Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2023 samvatsara Kanya rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Kanya Rashi in Telugu
ఉత్తర 2,3, 4 పాదాలు (టొ, ప, పి)
హస్త 4 పాదాలు (పు, షం, ణ, ఠ)
చిత్త 1,2 పాదాలు (పె, పొ)
ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి ఏడవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఎనిమిదవ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశికి ఐదవ స్థానమైన మకర రాశి నుంచి, ఆరవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 న రాహువు మీ రాశికి ఎనిమిదవ స్థానమైన మేష రాశి నుంచి, ఏడవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు రెండవ స్థానమైన తులా రాశి నుంచి ఒకటవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.
కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ పరంగా మంచి ఫలితాలను, ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరమంతా శని గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీరు చేసే పనులు విజయవంతం అవటమే కాకుండా మీ పైఅధికారుల మెప్పును కూడా పొందుతారు. ఈ సమయంలో శని గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన మీ శ్రమతోపాటు, సహోద్యోగుల సహకారం ఉద్యోగంలో మీ అభివృద్ధికి సాయపడుతుంది. ఈ సంవత్సరమంతా శని శుభ స్థానంలో సంచరించడం వలన ఉద్యోగంలో మీరు అనుకున్న ప్రగతిని సాధిస్తారు. శని దృష్టి మూడవ ఇంటిపై మరియు 12వ ఇంటిపై ఉండటం వలన విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది, మరియు వారు అనుకున్న విధంగా సంవత్సరం ప్రథమార్థంలో విదేశీ యానం చేస్తారు. అయితే ఏప్రిల్ చివరి నుంచి గురు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన అంతవరకు ఉన్న అనుకూలమైన పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ఉద్యోగంలో పదోన్నతి తోపాటు పని ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు మీరు ఎక్కువ సమయం కూడా పని చేయాల్సి వస్తుంది. అయితే ఇది మీరు కోరుకున్న పదోన్నతి అవటం వలన ఎంతటి శ్రమకైన ఓర్చుకొని మీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎనిమిదవ ఇంటిలో రాహువు మరియు గురువు కలిసి ఉండటం వలన మీరంటే నచ్చనివారి నుంచి మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ పై అధికారులతో మీ గురించి చెడుగా చెప్పడం కానీ, మీకు ఎక్కువ పని ఒత్తిడి ఉండేలా చేయడం కానీ చేయవచ్చు. ఈ సమయంలో మీరు ఓపికగా వ్యవహరించినట్లయితే ఈ సమస్య నుంచి బయట పడగలుగుతారు. శని దృష్టి మూడవ ఇంటిపై ఉండటం వలన ఉద్యోగంలో సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. ఈ సంవత్సరం మీకు ఉద్యోగ రీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం ప్రథమార్థంలో వారు అనుకున్న విధంగా ఉద్యోగాన్ని సంపాదించుకో కలుగుతారు. గురువు దృష్టి నాలుగవ ఇంటిపై, 12వ ఇంటిపై, మరియు రెండవ ఇంటిపై ఉండటం వలన మీరు ఉద్యోగ రీత్యా కొంతకాలం మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. అయితే ఇది ఆర్థికంగా అనుకూలించడమే కాకుండా భవిష్యత్తులో మీకు ఉద్యోగంలో అభివృద్ధికి సహకరిస్తుంది కాబట్టి మీరు మానసికంగా ధైర్యంగా ఉండి, నిజాయితీగా మీకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయండి. ఈ సంవత్సరం చివరలో రాహు గోచారం ఏడవ ఇంటికి, కేతు గోచారం ఒకటవ ఇంటి పైకి రావటం వలన మీరు ఒంటరిగా ఉన్నాననే భావనకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీలో ఉన్న ధైర్యం, పట్టుదల తగ్గటం వలన కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ సహోద్యోగుల కారణంగా కానీ, మీ దగ్గర పనిచేసే వారి వల్ల గాని మీరు మీ సమస్యల నుంచి బయట పడగలుగుతారు. ఈ సంవత్సరం పనుల విషయంలో ఎవరికి తొందరపడి మాట ఇవ్వకండి. దాని కారణంగా మీ ఉద్యోగం లో ఇబ్బందులు రావటమే కాకుండా, సమయం కూడా వృధా అవుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో దాని కొరకు ప్రయత్నించడం మంచిది. ద్వితీయార్ధంలో ఉద్యోగంలో మార్పు కొరకు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగం లో సమస్యలు వచ్చినా, సమస్యలు తొందరగానే తొలగిపోవడం కానీ, కొత్త ఉద్యోగం వెంటనే రావడం కానీ జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 మధ్యకాలం, 14 నుంచి మే 15 మధ్యకాలం, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 మధ్యకాలం మరియు డిసెంబర్ 16 నుంచి సంవత్సరాంతం వరకు ఉండే కాలము ఉద్యోగ విషయంలో ఒత్తిడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగ విషయంలో ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈ సమయంలో మీ పై అధికారులతో అభిప్రాయభేదాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సంయమనం పాటించడం మంచిది.
