తులారాశి - 2023 తెలుగు సంవత్సర రాశి ఫలములు

తులా రాశిఫలములు

2023 సంవత్సర రాశిఫలములు

Telugu Rashi Phalalu (Rasi phalamulu)

2023 Rashi phalaalu

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2023 samvatsara Tula rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Tula Rashi in Telugu


తులారాశి జయ రాశి ఫలాలు

చిత్త 3, 4 పాదాలు (ర,రి),
స్వాతి నాలుగు పాదాలు (రు, రె, రో,త),
విశాఖ 1, 2, 3 పాదాలు (తి, తు, తే)

ఈ సంవత్సరం తులా రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి ఆరవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఏడవ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశికి నాలుగవ స్థానమైన మకర రాశి నుంచి, ఐదవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 న రాహువు ఏడవ స్థానమైన మేష రాశి నుంచి, ఆరవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు ఒకటవ స్థానమైన తులా రాశి నుంచి పన్నెండవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

2023వ సంవత్సరం ఉద్యోగస్థులకు ఎలా ఉండబోతోంది?

తులా రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరంకంటే మంచి ఫలితాలనిస్తుంది. ఈ సంవత్సరమంతా శని గోచారం అయిదో ఇంట్లో ఉండటం, ఏప్రిల్ నుంచి గురు గోచారం ఏడవ ఇంటిలో అనుకూలంగా ఉండటం, సంవత్సరం చివరలో రాహు గోచారం అనుకూలంగా రావటం వలన ఈ సంవత్సరం ఉద్యోగ పరంగా, ఆర్థికంగా అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు కొంత సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి కోసం చేసే పనులు అంతగా అనుకూలించక పోవడం వలన కొంత నిరాశకు లోనవుతారు. అంతేకాకుండా చేసిన పని మళ్లీ, మళ్లీ చేయాల్సి రావడం వలన కూడా కొంత చికాకుకు లోనవుతారు. మీకు రావలసిన పదోన్నతి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మీరు చేసే పనులకు గుర్తింపు రావటం వలన కొంత సంతృప్తిని పొందుతారు. శని దృష్టి పదకొండవ ఇంటిపై, రెండవ ఇంటిపై మరియు ఏడవ ఇంటిపై ఉండటం వలన మీరు చెప్పే మాటకు మీ సహోద్యోగులు కానీ, మీ పై అధికారులు కానీ విలువ ఇవ్వకపోవటం, అలాగే మీ ఆలోచనలను వారు పక్కన పెట్టడం జరగటం వలన మీరు నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేస్తే, మీరు చేసే పనులు విజయవంతం అవటమే కాకుండా, మీ సహోద్యోగుల మెప్పును కూడా పొందగలుగుతారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం ఏడవ ఇంటికి మారటం వలన మీ ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు ప్రారంభమవుతాయి. గురువు దృష్టి పదకొండవ ఇంటిపై, ఒకటవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు ఉత్సాహంగా ఉండటమే కాకుండా మీకు కేటాయించిన పనులు, బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు చేసే పనులకు గుర్తింపు లభించి ఈ సమయంలో మీరు అనుకున్న విధంగా పదోన్నతి పొందగలుగుతారు. అంతేకాకుండా మీ సహోద్యోగులు మరియు పై అధికారుల సహాయంతో మీరు మీ ఉద్యోగంలో మంచి ప్రగతి సాధించగలుగుతారు. ఈ సమయంలో విదేశీ యానం కొరకు ప్రయత్నిస్తున్న వారు అనుకూలమైన ఫలితం పొంది విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించుకో గలుగుతారు. అంతేకాకుండా మీరు నివసించే ప్రాంతానికి సమీపంలోకి ఉద్యోగంలో బదిలీ కావాలనుకునే వారికి కూడా అనుకూలమైన ఫలితం లభిస్తుంది. ఒకటవ ఇంటి పై కేతు సంచారం కారణంగా కొన్నిసార్లు మీరు నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ విధమైన ఆలోచనల కారణంగా మీరు మీ పనులను సక్రమంగా నిర్వర్తించ లేకపోతారు. అయితే ద్వితీయార్ధంలో గురువు దృష్టి ఒకటవ ఇంటి పై ఉండటంతో మీలో ఉత్సాహం తిరిగి వస్తుంది, మరియు మీలో ఉన్న నిరాశ నిస్పృహలు దూరమవుతాయి. గురు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఐదవ ఇంటిలో శని గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు మీ పనులను, మీకు అప్పగించిన బాధ్యతలను వాయిదా వేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. దాని కారణంగా మీరు మీ పై అధికారుల కోపానికి గురి అయ్యే అవకాశముంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మిమ్మల్ని ప్రభావితం చేసే కొంతమంది వ్యక్తుల కారణంగా మీరు ఉద్యోగంలో అనవసరమైన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో గుడ్డిగా ఎవరిని నమ్మక పోవడం మంచిది. అక్టోబర్ చివర నుంచి రాహు గోచారం ఆరవ ఇంటిలో అనుకూలంగా ఉండటంతో మీ వృత్తిలో అనుకోని ప్రగతిని సాధిస్తారు. ఈ సమయంలో మీరు మీ కార్యాలయంలో ఎవరు చేయలేని పనులు విజయవంతంగా పూర్తి చేయడం వలన మీ పై అధికారుల మెప్పును, ఉద్యోగంలో అభివృద్దిని పొందుతారు. గతంలో మీ పనులకు ఆటంకాలు కల్పించి, మిమ్మల్ని సమస్యల పాలు చేసిన వారు ఈ సమయంలో మీకు దూరం అవడం వలన మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. వారి శ్రమకు, అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఈ సంవత్సరం జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 మధ్యకాలం, మే 15 నుంచి జూన్ 15 మధ్యకాలం, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 18 మధ్యకాలం ఉద్యోగ విషయాల్లో ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ సమయంలో మీ వృత్తిలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఓపికగా ఉండి, మీకు కేటాయించిన పనిని పూర్తి చేసినట్లయితే భవిష్యత్తులో అది మీ వృత్తిలో అభివృద్ధికి తోడ్పడుతుంది.

