మేష రాశి - 2023 సంవత్సర రాశి ఫలములు

మేష రాశి ఫలితములు 2023

2023 సంవత్సర రాశిఫలములు

Telugu Rashi Phalalu (Rasi phalamulu)

2023 Rashi phalaalu

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2023 samvatsara Mesha rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Mesha Rashi in Telugu


Mesha Rashiphal (Rashifal) for Vijaya telugu year

అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)
భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)

ఈ సంవత్సరం మేష రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి పన్నెండవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఒకటవ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశికి పదవ స్థానమైన మకర రాశి నుంచి, పదకొండవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 న రాహు ఒకటవ స్థానమైన మేష రాశి నుంచి, మీ రాశికి పన్నెండవ స్థానమైన మీన రాశి లోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు మీ రాశికి ఏడవ స్థానమైన తులా రాశి నుంచి మీ రాశికి ఆరవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు . ఈ సంవత్సర ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే, మీకు ఉద్యోగ పరంగా మరియు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, మరియు ఆరోగ్యపరంగా మరియు కుటుంబ విషయంగా సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు.

2023వ సంవత్సరం ఉద్యోగస్థులకు ఎలా ఉండబోతోంది?

ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగంలో మీరు ఉన్నతిని పొందుతారు. అయితే ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు మీ వృత్తి విషయంలో అనవసరమైన ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సంవత్సర ఆరంభంలోనే పదోన్నతి పొందినప్పటికీ ఈ కార్యాలయంలో మీరంటే నచ్చని కొందరు వ్యక్తుల కారణంగా కానీ, రహస్య శత్రువుల కారణంగా కానీ మీరు పొందిన పదవిని చేపట్టడానికి కొంత సమయం పట్టవచ్చు. అలాగే ఏప్రిల్ వరకు మీరు చేపట్టిన పనిలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆవేశానికి గురి కాకుండా కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ పై అధికారులు మీకు మీ స్థాయికి మించిన పనులు ఇవ్వటం వలన మీరు కొంత శారీరక శ్రమకు మరియు మానసిక ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఆసక్తిగా చేద్దామనుకున్న పనులలో కూడా అవాంతరాలు ఎదురవడం వలన వాటిని మధ్యలో వదిలి వేసే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం మరియు రాహు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. గతంలో మీకు ఉన్న చికాకులు తొలగిపోవడమే కాకుండా, మీకు రావాల్సిన పదోన్నతి రావటం కానీ, లేదా అనుకున్న ప్రదేశానికి మారటం కానీ జరుగుతుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేద్దామనుకునే వారికి ఈ సమయం అనుకూలిస్తుంది. విదేశీయానానికి సంబంధించిన పనులు ఏప్రిల్ తర్వాత మీకు అనుకూలంగా పూర్తి కావడమే కాకుండా మీరు విదేశాల్లో స్థిరమైన ఉద్యోగాన్ని పొందటానికి సరైన అవకాశాలు కూడా లభిస్తాయి. ఈ సంవత్సరం అంతా శని పదకొండవ ఇంటిలో ఉండటం వలన మీరు వృత్తిలో, అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధించడమే కాకుండా మీ వృత్తిలో గుర్తింపు కూడా పొందుతారు. మీ పై అధికారుల మెప్పును పొంది మీ కార్యాలయంలో పేరు ప్రతిష్టలు గడిస్తారు. సంవత్సరాంతంలో రాహు గోచారం పన్నెండవ ఇంటికి మారటం వలన ఉద్యోగంలో మరియు మీరు చేసే పనుల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదో తెలియని ఆవేదన కాని, అసంతృప్తి కానీ ఈ సమయంలో మిమ్మల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది. మీరు ఉత్సాహంగా ప్రారంభించిన పనులు కొంత సమయం తర్వాత ఆపివేయడం జరుగుతుంది. ఈ సమయంలో వీలైనంత వరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త పనులు మొదలు పెట్టడం కానీ మీకు అంతగా అనుకూలించదు. అయితే తప్పనిసరిగా మీరు ఏదైనా పని చేయాల్సి వస్తే ఆ సమయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం మంచిది. ఆ సలహా కారణంగా మీరు చేపట్టిన పనులు విఫలం కాకుండా పూర్తి చేయగలుగుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో గురువు మరియు రాహులు ఒకటవ ఇంటిలో కలిసి ఉండటం వలన మీరు తీసుకునే నిర్ణయాలు తొందర పాటుగా తీసుకోకుండా స్థిరంగా ఆలోచించి గాని, అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని గాని చేయటం మంచిది. మీరు అత్యుత్సాహంతో సరైన ఆలోచన లేకుండా ప్రారంభించే పనులు అకారణంగా మధ్యలో ఆపివేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో మీ మనసును అదుపులో ఉంచుకొని పనులు చేస్తే, చేసే ప్రతి పనిలో విజయం సాధించగలుగుతారు. ఉద్యోగస్థులు ఈ సంవత్సరం మార్చి 15 మరియు ఏప్రిల్ 14 మధ్యకాలం, ఆగస్టు 17 మరియు సెప్టెంబర్ 17 మధ్యకాలం అలాగే నవంబర్ 17 నుంచి సంవత్సరాంతం వరకు ఉద్యోగ విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వదిలి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామనుకునేవారు ఈ సమయంలో ఉద్యోగం మానకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.

