మిథునరాశి - 2023 సంవత్సర రాశి ఫలములు

మిథున రాశిఫలములు

2023 సంవత్సర రాశిఫలములు

Telugu Rashi Phalalu (Rasi phalamulu)

2023 Rashi phalaalu

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2023 samvatsara Mithuna rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Mithuna Rashi in Telugu


MIthuna rashi, vijaya telugu year predictions

మృగశిర 3,4 పాదములు (కా,కి),
ఆరుద్ర 1,2,3,4 పాదములు(కు, ఘ, ఙ, ఛ)
పునర్వసు 1,2,3 పాదములు (కే,కో, హా)

ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశినుండి పదవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత పదకొండవ స్థానమైన మేష రాశిలోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశికి ఎనిమిదవ స్థానమైన మకర రాశి నుంచి, తొమ్మిదవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 న రాహువు మీ రాశి నుంచి పదకొండవ స్థానమైన మేష రాశి నుండి, మీ రాశికి పదవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు మీ రాశికి ఐదవ స్థానమైన తులా రాశి నుంచి, నాలుగవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

2023వ సంవత్సరం ఉద్యోగస్థులకు ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం మిధున రాశి వారికి వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. శని గోచారం ఎనిమిదవ ఇంటినుంచి 9వ ఇంటికి రావడం వలన వృత్తి పరంగా గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. గతంలో మీ వృత్తిలో మీకు ఏర్పడిన అవమానాలు కానీ, ఒత్తిళ్లు కానీ తగ్గడం వలన మీరు మీ వృత్తిలో అభివృద్ధి సాధించగలుగుతారు. గురువు గోచారం ఏప్రిల్ వరకు పదవ ఇంటిలో ఉండటం వలన వృత్తి పరంగా మీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించ కలుగుతారు. గురు దృష్టి ఆరవ ఇంటిపై మరియు రెండవ ఇంటిపై ఉండటం, అలాగే శని దృష్టి కూడా ఆరవ ఇంటిపై ఉండటం వలన వృత్తిలో మీరు కోరుకున్న అభివృద్ధిని పొందుతారు. గతంలో వృత్తి పరంగా మీకు ఆటంకాలు కల్పించిన వారు ఈ సమయంలో మీకు దూరం అవుతారు, దానితో మీకు మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. మీరు చెప్పిన మాటకు, సలహాలకు మీ కార్యాలయంలో విలువ పెరగడమే కాకుండా, మీ కీర్తి ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి. మీలో ఉన్న బద్ధకం, అలసత్వం కూడా తగ్గి ఉత్సాహంగా మీరు మీ వృత్తిని నిర్వర్తించ కలుగుతారు. అక్టోబర్ చివరి వరకు రాహు గోచారం కూడా పదకొండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన మీకు మీ వృత్తిలో ఆకస్మిక అభివృద్ధి కలుగుతుంది. గతంలో మీరు చేసిన పనులకు ఈ సమయంలో ఫలితం లభిస్తుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం పదకొండవ ఇంటిలో ఉండటం వృత్తి విషయంలో మీకు అత్యంత అనుకూలిస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతం అవడం వలన మీ పై అధికారుల మెప్పు పొందుతారు. మీరు ఈ సమయంలో విదేశాల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నట్లైతే ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళటానికి మంచి అవకాశాన్ని అందుకుంటారు. గురువు మరియు రాహువు గోచారం పదకొండవ ఇంటిలో ఉండటం వలన చాలా విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ సహోద్యోగుల సహాయం మరియు మిత్రుల సహాయం కారణంగా మీరు మీ వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. అయితే శని దృష్టి పదకొండవ ఇంటి పై ఉండటం వలన కొన్నిసార్లు మీకు రావలసిన ఫలితం రావడంలో కొంత ఆలస్యం కావచ్చు కానీ రావలసిన ఫలితం రాకుండా మాత్రం ఉండదు. వృత్తి పరంగా మీ ఆదాయం కూడా పెరగటం వలన మీరు సౌకర్యవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. తొమ్మిదవ ఇంటిలో శని గోచారం మీరు విదేశాలకు వెళ్లడానికి మరియు అక్కడ ఎక్కువ కాలం ఉండటానికి సహకరిస్తుంది. అయితే కొన్నిసార్లు విదేశాల విషయంలో ఎక్కువ సార్లు ప్రయత్నం చేయాల్సి రావచ్చు కాబట్టి మొదటి ప్రయత్నంలో అనుకూలమైన ఫలితం రాకుంటే తిరిగి ప్రయత్నించటం మంచిది. నవంబర్ నుంచి రాహు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి వృత్తి పరంగా కొన్ని ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మార్పులు ముఖ్యంగా మీ స్వయంకృత అపరాధాలు కారణంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఉద్యోగ విషయంలో బాధ్యతల విషయంలో నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి మీ పని నిజాయితీగా చేయటం మంచిది. పన్నెండవ ఇంటిలో రాహువు గోచారం అహంకారాన్ని, నిర్లక్ష్య ధోరణిని ఇస్తుంది కాబట్టి మీకు వచ్చిన విజయాలకు పొంగి పోకుండా, వినయాన్ని విడవకుండా వృత్తి మీద శ్రద్ధ పెట్టినట్లయితే ఉద్యోగ విషయాల్లో ఈ సంవత్సరం మీరు అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. మీరు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే లేదా ఉద్యోగంలో మార్పు కొరకు, పదోన్నతుల కొరకు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. మీరు కోరుకున్న చోటికి బదిలీపై వెళ్లటం కానీ, లేదా మీరు కోరుకున్న విధంగా పదోన్నతి లభించడం కానీ జరుగుతుంది. ఉద్యోగ విషయంలో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 మధ్యకాలం, మే 15 నుంచి జూన్ 15 మధ్యకాలం, మరియు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 17 మధ్యకాలం అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఉద్యోగ విషయంలో ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి.

