కుంభ రాశి - 2023 రాశి ఫలములు

కుంభ రాశిఫలములు

2023 సంవత్సర రాశిఫలములు

Telugu Rashi Phalalu (Rasi phalamulu)

2023 Rashi phalaalu

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2023 samvatsara Kumbha rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Kumbha Rashi in Telugu


Kanya rashi telugu year predictions

ధనిష్టా 3, 4 పాదాలు (గు, గె)
శతభిషం 4 పాదాలు (గొ, స, సి, సు)
పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు (సె, సో, ద)

ఈ సంవత్సరం కుంభ రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి రెండవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మూడవ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశినుండి పన్నెండవ స్థానమైన మకర రాశిలో నుంచి, ఒకటవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30న రాహువు మూడవ స్థానమైన మేష రాశి నుంచి, రెండవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు తొమ్మిదవ స్థానమైన తులా రాశి నుంచి ఎనిమిదవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

2023వ సంవత్సరం ఉద్యోగస్థులకు ఎలా ఉండబోతోంది?

కుంభ రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ పరంగా సామాన్యంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా శని గోచారం ఒకటవ ఇంటిలో ఉండటంతో వృత్తిలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. శని దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీరు ఈ సంవత్సరం మీ వృత్తి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఒకటవ ఇంటిలో శని గోచారం కారణంగా మీకు ప్రతి విషయాన్ని వాయిదా వేసే స్వభావం కానీ, లేదా చేసిన పనే మళ్లీ, మళ్లీ చేసే జాడ్య స్వభావం కాని అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసే పనిని ఎవరు వంక పెట్టకుండా ఉండాలని మీరు ప్రతి పనిని నిదానంగా చేయటం వలన మీ పై అధికారులకే కాకుండా, మీతోటి సహోద్యోగులకు కూడా ఇబ్బంది కలిగించిన వారవుతారు. అయితే గురువు దృష్టి ఏప్రిల్ వరకు పదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు నిదానంగా చేసినప్పటికీ మీరు చేసిన పని మీరు పనిచేసే కార్యాలయానికి, మరియు పై అధికారులకు పేరు తెచ్చేదిగా ఉండటం వలన వారు మిమ్మల్ని శిక్షించకుండా వదిలి వేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శని దృష్టి ఏడవ, మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన మీరు మీ పని విషయంలోనే కాకుండా ఇతరుల విషయాల్లో కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీ సహోద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీరు చాలా సార్లు పని చేయడంకంటే ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వటం మరియు మీకంటే గొప్పగా పనిచేసేవారు ఎవరూ లేనట్టుగా గొప్పలు చెప్పకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రారంభంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించినప్పటికీ ఆ తర్వాత మాత్రము మీ వృత్తిలో అనుకోని మార్పులకు కారణమవుతుంది. ఏప్రిల్ వరకు గురువు దృష్టి పదవ ఇంటిపై, మరియు ఆరవ ఇంటిపై ఉండటం వలన ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సమయంలో మీరు చేసే పనులకు మంచి గుర్తింపు లభించడమే కాకుండా వాటి కారణంగా మీకు పదోన్నతి కూడా లభిస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ చివర వరకు రాహు గోచారం మూడవ ఇంట్లో ఉండటం వలన మీరు ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. ఈ సంవత్సరం మీకు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీ పై అధికారులు మీపై బాధ్యతలు ఉంచడం వలన మీరు క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఏప్రిల్లో గురువు గోచారం మూడవ ఇంటికి మారటం వలన మీ ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకోవడం కానీ మీరు పనిచేస్తున్న చోటు నుంచి వేరొక చోటికి బదిలీ అవడం కానీ జరగవచ్చు. మీలో కొందరికి విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కూడా రావచ్చు. ఈ సమయంలో గురువు దృష్టి ఏడవ ఇంటిపై, తొమ్మిదవ ఇంటిపై, మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన మీరు నివసించే ప్రదేశం లో కానీ, లేదా ఉద్యోగాల్లో కానీ మార్పు జరుగుతుంది. అయితే ఇది మీ ప్రయత్నం లేకుండా జరగటం వల్ల మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి పదవ ఇంటిపై శుభ గ్రహ దృష్టి లేకపోవడం వలన మీకు పని ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కొత్త ఉద్యోగంలో కానీ, కొత్త ప్రదేశంలో కానీ పని చేయాల్సి రావటం వలన మీకు పని ఒత్తిడి తట్టుకోవడం కష్టమవుతుంది. అయితే రాహువు గోచారం అనుకూలంగా ఉండటం వలన, చేసే పని కష్టం గా ఉన్నప్పటికీ మీ ఉత్సాహం తగ్గకుండా మీరు పని చేయగలుగుతారు. శని దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ పనిలో ఆటంకాలు కల్పించే వారు, మీ గురించి మీ పైఅధికారులకు చెడుగా చెప్పేవారు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీరు నిజాయితీగా పని చేయడం వలన మీ గురించి చెడుగా చెప్పే వారి కారణంగా, మీకు ఆటంకాలు కల్పించే వారి కారణంగా మీకు ఎక్కువ కాలం ఇబ్బందులు ఉండవు. అక్టోబర్ చివర నుంచి రాహు గోచారం రెండవ ఇంటిలో మరియు కేతువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో మీ ఉద్యోగంలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. మరియు మీరు చెప్పే మాటలు మీ సహోద్యోగులు కానీ, మీ పై అధికారులు కానీ నమ్మక పోవడం, మీరు ఎంత నిజాయితీగా పని చేసినా ఉద్యోగంలో సరైన అభివృద్ధి సాధ్యం కాకపోవడం జరగవచ్చు. ఈ సంవత్సరం కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 మధ్యకాలం, మే 15 నుంచి జూన్ 16 మధ్యకాలం, మరియు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 18 మధ్యకాలం వృత్తిలో అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువ అవడంతో కానీ, పై అధికారుల నుంచి సరైన సహకారం లభించకపోవడం కానీ జరగవచ్చు. వృత్తిలో మార్పు కోరుకునేవారు ఈ సమయంలో వీలైనంతవరకు ఆ ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది.