కన్యా రాశి లో జన్మించిన వ్యాపారస్థులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి సాగించే వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం, సంవత్సరమంతా శని గోచారం బాగుండటం వలన మీ వ్యాపారం బాగా సాగుతుంది. ముఖ్యంగా గురువు గోచారం ఏడవ ఇంట్లో ఉండటం వలన వ్యాపారస్తులు ఈ సమయములో మంచి వ్యాపార అభివృద్ధిని చూస్తారు. గురువు దృష్టి పదకొండవ ఇంటి పై, మూడవ ఇంటిపై మరియు ఒకటవ ఇంటి పై ఉండటం వలన ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి తో పాటు కొత్తగా వ్యాపార భాగస్వాములు రావటం లేదా కొత్త ప్రదేశాలలో వ్యాపారం ప్రారంభించడం జరుగుతుంది. శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ దగ్గర పని చేసే వారి కారణంగా కూడా మీ వ్యాపారం మంచి అభివృద్ధికి వస్తుంది. వారు నిజాయితీగా పని చేయడం మరియు వ్యాపారాభివృద్ధికి తగినంత కృషి చేయటం వలన మీరు ఎక్కువ శ్రమ పడకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. ఈ సమయంలో రాహువు గోచారము అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు కొన్నిసార్లు తీసుకునే తప్పుడు నిర్ణయాలు లేదా ఎదుటివారి మాటలకు లొంగిపోయి తీసుకునే నిర్ణయాలు వ్యాపారంలో ఇబ్బందులను ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ వరకు గురువు గోచారం బాగుంటుంది కాబట్టి ఆర్థిక నష్టాలు జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. కానీ ఏప్రిల్ తర్వాత గురువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు అనుభవజ్ఞుల సలహా మేరకే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తొందరపడి వ్యాపార విషయంలో, పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకోకండి. శని గోచారం కారణంగా వ్యాపారం బాగా లాభించినప్పటికీ ఆర్థికంగా ఏప్రిల్ నుంచి కొంత సామాన్యంగా ఉంటుంది. మీకు వచ్చే లాభాలను తిరిగి పెట్టుబడులు పెట్టడానికి లేదా ఇతర అవసరాలకు వాడుకోవడం వలన ఈ సమయంలో మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. నవంబర్ నుంచి రాహువు గోచారము ఏడవ ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ భాగస్వాములు మీతో గొడవలు పడటం వల్ల కానీ లేదా విడిపోవడం వల్ల కానీ మీరు ఏకాగ్రతతో వ్యాపారాన్ని చేయలేకపోతారు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం, మరియు ఏ సమస్యలు వచ్చినా సామరస్య పూర్వంగా పరిష్కరించు కోవడం వలన వ్యాపార నష్టాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.