2023వ సంవత్సరం వ్యాపారస్థులకు మరియు స్వయం ఉపాధి కలవారికి ఎలా ఉండబోతోంది?

వ్యాపారస్థులకు, స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి 2023 వ సంవత్సరం చాలా మంచి ఫలితాలనిస్తుంది. గత రెండు సంవత్సరాలుగా వ్యాపారం సరిగా నడవక, సరైన అవకాశాలు రాక అవమానాలతో, ఆర్థిక నష్టాలతో ఇబ్బంది పడ్డ మీకు ఈ సంవత్సరం వ్యాపారంలో మంచి అభివృద్ధి జరగడమే కాకుండా గతంలో మీరు చేసిన అప్పులు కానీ, లోన్లు కానీ తిరిగి తీర్చగలుగుతారు. ఏప్రిల్ వరకు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన అనుకోని విధంగా మిత్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ సహాయం అందటం వలన అది మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. జనవరి నుంచి శని గోచారం తొమ్మిదవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది. దాని కారణంగా వ్యాపారంలో వృద్ది సాధ్యమవుతుంది. శని దృష్టి సంవత్సరం అంతా ఆరవ ఇంటిపై ఉండటం వలన మీ దగ్గర పనిచేసేవారి కారణంగా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. అంతే కాకుండా గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రహస్య శత్రువులు ఈ సమయంలో మీకు దూరమవడం వలన కూడా మీరు మనశ్శాంతిగా మీ వ్యాపారంపై దృష్టి పెట్టగలుగుతారు. ఏప్రిల్ నుంచి గురు గోచారం పదకొండవ ఇంటిలో ఉండటం, గురు దృష్టి వ్యాపార స్థానమైన ఏడవ ఇంటిపై ఉండటం వలన మీరు మీ వ్యాపారాన్ని విస్తరించటానికి మంచి అవకాశాలు వస్తాయి. ఈ సంవత్సరం భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి లేదా ప్రస్తుతం ఉన్న వ్యాపారంలో భాగస్వాములను జతచేయటానికి అనుకూలంగా ఉంటుంది.