2023వ సంవత్సరం వ్యాపారస్థులకు మరియు స్వయం ఉపాధి కలవారికి ఎలా ఉండబోతోంది?

వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా శని గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన సంవత్సరం ఆరంభంలో వ్యాపారం సామాన్యంగా ఉంటుంది. అయితే గురువు గోచారం రెండవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం తక్కువగా జరిగినప్పటికీ ఆదాయం తగ్గకపోవడం వలన మీకు ఇబ్బంది కలగదు. అయితే ఏడవ ఇంటిపై శని దృష్టి సంవత్సరమంతా ఉండటం వలన ఈ సంవత్సరమంతా వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ముఖ్యంగా ప్రథమార్ధంలో మీ వ్యాపార భాగస్వాములతో సమస్యలు రావటం కానీ, భాగస్వామ్య ఒప్పందాలు ముగించాల్సి రావడం కాని జరగవచ్చు. శని దృష్టి పదవ ఇంటిపై, మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు మీ వ్యాపార అభివృద్ధికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అంతేకాకుండా చాలా సార్లు మీ భాగస్వాములు సహకరించక పోవడం వలన వ్యాపార అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు. ఏప్రిల్ వరకు గురువు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన మీకు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపార అభివృద్ధి కొరకు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. ఏప్రిల్ తర్వాత నుంచి గురు గోచారం మూడవ ఇంటికి మారుతుంది కాబట్టి ఈ సమయం ఆర్థికపరమైన పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. అయితే గురు దృష్టి ఏప్రిల్ చివర నుంచి ఏడవ ఇంటిపై, తొమ్మిదవ ఇంటిపై, మరియు పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి వ్యాపారంలో వృద్ధి సాధ్యమవుతుంది. అలాగే మీ వ్యాపార భాగస్వామి తో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ శ్రమకు అదృష్టం కూడా కలిసి రావడంతో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో ఈ వ్యాపారంలో భాగస్వామ్య ఒప్పందాలు జరగటం కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కానీ జరగవచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు అనుకునేవారికి ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారం ప్రారంభించడం మంచిది. ఆ తర్వాత గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి సూర్య గోచారం బాగున్నప్పుడు మాత్రమే వ్యాపారం ప్రారంభించడం మంచిది. నవంబర్లో రాహు గోచారం రెండవ ఇంటికి, కేతువు గోచారం ఎనిమిదవ ఇంటికి మారటం వలన వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక మోసాలు కానీ, వ్యాపారంలో మోసాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుడ్డిగా అందరిని నమ్మి మీ వ్యాపారాన్ని వారి చేతిలో పెట్టకపోవడమే మంచిది.