2023వ సంవత్సరం వ్యాపారస్థులకు మరియు స్వయం ఉపాధి కలవారికి ఎలా ఉండబోతోంది?

తులా రాశి లో జన్మించిన వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం అంతా శని గోచారం ఐదవ ఇంటిలో మధ్యమంగా ఉండటం, మరియు ఏప్రిల్ నుంచి గురువు గోచారం, అక్టోబర్ చివర నుంచి రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపారంలో గత కొంత కాలంగా ఉన్న సమస్యలు తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. గురువు దృష్టి రెండవ ఇంటిపై, మరియు పన్నెండవ ఇంటిపై ఉండడంతో ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తగ్గి ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా వ్యాపార అభివృద్ధికి మీరు చేయాలనుకుని, చేయలేక వాయిదా పడుతున్న పనులను ఈ సమయంలో తిరిగి ప్రారంభం చేయగలుగుతారు. అక్టోబర్ చివరి వరకు ఏడవ ఇంటిలో రాహు గోచారం ఉండటం వలన, వ్యాపారంలో అభివృద్ధి కొంత నిదానంగా ఉంటుంది. కొత్త పనులు చేయటానికి గతంలో మీకు జరిగిన అనుభవాల కారణంగా కొంత సంకోచించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వాములతో కూడా ఈ సమయంలో కొన్ని మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే మీరు చేసే పనుల్లో నిజాయితీ ఉండటం వలన మీ భాగస్వాములు మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సహకరిస్తారు. మీ వ్యాపార భాగస్వాములు మీతో కలిసి ఈ సంవత్సరం మీ వ్యాపార అభివృద్ధి లో నిరంతర కృషి చేస్తారు. మీ శ్రమ తో పాటు వారి సహాయ సహకారాలు ఉండటం వలన మీ వ్యాపారం క్రమ క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ వ్యాపారంలో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో కాని గణనీయమైన అభివృద్ధి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గురువు దృష్టి ఒకటవ ఇంటిపై, మూడవ ఇంటిపై, మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ ఆలోచనలు, మీరు చేసే పనులు విజయవంతం అవడం వలన మీరు వ్యాపార అభివృద్ధిని మరియు ఆర్థికాభివృద్ధిని కలిగి ఉంటారు. గురువు దృష్టి ఒకటవ ఇంటి పై ఉండటంతో మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి సరికొత్త ఆలోచనలు చేస్తారు. ఈ ఆలోచనలు విజయవంతం అవటం వలన మీరు ఇతర ప్రాంతాల్లో కూడా మీ వ్యాపారాన్ని విస్తరించ గలుగుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారికి ఏప్రిల్ నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ చివర నుంచి రాహువు గోచరము ఆరవ ఇంటిలో ఉండటంతో మీరు మీ వ్యాపారంలో గత కొంత కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థులను జయించ గలుగుతారు. వారి కారణంగా ఏర్పడుతున్న సమస్యలు, వివాదాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సమయం ఆర్థిక లాభాలను కూడా ఇచ్చి మీరు మీ వ్యాపారంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేలా సహాయపడుతుంది.