స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం అంతా శని గోచారం బాగుండటం, ఏప్రిల్ వరకు గురువు గోచారం బాగుండటం వలన మీరు మంచి అవకాశాలను పొందుతారు. మీరు నిజాయితీగా చేసే పని కారణంగా మీకు పని ఇచ్చిన వారి మన్ననలు, ప్రజల మన్ననలు పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడం వలన డబ్బు తో పాటుగా మీ పని కూడా పెరుగుతుంది. మీ ప్రతిభ కారణంగా మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో గురువు గోచారం బాగుంటుంది కాబట్టి ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం, అక్టోబర్ చివరి వరకు రాహు గోచారం కూడా ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోతారు. దానివలన డబ్బు నష్ట పోవడమే కాకుండా అవకాశాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఇతరుల మాటలు విని ఎక్కువ డబ్బులు అడగటం కానీ లేదా మీకు పని ఇచ్చే వారిపై కోపాన్ని ప్రదర్శించడం వలన కూడా మీకు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అయితే ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు నిజాయితీగా పని చేసినట్లైతే మీకు మళ్లీ అవకాశాలు పెరగటమే కాకుండా గతంలో ఏర్పడిన చెడ్డ పేరు కూడా తొలగిపోతుంది. ఈ సమయంలో మీకు తప్పుడు సలహాలు ఇచ్చే వారిని, మిమ్మల్ని పొగిడి తప్పు దోవ పట్టించే వారిని మీరు దూరం పెట్టడం మంచిది. వచ్చే ఫలితంకంటే ఎక్కువ చేసే పని మీద దృష్టి పెట్టడం వలన ఈ సమయంలో మిమ్మల్ని మీరు ఇబ్బందుల పాలు కాకుండా రక్షించుకోగలుగుతారు. ఈ సంవత్సరం చివరలో రాహు గోచారం ఏడవ ఇంటికి రావడం వలన మీరు చేసే పనుల విషయంలో ఇతరులతో గొడవలు పడటం కానీ లేదా ఆత్మీయులతో మనస్పర్థలు ఏర్పడటం కానీ జరుగుతుంది. దాని కారణంగా మీకు వచ్చిన అవకాశాలను మీరు వినియోగించుకోకుండానే అవి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మానసికంగా ధైర్యంగా ఉండటం అలాగే చేసే పనిపై శ్రద్ధను కలిగి ఉండటం వలన మీరు మరిన్ని అవకాశాలు పొందగలుగుతారు.
ఈ సంవత్సరం కన్య రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకూ గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. గురువు దృష్టి పదకొండవ ఇంటిపై, ఒకటవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు, చేసిన ఆలోచనలు విజయవంతం అవటం వలన ఆర్థికంగా మీకు లాభిస్తుంది. ఈ సమయంలో శని గోచారం కూడా ఆరవ ఇంటిలో అనుకూలంగా ఉండటంతో మీ వృత్తి పరంగా కూడా మీరు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు ఈ సంవత్సరం ఇల్లు కాని, వాహనం కానీ, ఇతర స్థిరాస్థులు కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఆ పని ఏప్రిల్ లోపు చేయటం మంచిది. ఏప్రిల్ తర్వాత గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు పెట్టే పెట్టుబడులు కానీ, కొనుగోళ్లు కానీ నష్టాలను ఇచ్చే అవకాశముంటుంది. రాహు గోచారం నవంబర్ వరకు ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో తొందరపడి, లేదా ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టకండి. సంవత్సరమంతా శని గోచారం బాగుండటం వలన మీకు ఆర్థికంగా ఎక్కువ సమస్యలు లేకున్నప్పటికీ ఏప్రిల్ నుంచి గురువు మరియు రాహువు ఎనిమిదవ ఇంటిలో సంచరించడం వలన ఒక్కోసారి డబ్బుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఈ సమయంలో మీ ఆర్థిక స్థితిని సరిగా గమనించుకోకుంటే మీరు ఆర్థిక నష్టాలను చూసే అవకాశం ఉంటుంది. తర్వాత గురు దృష్టి 12వ ఇంటిపై, రెండవ ఇంటిపై మరియు నాలుగవ ఇంటిపై ఉండటం వలన మీరు మీ కుటుంబం కొరకు, అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు మరియు ఇండ్లు, వాహనాలు తదితర గృహోపకరణాల మరమ్మతులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడం వలన వాటి కొరకు కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మీరు చేసే డబ్బు ఖర్చు ఎక్కువ శాతం ఉపయోగకరమైన పనుల కొరకే అయినప్పటికీ, ఎక్కువ డబ్బు ఖర్చవటం వలన ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశముంటుంది.. అయితే ఎనిమిదో ఇంట్లో రాహువు గోచారం ఉన్నంతకాలం మీరు గొప్పలకు పోకుండా, డబ్బులు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. నవంబర్లో రాహువు గోచారం ఏడవ ఇంటికి మారటంతో ఆర్థిక నష్టాలు కొంత మేరకు తగ్గుతాయి, మరియు ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యకాలం, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యకాలం, మరియు డిసెంబర్ 16 నుంచి సంవత్సరాంతం వరకు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్త పడటం మంచిది. ఈ జాగ్రత్తల వలన మీరు ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయట పడగలుగుతారు.
కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ తర్వాత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటంతో మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో శని గోచారం కూడా అనుకూలంగా ఉండటంతో సరైన చికిత్స లభించి దీర్ఘకాలంగా ఆరోగ్య విషయంలో పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. గురువు దృష్టి పదకొండవ ఇంటి పై ఉండటం వలన ఈ సమయంలో చిన్న, చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే కోరుకుంటారు. సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొత్తగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు దృష్టి ఒకటవ ఇంటి పై ఉండటం వలన కూడా ఆరోగ్య మెరుగు పడటానికి సహాయపడుతుంది. అయితే నవంబర్ వరకు రాహువు గోచారము ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి జీర్ణాశయం సంబంధ ఆరోగ్య సమస్యలు, మూలశంక లాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే గురువు మరియు శని గోచారం ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం కొనసాగవు. ఏప్రిల్ తర్వాత గురు గోచారం కూడా ఎనిమిదవ ఇంటికి మారడం వలన మీ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి మంచిది. ముఖ్యంగా కాలేయము, జీర్ణాశయం, మర్మావయవాలు మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అంతేకాకుండా తప్పుడు మందులు వాడడం వల్ల కానీ లేదా తప్పుగా వ్యాధి పరీక్షలు నిర్వర్తించడం వల్ల కానీ మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఒకరి అభిప్రాయానికే కట్టుబడక, తిరిగి వేరొకరితో కూడా వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. దానివలన మీరు సరైన విధంగా చికిత్సను పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. గురువు మరియు రాహువు కలిసి ఉండటం వలన ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మీరు ఆహారం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధ పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకూ పరిశుభ్రంగా లేని ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడటం మంచిది. నవంబర్లో రాహు గోచారం ఏడవ ఇంటికి, కేతువు గోచారం ఒకటవ ఇంటికి మారటంతో శారీరక ఆరోగ్య సమస్యల కంటే మానసిక ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. లేని సమస్యలను, రాని జబ్బులను వచ్చినట్టు ఊహించు కొని బాధపడటం, మానసికంగా ఆందోళనకు గురి అవ్వడం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ప్రాణాయామం, యోగా లాంటి మనసును ఉల్లాసంగా ఉంచే పద్ధతులు పాటించడం మంచిది. దానివలన మీరు మానసిక సమస్యల నుంచి బయట పడగలుగుతారు. ఈ సంవత్సరం జులై ఒకటి నుంచి ఆగస్టు 18 మధ్యలో కుజుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అలాగే విద్యుత్ సంబంధ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం ఏడవ ఇంటిలో ఉండటంతో మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు మరియు మంచి అవగాహన కలిగి ఉంటారు. గురువు దృష్టి పదకొండవ ఇంటిపై, ఒకటవ ఇంటి పై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువుల నుంచి మరియు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకోవడమే కాకుండా వారితో మంచి అనుబంధం కలిగి ఉంటారు. అంతేకాకుండా మీరు చేసే ఆలోచనలు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా అవి వారి అభివృద్ధికి తోడ్పడతాయి. ఏడవ ఇంటిలో గురువు గోచారం మీ జీవిత భాగస్వామికి అభివృద్ధిని ఇస్తుంది. ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండటం వలన, గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రహస్య శత్రువులు, గాని వివాదాలు గాని ఈ సమయంలో మీకు దూరం అవడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం ఎనిమిదవ ఇంటికి మారటం వలన మీ కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో పదోన్నతి కారణంగా కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ కొంతకాలం మీకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా మీరు కూడా వృత్తిలో లేదా ఇతర పనుల్లో తలమునకలై పోవటం వలన కుటుంబ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకునే సమయం దొరకదు. దాని కారణంగా మీ కుటుంబంలో అభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది. మీ పిల్లలు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ గతంలో ఇచ్చిన విధంగా గౌరవం ఇవ్వకపోవడం కానీ లేదా మీ మాటకు విలువ ఇవ్వకపోవడం కానీ చేయటం వలన మీరు ఆవేశానికి, అసహనానికి గురవుతారు. అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పరిస్థితులను అర్థం చేసుకొని ఓపికగా సమస్యను పరిష్కరించే విధంగా అడుగులు వేస్తారు. దాని కారణంగా కుటుంబంలో ఏర్పడిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. కేతువు గోచారం నవంబర్ వరకు రెండవ ఇంటిలో ఉండటం వలన మీ బంధువుల్లో కానీ, కుటుంబసభ్యుల్లో కానీ ముఖ్యులకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గురువు మరియు రాహువు గోచారం ఏప్రిల్ మరియు నవంబర్ మధ్య ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన మీ తండ్రిగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీలో కొంతమంది విదేశాలకు కూడా వెళతారు. సంవత్సరం ప్రథమార్థంలో మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఒకవేళ మీరు అవివాహితులై వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ప్రథమార్థంలో మీకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మీరు సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం గురు దృష్టి పదకొండవ ఇంటి పై అనుకూలంగా ఉంటుంది కాబట్టి సంతాన యోగం కూడా ఉంటుంది.