స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం అవకాశాలు మెరుగు పడటం వలన మరియు ప్రథమార్ధంలో ఆర్థికంగా కూడా అనుకూలించడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మంచి ప్రగతిని సాధిస్తారు. ఏప్రిల్ వరకు గురువు గోచారం రెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీకు మంచి అవకాశాలు రావడమే కాకుండా మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది. మీరు చేసే పనులు విజయవంతం అవడం వలన మీకు పేరుతోపాటు డబ్బు కూడా ఈ సమయంలో వస్తుంది. రాహు గోచారం అక్టోబర్ చివరి వరకు మూడవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీకు ఎంత పని ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. దానివలన మీకు మరిన్ని అవకాశాలు రావడం కూడా జరుగుతుంది. అయితే సంవత్సరమంతా శని గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం, మరియు శని దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు మీరు మంచి అవకాశాల్ని కోల్పోవడం వలన నిరాశకు లోనవుతారు. ఒకటవ ఇంటిపై శని కారణంగా కొన్నిసార్లు మీ నిర్లక్ష్యం కారణంగా కూడా అవకాశాలను కోల్పోతారు. అయితే ఈ సమయంలో కొంతమంది మిమ్మల్ని డబ్బు కొరకు గాని, వారి సొంత లాభం కొరకు గాని మోసం చేసే అవకాశం ఉంటుంది. అటువంటి తప్పుడు వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం మూడవ ఇంటిలోకి మారటంతో ఈ సమయంలో అవకాశాలు కొంచెం తగ్గినప్పటికీ మీరు తీరిక లేకుండానే ఉంటారు. ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా ఉండటం వలన మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీ శ్రేయోభిలాషులు మరియు మిత్రుల సహకారంతో మానసిక ఒత్తిడిని తట్టుకోగలుగుతారు మరియు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. సంవత్సరం చివరలో రాహు, కేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీ వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. తొందరపడి మాట ఇచ్చి మీరు బాధ్యతను పూర్తి చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు మీ శక్తి మేరకు మాత్రమే మీరు పని చేయటం మంచిది.