స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత మిశ్రమ ఫలితాలను ఇచ్చినా ద్వితీయార్ధం మాత్రం బాగా అనుకూలిస్తుంది. సంవత్సర ఆరంభం నుంచి శని గోచారం అయిదవ ఇంటిలో ఉండటంతో మీరు గతంలోకంటే ఎక్కువ పనిని కలిగి ఉంటారు. శని గోచారం కారణంగా మీరు చేసే కొత్త ఆలోచనలు మిమ్మల్ని మీ పనిలో మరింత నిమగ్నులు అయ్యేలా చేస్తుంది. మీరు మిగతా వారికంటే కొత్తగా ఆలోచించి చేసే పనులు ఇతరుల దృష్టిని కూడా ఆకర్షించి మీకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తాయి. ఈ సమయంలో ఒకటవ ఇంటిలో కేతువు గోచారం కారణంగా కొన్నిసార్లు మీకు వచ్చిన మంచి అవకాశాలను కూడా మీ సంకోచ ధోరణి కారణంగా వదిలి వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఏ పనిలో అయినా ముందే వైఫల్యాన్ని ఊహించుకొని ఆ పని చేయకుండా మానేయటం, వాయిదా వేయటం చేస్తుంటారు. శని దృష్టి పదకొండవ ఇంటిపై, ఏడవ ఇంటిపై మరియు రెండవ ఇంటిపై ఉండటం వలన మీకు ఒక అవకాశం దూరమైతే, ఇంకో అవకాశం వస్తుంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందడుగు వేయడం వలన మీకు వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకో కలుగుతారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా మారటంతో మీలో ఉన్న సంకోచ ధోరణి కానీ, స్వభావం గాని తగ్గుతుంది. మీలో ఉత్సాహం పెరిగి మీకు వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకోగలరు. గురు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వలన మీకు మంచి అవకాశాలతో పాటు, ఆర్థికంగా కూడా ఈ సమయం కలిసి వస్తుంది. గత కొంత కాలంగా సరైన అవకాశాలు లేక, ఉన్న అవకాశాలు సరైన పేరు ప్రతిష్టలను ఇవ్వక మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడ్డ మీకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలసివస్తుంది. పేరు, ప్రతిష్టలతో పాటుగా ఆదాయం కూడా పెరుగుతుంది. సంవత్సరం చివరలో రాహు గోచారం అనుకూలంగా రావడంతో మీరు మరిన్ని అవకాశాలతో, విజయాలతో ముందడుగు వేస్తారు.