ఈ సంవత్సరం కన్యారాశిలో జన్మించిన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్ధంలో గురువు గోచారం ఏడవ ఇంటిలో అనుకూలంగా ఉండటం, ద్వితీయార్ధంలో గురు దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన చదువులో ఏకాగ్రత కలిగి ఉండటమే కాకుండా పరీక్షలలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు గురు గోచారం ఏడవ ఇంట్లో ఉండటం వలన, గురువు దృష్టి ఒకటవ ఇంటిపై, మూడవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉంటుంది. ఈ దృష్టి కారణంగా విద్యార్థుల్లో చదువు మీద ఆసక్తి తో పాటుగా పట్టుదల కూడా పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరిక ఎక్కువవుతుంది. వారి గురువులు, మరియు పెద్దవారి సలహాలతో వారు విద్యలో రాణించగలుగుతారు. ముఖ్యంగా తమ ఉన్నత విద్యాభ్యాసం ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో లేదా విద్యాసంస్థల్లో చేయాలనుకునే వారి కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఈ సంవత్సరమంతా శని గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన పోటీ వాతావరణాన్ని తట్టుకుని మరీ మంచి మార్పులు సాధించడమే కాకుండా వారు అనుకున్న విద్యా సంస్థలలో ప్రవేశం పొందగలుగుతారు. అయితే ఏప్రిల్లో గురువు గోచారం ఎనిమిదవ ఇంటికి మారటంతో వారికి చదువు మీద కొద్దిగా శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. గురువు రాహువుతో కలిసి ఉండటం కారణంగా వీరు వేరే విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం అలాగే చదువుకంటే ఎక్కువ వినోదానికి ప్రాధాన్యత ఇవ్వటం వలన వీరు పరీక్షలలో సామాన్యంగా రాణించగలుగుతారు. అయితే గురు దృష్టి నాలుగవ ఇంటిపై మరియు రెండవ ఇంటిపై ఉండటం వలన వారి గురువుల సహకారంతో తాము చేసిన తప్పును గుర్తించి తిరిగి చదువు మీద దృష్టి పెడతారు. ఈ సంవత్సరం నవంబర్ నుంచి రాహు గోచారం ఏడవ ఇంటిలో కేతువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన వీరు మానసికంగా కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఫలితాల విషయంలో ఎక్కువ ఆందోళన పడటం కాని చదువుపై ఎక్కువగా ఏకాగ్రత పెట్టలేకపోవడం కానీ జరుగుతుంది. ఉద్యోగాల కొరకు పరీక్షలు రాస్తున్న వారు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శని గోచారం బాగుండటం వలన వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు.
కన్యా రాశి వారు ఈ సంవత్సరం ప్రధానంగా రాహువుకు, గురువుకు, మరియు కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. ఈ సంవత్సరమంతా రాహువు గోచరము అనుకూలంగా ఉండదు కాబట్టి రాహువు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు తొలగిపోవడానికి రాహువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ రాహు స్తోత్రం చదవటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. అలాగే రాహు ప్రభావాన్ని తగ్గించే దుర్గా స్తోత్రం చదవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరమంతా కేతు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కేతువు ఇచ్చే మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు తొలగిపోవడానికి కేతువుకు పరిహారాలు చేయడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు కానీ, ప్రతి మంగళవారం కానీ కేతు స్తోత్రం చదవడం, కేతు మంత్ర జపం చేయటం లేదా కేతువు పూజ చేయడం వలన కేతు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువు ఇచ్చి చెడు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చేయడం కూడా మంచిది. ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి నుంచి గురువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి గురువు ఇచ్చే ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవటానికి ప్రతిరోజు కానీ, ప్రతి గురువారం కానీ గురు పూజ చేయటం, గురు స్తోత్రం చదవటం, లేదా గురు మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఇచ్చే గురు చరిత్ర పారాయణం చేసినా కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.
Onlinejyotish.com giving Vedic Astrology services from 2004. Your help and support needed to provide more free Vedic Astrology services through this website. Please share https://www.onlinejyotish.com on your Facebook, WhatsApp, Twitter, GooglePlus and other social media networks. This will help us as well as needy people who are interested in Free Astrology and Horoscope services. Spread your love towards onlinejyotish.com and Vedic Astrology. Namaste!!!