2023వ సంవత్సరం మీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం కుంభ రాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం బాగుంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థికంగా అభివృద్ధిని కలిగి ఉంటారు. మీ ఉద్యోగ, వ్యాపారాల నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మీకు ఈ సంవత్సరం నుంచి ఆర్థిక సమస్యలు తొలగి పోవడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే సంవత్సరమంతా శని గోచారం ఒకటవ ఇంట్లో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మీరు మీ ఆదాయంకంటే ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతుంది కాబట్టి ఖర్చు అయినప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది పడరు. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కానీ లేదా ఇల్లు, వాహనం మొదలైనవి కొనాలనుకునేవారు కానీ ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ విషయంలో డబ్బు ఖర్చు పెట్టడం మంచిది. ఈ సమయంలో గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పెట్టే పెట్టుబడికి తగిన ఆదాయం భవిష్యత్తులో లభిస్తుంది, అంతేకాకుండా మీ డబ్బుకూడా సద్వినియోగం అవుతుంది. ఏప్రిల్ తర్వాత గురువు గోచారం మూడవ ఇంటికి మారటం వలన ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. అయితే గురువు దృష్టి ఏడవ ఇంటిపై, తొమ్మిదవ ఇంటిపై, మరియు పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి గతంలో పెట్టిన పెట్టుబడులు నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో కోర్టు కేసుల్లో కానీ, ఆస్తి వివాదాల్లో కానీ మీకు అనుకూలమైన ఫలితం రావడం వలన వాటి ద్వారా కూడా మీకు డబ్బు కానీ, ఆస్తులు కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన ఇది మీ వృత్తి పరంగా అభివృద్ధితోపాటుగా, ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. ఈ సంవత్సరం చివరలో రాహు మరియు కేతువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తొందరపడి డబ్బు పెట్టుబడి పెట్టడం కానీ, ఇతరులకు డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ జరగవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరం ఎక్కువగా వ్యక్తిగత అవసరాల విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో మరియు గృహ అవసరాల విషయంలో మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం 14 నుంచి మార్చి 15 మధ్యలో, జూన్ 15 నుంచి ఆగస్టు 17 మధ్యలో, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 18 మధ్యలో డబ్బు ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు పెట్టడం కానీ, ఇల్లు మొదలైన స్థిరాస్తులు కొనుగోలు చేయటం కానీ మంచిది కాదు. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో, జూలై 15 నుంచి ఆగస్టు 17 మధ్యలో, మరియు డిసెంబర్ 16 నుంచి సంవత్సరం చివరి వరకు సూర్యుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి గురు బలం సామాన్యంగా ఉండే ఈ సమయంలో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు, అలాగే వాహనాదులు కొనుగోలు చేయాలనుకునే వారు చేయవచ్చు.

2023వ సంవత్సరం మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది?

కుంభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో గురు గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ సంవత్సరమంతా శని గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు గురువు గోచారం మరియు రాహు గోచారం బాగుంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే శని గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం మరియు శని దృష్టి మూడవ ఇంటిలో ఉన్న రాహు పై ఉండటం వలన ఎముకలు, వెన్నెముక, మెడ మరియు గ్యాస్టిక్ సంబంధం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే ఈ సమయంలో గురువు మరియు రాహువుల గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగానే వాటి నుంచి కోలుకోగలుగుతారు. ఒకటవ ఇంట్లో శని శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గేలా చేస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా జలుబు లాంటి చిన్న, చిన్న ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం మూడవ ఇంటికి మారటం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా గురువుపై శని దృష్టి ఉండటం వలన కాలేయము, వెన్నెముక మరియు చేతులు, కాళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఎముకలు పెళుసు గా మారటం లేదా విరగడం లాంటి ఆరోగ్య సమస్యల విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎముకలకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవటం అలాగే శారీరక వ్యాయామాలు చేయటం వలన ఈ సమస్య నుంచి బయట పడగలుగుతారు. అలాగే కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కూడా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా శారీరక అలవాట్లు, మరియు ఆహార అలవాట్ల విషయంలో ఈ సంవత్సరం నియమంగా ఉండటం వలన మీరు చాలా వరకు జబ్బుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అక్టోబర్ చివర నుంచి రాహు గోచారం రెండవ ఇంటిలో, కేతువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో దంతాలు, మరియు చర్మ సంబంధ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 3 మధ్యలో కుజుడి గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు ఆవేశానికి లోను కాకుండా ఉండటం మంచిది. కుజుడు కోపాన్ని, ఆవేశాన్ని పెంచే గ్రహం కాబట్టి కుజుడి గోచారం అనుకూలంగా లేని ఈ సమయంలో వీలైనంత మానసికంగా ప్రశాంతంగా ఉండటం వలన అనవసరమైన ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

2023వ సంవత్సరం మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది?

కుంభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన కుటుంబంలో వృద్ధి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధ, బాంధవ్యాలు బాగుంటాయి. ఈ సంవత్సరమంతా శని దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరం ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా మీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం కాని జరగవచ్చు. ముఖ్యంగా మీ ప్రవర్తన కారణంగా కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమస్యలు ఎక్కువ కాలం మిమ్మల్ని కానీ, మీ కుటుంబ సభ్యులను కానీ ఇబ్బంది పెట్టవు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి పదోన్నతి కానీ, ఆర్థిక లాభం కానీ జరిగే అవకాశం ఉంటుంది. తొమ్మిదవ ఇంటిలో కేతు గోచారం అక్టోబర్ చివరి వరకు ఉండటం వలన ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా మీరు ప్రగతి సాధిస్తారు. ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్ర సందర్శన చేయడం కానీ, ఆధ్యాత్మిక రంగంలో గొప్పవారిని కలవడం కానీ చేస్తారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మూడో ఇంట్లో రాహువు ఉండటం వలన ఈ సంవత్సరం ఈ తోబుట్టువులకు కూడా మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది, మరియు వారితో మీ అనుబంధం పెరుగుతుంది. ఈ సంవత్సరం రెండవ ఇంటిలో గురు గోచారం ఉండటం వలన మీకు కానీ, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కానీ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం మూడో ఇంటిలో ఉండటం వలన మీరు నివసించే ప్రదేశంలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది. నూతన గృహ ప్రవేశం చేయటం కానీ, ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళ్లడం కానీ జరగవచ్చు. ఈ సంవత్సరమంతా శని దృష్టి మూడవ ఇంటిపై ఉండటం వలన మీకు మీ బంధువులతో కానీ, మీ చుట్టుపక్కల వారితో కానీ మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు సంయమనం పాటించి ఆ సమస్యలు పెద్దవి అవకుండా చూసుకోవడం మంచిది. ఒకటవ ఇంటిలో శని గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు మొండిగా ప్రవర్తించడం కానీ, పట్టిన పట్టు విడవకుండా ఉండడం కానీ జరగవచ్చు. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ, ఇంటిలో పెద్ద వారి ఆరోగ్యం కానీ మెరుగుపడుతుంది. గురు దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన ద్వితీయార్ధంలో శని ప్రభావం తగ్గి మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు తొలగిపోవడమే కాకుండా, ఇంటిలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ చివర నుంచి రాహు గోచారం రెండవ ఇంటిలో, మరియు కేతువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం కారణంగా మీ కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా కానీ, కుటుంబంలో పెద్ద వారి కారణంగా కానీ ఈ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే గురువు దృష్టి ఏడవ ఇంటిపై, తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన కుటుంబ సమస్యలు తొందరగానే పరిష్కారమవుతాయి. ఈ సమయంలో మీరు అహంకారంగా మాట్లాడటం కానీ, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ మంచిది కాదు.

2023వ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?