2023వ సంవత్సరం మీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరంలో తులా రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరమంతా శని గోచారం ఐదవ ఇంటిలో ఉండటం ఏప్రిల్ నుంచి గురువు గోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండడంతో గత కొద్ది కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఏప్రిల్ వరకు గురు దృష్టి 12వ ఇంటి పై మరియు ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా శని గోచారం సాధారణంగా ఉండటం వలన ఖర్చులు కొంత మేరకు తగ్గటం మరియు ఆదాయ మార్గాలు పెరగటం వలన ఆర్థికంగా కొంత అభివృద్ధిని సాధిస్తారు. గతంలో మీరు కొన్న స్థిరాస్థులు కానీ, పెట్టిన పెట్టుబడులు గాని ఈ సమయంలో ఆదాయాన్ని ఇవ్వటంతో మీరు గతంలో చేసిన అప్పులు, తీసుకున్న లోన్లు తిరిగి తీర్చగలుగుతారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం ఏడవ ఇంటికి మారటం వలన ఈ సమయం పెట్టుబడులు పెట్టడానికి, స్థిరచరాస్తులు కొనుగోలు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. గురు దృష్టి పదకొండవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన మీరు కొంత సాహసం చేసి పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో ఆకస్మిక లాభాలను ఇస్తాయి. అయితే ఐదవ ఇంటిలో శని గోచారం షేర్ మార్కెట్ తదితర పెట్టుబడుల్లో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు తొందరగా లాభాలని ఇవ్వవు కాబట్టి మీరు ఎక్కువ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టడం మంచిది. ఏప్రిల్ నుంచి గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీరు చేసే ఆలోచనలు సరైన ఫలితాన్ని ఇవ్వటం వలన మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఈ సమయంలో బ్యాంకుల నుంచి కానీ ఇతర ఆర్థిక సంస్థల నుంచి కానీ డబ్బును లోన్ లా కానీ, ఆర్థిక సాయంగా కానీ పొందాలనుకునే వారికి ఏప్రిల్ నుంచి అనుకూలంగా ఉంటుంది. మీకు అవసరమైనంత ఆర్థిక సాయం అందుతుంది. ఈ సంవత్సరం చివరలో రాహువు గోచరము కూడా అనుకూలంగా రావటం వలన ఆర్థికంగా మీ పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. ముఖ్యంగా రాహువు గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన గతంలో చేసిన అప్పులు కానీ, తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు మరియు కోర్టు కేసులు లేదా ఇతర వివాదాల కారణంగా ఆగిపోయిన డబ్బు కానీ, ఆస్తులు కానీ ఈ సమయంలో తిరిగి మీ చేతికి అందుతాయి. ఈ సంవత్సరం జనవరి 14 నుంచి మార్చి 15 మధ్యకాలం. మే 15 నుంచి జూన్ 15 మధ్యకాలం మరియు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 18 మధ్యకాలం ఆర్థిక విషయాలకు, పెట్టుబడులకు ఇతర లావాదేవీలకు అనుకూలంగా ఉండదు. తప్పనిసరి అయితే మాత్రమే ఈ సమయంలో డబ్బు సంబంధించిన వ్యవహారాలు చేయటం మంచిది. లేదంటే సూర్యుని గోచారం అనుకూలంగా ఉండే వేరే నెలల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయడం మంచిది.

2023వ సంవత్సరం మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం తులా రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్ధంలో ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో ఆరోగ్యం బాగుంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం ఆరవ ఇంటిలో సాధారణంగా ఉండటం వలన, అలాగే రాహు, కేతువుల గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఉదరానికి, తలకు, మరియు జననాంగాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కేతువు గోచారము ఒకటవ స్థానంలో ఉండటం వలన మానసికంగా కూడా మీరు ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఏదో ఒక వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు ఊహించుకొని ఆందోళన చెందుతారు. అంతేకాకుండా మిమ్మల్ని అందరూ వదిలేశారని, ఎవరూ పట్టించుకోవట లేదు అనే ఆత్మ న్యూనతకు లోనవుతారు. శని దృష్టి ఏడవ ఇంటిలో ఉన్న రాహువు పై ఉండటం వలన ఈ సమయంలో సరైన నిద్ర లేకపోవటం, సరైన భోజనం తీసుకోకపోవడం వలన జీర్ణాశయానికి సంబంధించిన మరియు మూత్రపిండాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు మళ్లీ ఇబ్బంది పెట్టవచ్చు. అయితే ఈ సమస్యల తీవ్రతకంటే ఎక్కువ మానసికంగా మీరు సమస్యను ఊహించుకొని భయపడటం వలన ఎక్కువ ఇబ్బంది లోనవుతారు. ఏప్రిల్లో గురువు గోచారం ఏడవ ఇంటికి రావడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మీరు స్వస్థతను పొందుతారు. ఈ సమయంలో గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మానసికంగా గతంలో మీకున్న సమస్యలు తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు సరైన చికిత్స లభించటం వలన తగ్గుముఖం పడతాయి. అక్టోబర్ చివర నుంచి రాహు గోచారం కూడా అనుకూలంగా మారటంతో మీరు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడే అవసరం ఉండదు. అయితే ఈ సంవత్సరం మీరు ఆలోచనలకంటే ఎక్కువ పని మీద దృష్టి పెట్టినట్లయితే చాలావరకు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే ఈ సంవత్సరం శారీరక ఆరోగ్య సమస్యలకంటే మానసిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడతాయి కాబట్టి మీరు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నులై ఉండటం అలాగే యోగ, ప్రాణాయామం లాంటి మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే పద్ధతులను ఆచరించటం వలన ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. ఈ సంవత్సరం ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 3 మధ్య కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఈ సమయంలో ఆవేశానికి కానీ, ఎదుటి వారికంటే వేగంగా పోవాలనే ఆలోచనకు కాని గురి కాకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. దాని కారణంగా అనవసరమైన సమస్యలతో ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.