స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. గత కొద్ది కాలంగా చేతిలో ఉన్న అవకాశాలు దూరమవటం, అలాగే మీకు వచ్చిన అవకాశాలు కూడా మీ ప్రత్యర్థులు తీసుకెళ్లటం వలన మీరు నిరాశకు, మానసిక సమస్యలకు లోనై ఉండవచ్చు. ఈ సంవత్సరం నుంచి మీరు ఆ సమస్య నుంచి బయట పడగలుగుతారు. మీ ప్రతిభకు తగిన అవకాశాలు ఈ సంవత్సరం ఇబ్బడిముబ్బడిగా మీకు అందుతాయి. దాని కారణంగా మీరు మీ రంగంలో పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు కూడా సంపాదించుకోగలుగుతారు. గురు దృష్టి ఏప్రిల్ నుంచి అయిదవ ఇంటిపై ఉండటం వలన మీ సృజనాత్మకత కూడా మెరుగవుతుంది. మీరు చేపట్టే పనులు కానీ, మీ ప్రతిభా పాటవాలు కానీ మీ చుట్టూ ఉన్నవారిని రంజింప చేయగలుగుతాయి. మీరు మీ ప్రతిభతో మీ స్వస్థలంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా రాణించగలుగుతారు. మీలో కొంతమంది విదేశాల్లో కూడా ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పొందుతారు. నవంబర్ నుంచి రాహువు గోచారం పన్నెండవ ఇంట్లో అనుకూలంగా ఉండకపోవడం వలన ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. 10 వ ఇంటిలో రాహువు మీలో అహంకారాన్ని కానీ మీ పట్ల నిర్లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిన అవకాశాలను వదిలివేయకుండా వాటిని వినియోగించుకోవడం మంచిది. గురు గోచారం పదకొండవ ఇంట్లో ఉండటం వలన మీకు మంచి అవకాశాలు వస్తాయి, అయితే వాటిని మీ నిర్లక్ష్యంతో, అహంకారంతో వదిలివేయకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థికంగా వ్యాపార పరంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి మే 14 మధ్యకాలం, జులై 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యకాలం మరియు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 16 మధ్యకాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో మీరు తీసుకోవచ్చు. ఈ సమయంలో మీకు వ్యాపార అభివృద్ధికి సంబంధించి మంచి అవకాశాలు కూడా వస్తాయి.

2023వ సంవత్సరం మీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది?

2023 సంవత్సరం మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గడచిన రెండున్నర సంవత్సరాలుగా శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఏర్పడిన ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరం తగ్గుతాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం గురువు మరియు రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీరు పటిష్టమైన ఆర్థిక స్థితి కి చేరుకుంటారు. జనవరిలో శని గోచారం అనుకూలంగా రావటం వలన ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈ సమయంలో రాహువు గోచారం పదకొండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఆకస్మిక ధన లాభాలు కానీ, కోర్టు కేసులు లేదా వారసత్వ సంబంధ ఆస్తులు కానీ కలిసి రావడంతో గత కొద్ది కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా గురు దృష్టి నాలుగవ ఇంటిపై మరియు ధన స్థానమైన రెండవ ఇంటిపై ఉండటం వలన డబ్బు పొదుపు చేయగలుగుతారు అలాగే గతంలో తీసుకున్న బ్యాంకు లోన్ లు కానీ, అప్పులు కాని తిరిగి తీర్చగలుగుతారు. ఏప్రిల్ నుంచి గురు గోచారం పదకొండవ ఇంటిలో అత్యంత అనుకూలంగా ఉండటం వలన మీకు వృత్తి పరంగా, వ్యాపార పరంగా కలిసి వచ్చి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు పెట్టిన పెట్టుబడులు కూడా ఈ సమయంలో మంచి లాభాలను ఇస్తాయి. ఇల్లు కాని, వాహనం కానీ, లేదా ఇతర స్థిరాస్థులు కానీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారికి కూడా ఈ సంవత్సరం లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా శని దృష్టి పదకొండవ ఇంటి పై ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు అనుకున్న విధంగా లాభం రాకపోవడం కానీ లేదా అవసరానికి ఉపయోగపడేలా సమయానికి డబ్బు అందకపోవడం కానీ జరగవచ్చు. ఈ సంవత్సరం జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 మధ్యకాలం, మే 15 నుంచి జూన్ 16 మధ్యకాలం మరియు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 18 మధ్యకాలం పెట్టుబడులకు ఆర్థిక సంబంధ లావాదేవీలకు మంచిది కాదు కాబట్టి ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడి పెట్టకపోవడం మరియు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉండటం మంచిది.

2023వ సంవత్సరం మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది?

ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిధున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శని గోచారం ఎనిమిదవ ఇంటినుంచి తొమ్మిదవ ఇంటికి మారటం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సంవత్సరమంతా గ్రహ స్థితి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదు. శని దృష్టి ఆరవ ఇంటిపై ఉండటం వలన కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు. అంతేకాకుండా ఏప్రిల్ వరకు ఆరవ ఇంటిపై గురు దృష్టి కూడా ఉండటం వలన కొత్తగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్ వరకు రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన ఉదర సంబంధ మరియు మెడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. అయితే కేతువు గోచారం నవంబర్ వరకు అయిదవ ఇంటిలో ఆ తర్వాత నాలుగవ ఇంటిలో ఉండటం వలన ఊపిరితిత్తులు, మరియు చర్మ సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్లో గురువు గోచారం పదకొండవ ఇంటిలో అనుకూలంగా రావటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందర్లోనే బయట పడగలుగుతారు. కేతువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సంవత్సరంలో కొన్ని సమయాల్లో మానసిక సమస్యల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ ఆందోళన చెందడం వలన మీరు మానసికంగా బలహీనులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ బంధువులు మరియు మిత్రుల కారణంగా మీరు మీ మానసిక సమస్యల నుంచి అలాగే శారీరక ఆరోగ్య సమస్యల నుంచి బయట పడగలుగుతారు. ఈ సంవత్సరం మార్చి 13 నుంచి మే 10 మధ్యలో మరియు ఆగస్టు 18 నుంచి అక్టోబర్ మొదటి వారం మధ్యలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఉండటం మంచిది. ఈ సమయంలో అనవసరమైన ఆవేశాలకు లోనవటం వలన అది మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించవచ్చు.

2023వ సంవత్సరం మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది?

మిధున రాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎనిమిదవ ఇంటిలో శని గోచారం పూర్తవడం వలన గత కొద్ది కాలంగా కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ మీకు ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఏప్రిల్ వరకు కేతువు పై శుభ గ్రహ దృష్టి లేని కారణంగా మీ సంతానం విషయంలో కొంత ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారి ఆరోగ్య విషయంలో కానీ, వారి చదువు విషయంలో గాని మీరు ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. ఏప్రిల్ నుంచి గురు గోచారం పదకొండవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ సంతానంయొక్క ఆరోగ్యం మెరుగు పడటం కానీ, వారు చదువులో మంచి మార్కులతో ఉత్తీర్ణులవడం కానీ జరగటం వలన మీ మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. గురు దృష్టి ఏడవ ఇంటిపై ఏప్రిల్ నుంచి సంవత్సరమంతా ఉంటుంది కాబట్టి అది మీ సంతానానికి, మీ జీవిత భాగస్వామికి మరియు మీ తోబుట్టువులకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీ జీవిత భాగస్వామి సహకారంతో మీరు విజయాలు సాధిస్తారు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం రావడం కానీ లేదా, పదోన్నతి రావడం కానీ ఈ సమయంలో జరుగుతుంది. మీ జీవితభాగస్వామికి అభివృద్ధి కలగటం కారణంగా మీరు ఆనందిస్తారు. మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. మీ సహాయం కారణంగా మీ తోబుట్టువులు వారు అనుకున్న పనిలో విజయం సాధించగలుగుతారు. ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం అవటమే కాకుండా వారి జీవితం కూడా మెరుగు పడుతుంది. అలాగే సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. శని గోచారం సంవత్సరమంతా తొమ్మిదవ ఇంటిలో ఉండటం, నవంబర్ నుంచి కేతువు గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా సంవత్సర ద్వితీయార్ధంలో వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యం తొందరలోనే మెరుగు పడటం జరుగుతుంది.

2023వ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?

