్ధంలో గురువు గోచారం, సంవత్సరమంతా రాహు గోచారం, సంవత్సరం చివరిలో కేతువు గోచారం బాగుండదు కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది. ఏప్రిల్ వరకు గురు గోచారం నాలుగవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మరియు కుటుంబ సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు కానీ, ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయటం లేదా గురుచరిత్ర పారాయణం చేయడం మంచిది. ఈ సంవత్సరం రాహు గోచారం నాలుగవ, మరియు ఐదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహువు ఇచ్చే శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గటానికి ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ రాహు గ్రహ స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా రాహువు ఇచ్చే చెడు ఫలితాలను తగ్గించే దుర్గాదేవి స్తోత్రం చదవటం కానీ, దుర్గాదేవికి కుంకుమార్చన చేయటం కానీ చేసినట్లయితే రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఈ సంవత్సరం నవంబర్ నుంచి కేతువు గోచారం పదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఉద్యోగ సంబంధ సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు, లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్రం పారాయణం చేయటం, లేదా కేతు మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా గణపతి పూజ చేయటం కానీ, గణపతి స్తోత్రం పారాయణం చేయడం వల్ల కూడా కేతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి.
Onlinejyotish.com giving Vedic Astrology services from 2004. Your help and support needed to provide more free Vedic Astrology services through this website. Please share https://www.onlinejyotish.com on your Facebook, WhatsApp, Twitter, GooglePlus and other social media networks. This will help us as well as needy people who are interested in Free Astrology and Horoscope services. Spread your love towards onlinejyotish.com and Vedic Astrology. Namaste!!!
Check December Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.
Read MoreKnow your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.
Read MoreCheck your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.
Read MoreCheck December Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.
Read More