2023వ సంవత్సరం మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది?

తులా రాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరమంతా శని గోచారం ఐదవ ఇంటిలో మధ్యమంగా ఉండటం, గురువు గోచారం ఏప్రిల్ వరకు మధ్యమంగా ఉండటం ఆ తర్వాత అనుకూలంగా ఉండటం వలన ప్రథమార్ధంలో సామాన్యంగా, ద్వితీయార్ధంలో అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు దృష్టి పదవ ఇంటిపై, 12వ ఇంటిపై, మరియు రెండవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో కుటుంబ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లల కారణంగా కానీ, మీ బంధువుల కారణంగా కానీ మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వారితో అవగాహన లోపించడం వలన కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. అంతే కాకుండా, మీరు చెప్పే మాటలను కానీ, ఇచ్చే సలహాలను కానీ, కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవటం వలన మీరు మానసికంగా అశాంతికి లోనవుతారు. కుటుంబంలో ఎవరూ మీకు విలువ ఇవ్వటం లేదని బాధ పడే అవకాశముంటుంది. ఈ సమయంలో ఏడవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వారు మీపై పెత్తనం చెలాయిస్తున్నారని, మిమ్మల్ని లెక్క చేయడం లేదనే అపోహ కారణంగా మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు, గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకు మీరు ఎటువంటి అపోహలకు మీ మనసులో తావివ్వకుండా ఉండటం మంచిది. ఈ సమయంలో మీకు కలిగే ఆలోచనలు, భయాలు కేవలం మిమ్మల్ని తప్పు దోవ పట్టించేవే తప్ప అవి మీకు ఏ రకంగా ఉపయోగపడేవి కాదు. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే సమస్యలు ఏవైనా అవి తాత్కాలికమే తప్ప ఎక్కువ కాలం వాటి ప్రభావం ఉండదని గుర్తించండి. ఏప్రిల్ నుంచి గురువు గోచారం ఏడవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఉండే సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు మానసికంగా పడుతున్న ఆందోళనలు, అపోహలు నిజాలు కావని గుర్తిస్తారు. దాని కారణంగా మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీ బంధువులతో, మీ పిల్లలతో కూడా మీరు ప్రేమతో మెలుగుతారు. మరియు వారి నుంచి కూడా ప్రేమను పొందుతారు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి వినోద యాత్రలు, విహార యాత్రలు చేసే అవకాశం ఉంటుంది. దానివలన మానసికంగా కూడా మీరు ఉత్సాహాన్ని పొందుతారు. అక్టోబర్ చివర నుంచి రాహు గోచారం ఆరవ ఇంటికి మారడంతో మీ కుటుంబంలో ఉండే చిన్న, చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ సంవత్సరం మీ ఇంటిలో వివాహాది శుభకార్యాలు జరగడం వలన బంధుమిత్రుల కలయిక జరిగి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు అవివాహితులై వివాహం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మీకు వివాహం అవుతుంది. ఒకవేళ వివాహితులయ్యుండి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు సంతానం అయ్యే అవకాశం ఉంటుంది.