విద్యార్థులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ చివరి వరకు రాహు గోచారం, ఏప్రిల్ నుంచి గురువు గోచారం మరియు జనవరి నుంచి శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీరు విద్యలో రాణించగలుగుతారు. ముఖ్యంగా శని గోచారం తొమ్మిదవ ఇంట ఉండటం వలన ఉన్నత విద్యావకాశాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనుకునేవారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వారు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. అయితే అయిదవ ఇంటిలో కేతువు గోచారం ఉన్నంతకాలం పరీక్షలు వ్రాసేటప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం అలాగే అలసత్వానికి, నిర్లక్ష్యానికి గురవ కుండా చదువుపై శ్రద్ధ పెట్టడం మంచిది. అలాగే సంవత్సరం చివరలో కేతువు గోచారం నాలుగవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చదువుపై శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే ఏప్రిల్ నుంచి గురువు గోచారం పదకొండవ ఇంటి లో అనుకూలంగా ఉండటం వలన చదువులో సమస్యలు వచ్చినప్పటికీ మీ గురువుల మరియు పెద్ద వారి సహకారంతో వాటి నుంచి బయట పడగలుగుతారు. ఈ సంవత్సరం ఐదవ ఇంటిపై గురు దృష్టి ఉండటం వలన కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా మీరు సాంప్రదాయక విద్యలను మరియు ఆధ్యాత్మిక విద్యలను కూడా ఈ సంవత్సరం అభ్యసించే అవకాశం ఉంటుంది. గురువు దృష్టి మూడవ ఇంటిపై కూడా ఉండటం వలన మీరు ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకుని నెగ్గుకు రాగలుగుతారు. కాంపిటీటివ్ పరీక్షలు రాసే వారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధం అత్యంత అనుకూలంగా ఉంటుంది. గురు దృష్టి అయిదవ ఇంటిపై ఉండటం వలన మీరు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఉద్యోగం సంపాదించుకో కలుగుతారు. అయితే గురు దృష్టి ఉన్నప్పటికీ కేతువు స్థితి ఐదవ ఇంటిలో ఉన్నంతకాలం కాంపిటీటివ్ పరీక్షల్లో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త పడటం మంచిది.

2023వ సంవత్సరం ఏ గ్రహాలకు, ఏయే పరిహారాలు చేయాలి?

ఈ సంవత్సరం శని గోచారం తొమ్మిదవ ఇంటిలో ఉండటం అలాగే గురు దృష్టి అయిదవ ఇంటిపై ఉండటం, మరియు కేతువు గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన మీరు ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. దైవారాధన చేయడమే కాకుండా పుణ్య క్షేత్ర సందర్శన కూడా చేస్తారు. అలాగే గురువులను, ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి సాధించిన వారిని సందర్శిస్తారు. ఈ సంవత్సరం చేయాల్సిన పరిహారాల విషయానికొస్తే, ఈ సంవత్సరం ప్రధానంగా కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. సంవత్సర ఆరంభం నుంచి ఐదవ ఇంటిలో సంచారం చేయటం, సంవత్సరాంతంలో నాలుగవ ఇంట్లో సంచారం చేయటం వలన చదువు విషయంలో మరియు ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల నుంచి అవాంతరాల నుంచి బయటపడటానికి కేతువుకు పరిహార క్రియలు ఆచరించడం మంచిది. దానికి గాను ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్రం పారాయణం చేయటం లేదా గణపతి స్తోత్రం పారాయణం చేయటం మంచిది. దీనివలన మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోయి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు గురువు గోచారం, సంవత్సరమంతా శని గోచారం, నవంబర్ నుంచి రాహు గోచారం మధ్యమంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలకు కూడా పరిహారాలు చేయడం వలన మీ జీవితంలో ఈ సంవత్సరం ఏర్పడే చిన్న, చిన్న సమస్యల నుంచి బయట పడగలుగుతారు. దీనికి గాను ఆయా గ్రహాల స్తోత్రాలు చదవటం లేదా నవగ్రహ మందిరాల్లో ఆయా గ్రహాలకు పూజలు చేయటం మంచిది.

రాజాది నవనాయక ఫలితములు

12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు

శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2023 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2023 rashi phal
Gemini
Mithuna rashi, year 2023 rashi phal
Cancer
Karka rashi, year 2023 rashi phal
Leo
Simha rashi, year 2023 rashi phal
Virgo
Kanya rashi, year 2023 rashi phal
Libra
Tula rashi, year 2023 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2023 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2023 rashi phal
Capricorn
Makara rashi, year 2023 rashi phal
Aquarius
Kumbha rashi, year 2023 rashi phal
Pisces
Meena rashi, year 2023 rashi phal

Mangal Dosha Check

Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

Read More
  

Mangal Dosha Check

Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  


Lead by example, be a role model and watch your influence grow.