కుంభ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం బాగుండటం వలన చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. మీరు చేసే సహాయం కారణంగా తోటి విద్యార్థులు కూడా ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు రాహు గోచారం మూడవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన పోటీ వాతావరణాన్ని తట్టుకునే ఉత్సాహాన్ని, శక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు. శని గోచారం సంవత్సరమంతా ఒకటవ ఇంటిలో ఉండటం వలన కొన్నిసార్లు అత్యుత్సాహంగా కాని, కొన్నిసార్లు అతి చాదస్తంగా కానీ ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్లో గురువు గోచారం మూడవ ఇంటికి మారటం వలన ఉన్నత విద్యావకాశాలు మెరుగుపడతాయి. చదువులో కొన్నిసార్లు ఎక్కువ శ్రద్ధ చూపించడం, కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం జరగవచ్చు. మూడవ ఇంటిలో ఉన్న గురువు, మరియు రాహువు పై శని దృష్టి కారణంగా వీరి ప్రవర్తన లో ఈ రకమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఈ సమయంలో గురువులు, మరియు పెద్దవారి సహకారంతో చదువులో ముందడుగు వేస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో వారికి విదేశాల్లో వారు అనుకున్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ సంవత్సరం పదవ ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు చదువుకంటే ఎక్కువ, పేరు కొరకు తాపత్రయ పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీరు చదువు మీద దృష్టి నిలిపి ఫలితాల గురించి ఆలోచించడం మానేయటం వలన చదువులో అభివృద్ధి సాధించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ, ఇతర ఉద్యోగాల కొరకు కానీ ప్రయత్నించే ఉద్యోగార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది. వారు కోరుకున్న విధంగా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది.

2023వ సంవత్సరం ఏ గ్రహాలకు, ఏయే పరిహారాలు చేయాలి?

ఈ సంవత్సరం కుంభ రాశి లో జన్మించిన వారు శనికి, గురువుకు, రాహువుకు మరియు కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. సంవత్సరం అంతా శని గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన శని ఇచ్చే బద్ధకం, ఉద్యోగం లో సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ శని స్తోత్ర పారాయణం చేయటం, లేదా శని మంత్ర జపం చేయటం చేయాలి. అంతేకాకుండా శని ప్రభావాన్ని తగ్గించే హనుమాన్ స్తోత్రాలు చదవటం కానీ, పూజ కాని చేయటం మంచిది. అంతేకాకుండా శని ప్రభావం తగ్గటానికి పేదలకు, వృద్ధులకు, మరియు వికలాంగులకు శారీరకంగా కానీ, ఆర్థికంగా కాని సేవ చేయటం వలన శని సంతృప్తి చెందుతాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి గురువు గోచారం మూడవ ఇంటిలో ఉంటుంది కాబట్టి గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి మరియు శుభ ఫలితాలు రావడానికి ప్రతిరోజు కానీ, ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం, లేదా గురు మంత్ర జపం చేయటం మంచిది. అక్టోబర్ చివర నుంచి రాహు గోచారం రెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహువు ఇచ్చే కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ మరియు ఆరోగ్య సమస్యలు కానీ తొలగిపోవడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం, లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా దుర్గా స్తోత్రం పారాయణం చేసిన, లేదా దుర్గాదేవికి పూజ చేసినా కూడా రాహు ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా రాహువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ఆర్థికంగా కాని, విద్యా పరంగా కానీ విద్యార్థులకు సహాయం చేయటం మంచిది. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి నుంచి కేతువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి కేతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి ప్రతిరోజు కానీ, ప్రతి మంగళవారం కానీ కేతు స్తోత్రం పారాయణం చేయటం, లేదా కేతు మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా కేతు ప్రభావం తొలగిపోవడానికి గణేశ పూజ చేయడం కానీ, గణేశ స్తోత్రం పారాయణం చేయటం కానీ మంచిది.

రాజాది నవనాయక ఫలితములు

12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు

శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2023 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2023 rashi phal
Gemini
Mithuna rashi, year 2023 rashi phal
Cancer
Karka rashi, year 2023 rashi phal
Leo
Simha rashi, year 2023 rashi phal
Virgo
Kanya rashi, year 2023 rashi phal
Libra
Tula rashi, year 2023 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2023 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2023 rashi phal
Capricorn
Makara rashi, year 2023 rashi phal
Aquarius
Kumbha rashi, year 2023 rashi phal
Pisces
Meena rashi, year 2023 rashi phal

Telugu Jatakam

Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.

Read More
  

Telugu Panchangam

Today's Telugu panchangam for any place any time with day guide.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  

Kalsarp Dosha Check

Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.

Read More
  


Every setback is an opportunity for growth and a step closer to success.