2023వ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రథమార్థం సామాన్యంగా, ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరమంతా శని గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన విద్యార్థులకు కొంత అలసత్వము, మరియు చదువు మీద ఆసక్తి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ వరకు గురువు గోచారము కూడా అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయంలో విద్యార్థులకు వాయిదా వేసే స్వభావం ఎక్కువగా అలవాటవుతుంది. ముఖ్యంగా పరీక్షల విషయంలో వీరు ఒకలాంటి నిర్లక్ష్య ధోరణిని కలిగి ఉంటారు. దానివలన ఈ సంవత్సర ప్రథమార్థంలో పరీక్షలలో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతారు. శని దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వలన వీరికి ఉన్న సామర్థ్యంకంటే ఎక్కువగా ఉన్నట్లు అందరికీ చెప్తారు కానీ పరీక్షలలో ఆ విధమైన ఫలితం రాకపోవడం వలన వారికి ఉన్న పేరు చెడగొట్టు కుంటారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా రావటం వలన వీరి ఈ వ్యవహారంలో మార్పు కనబడుతుంది. గతంలో ఉన్న అహంభావం కానీ, లేనిది ఉన్నట్లుగా చెప్పుకునే స్వభావం కానీ తగ్గుతుంది. అంతేకాకుండా చదువుపై ఆసక్తి పెరుగుతుంది. గతంలో చేసిన తప్పులను సరి దిద్దుకుని చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతారు. గురు దృష్టి పదకొండవ ఇంటిపై, మూడవ ఇంటిపై మరియు ఒకటవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో వీరు ఏకాగ్రతగా చదవటం వలన పోటీ వాతావరణాన్ని తట్టుకొని రాణించగలుగుతారు. పరీక్షలలో వారు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన శని చెడు ప్రభావం తగ్గటం వలన ద్వితీయార్ధంలో విద్యార్థులు అనుకున్న ఫలితాన్ని పొందడమే కాకుండా కోరుకున్న విద్యాలయాల్లో ప్రవేశాన్ని కూడా పొందుతారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునేవారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగార్థులకు కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థం కలిసి వస్తుంది. మీ శ్రమకు తగిన విధంగా ప్రభుత్వ ఉద్యోగం గాని, లేదా మీరు కోరుకున్న ఉద్యోగం కాని లభిస్తుంది.

2023వ సంవత్సరం ఏ గ్రహాలకు, ఏయే పరిహారాలు చేయాలి?

ఈ సంవత్సరం తులా రాశి వారికి ప్రథమార్ధంలో గురువు, సంవత్సరం అంతా శని, రాహువు మరియు కేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఆరవ ఇంటిలో గురువు గోచారం కారణంగా ఏప్రిల్ వరకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావడం గానీ, ఉద్యోగ విషయంలో ఇబ్బందులు రావటం కానీ జరగవచ్చు. కాబట్టి గురువుకు పరిహారాలు ఆచరించడం వలన గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. దీనికి గాను ప్రతిరోజు కానీ, ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం, గురు మంత్ర జపం చేయటం లేదా గురు చరిత్ర పారాయణం చేయడం మంచిది. ఈ సంవత్సరమంతా శని గోచారం ఐదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి శనికి పరిహారాలు చేయటం వలన ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మరియు విద్యా సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శని మంత్ర జపం చేయటం లేదా శని స్తోత్ర పారాయణం చేయటం మంచిది. అలాగే శని ఇచ్చే చెడు ప్రభావాన్ని తగ్గించే ఆంజనేయ స్వామి సంబంధించిన స్తోత్రాలు చదవడం కానీ, హనుమాన్ చాలీసా చదవడం కానీ చేస్తే శని ఇచ్చే చెడు ప్రభావాన్ని తగ్గించి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు కేతువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు, లేదా ప్రతి మంగళవారం రోజు కేతు స్తోత్ర పారాయణం చేయటం, లేదా కేతు మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా కేతు ప్రభావాన్ని తగ్గించే గణపతి ఆరాధన చేయటం మంచిది. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు రాహువు గోచారం ఏడవ ఇంట్లో ఉండటం వలన భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటం, వ్యాపారంలో నష్టాలు రావటం జరగవచ్చు కాబట్టి ఈ చెడు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ రాహు స్తోత్రం పారాయణం చేయడం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. దీని వలన రాహువు ఇచ్చే చెడు ఫలితం తగ్గుతుంది.

రాజాది నవనాయక ఫలితములు

12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు

శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2023 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2023 rashi phal
Gemini
Mithuna rashi, year 2023 rashi phal
Cancer
Karka rashi, year 2023 rashi phal
Leo
Simha rashi, year 2023 rashi phal
Virgo
Kanya rashi, year 2023 rashi phal
Libra
Tula rashi, year 2023 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2023 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2023 rashi phal
Capricorn
Makara rashi, year 2023 rashi phal
Aquarius
Kumbha rashi, year 2023 rashi phal
Pisces
Meena rashi, year 2023 rashi phal

Mangal Dosha Check

Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.

Read More
  

Telugu Jatakam

Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.

Read More
  


Your skills and experience make you a valuable asset in your field, paving the way for a successful career.