2023వ సంవత్సరం వ్యాపారస్థులకు మరియు స్వయం ఉపాధి కలవారికి ఎలా ఉండబోతోంది?

వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన, అలాగే శని దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటంవలన మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల కారణంగా మీ వ్యాపారం మందకొడిగా సాగుతుంది. వ్యాపార పరంగా మీరు ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడులు కానీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు. అలాగే ఈ సమయంలో రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు కొన్నిసార్లు వ్యాపార పరంగా ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. మీ తొందరపాటు కారణంగా మీకు లాభాలు రాని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం కానీ లేదా మోసం చేసే వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు చేయడం కానీ చేస్తారు. ఏప్రిల్ 22 తర్వాత గురువు గోచారం ఒకటవ ఇంటికి రావటం వలన మీలో ఆవేశం తగ్గుతుంది. అయితే ఈ సమయంలో శని స్థితి పదకొండవ ఇంటిలో ఉండటం వలన మరియు ఏడవ ఇంటిపై గురు దృష్టి ఉండటం వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు.
స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో కొంత సామాన్యమైన ఫలితాన్ని పొందినప్పటికీ ద్వితీయార్ధంలో మాత్రం వారు డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలను పొందుతారు. ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు విజయవంతం అవడం వలన సంఘంలో మీ పేరు మార్మోగుతుంది. మీరు కొత్తగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కానీ, చేసే పనులు కానీ ఈ సమయంలో సరైన ఫలితం ఇవ్వటం వలన ఆర్థికంగా కూడా మీకు కలిసి వస్తుంది. అయితే ఒకటవ ఇంటిలో రాహు గోచారం కారణంగా అప్పుడప్పుడు మీరు కొన్ని తప్పటడుగులు వేసే అవకాశం ఉంటుంది. గొప్పలకు పోయి మీకు సాధ్యం కాని పనులను లేదా అది కష్టంతో పూర్తయ్యే పనులను మీరు చేపట్టే అవకాశముంటుంది. అలాంటి పనుల కారణంగా మీరు సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు కొంత ఆవేశం తగ్గించుకోవటం మంచిది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు అనుకునేవారు కానీ పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కానీ ఈ సంవత్సరం ఆచితూచి అడుగు వేయడం మంచిది. ముఖ్యంగా జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. మిమ్మల్ని తప్పు దోవ పట్టించి మీ చేత డబ్బు పెట్టుబడి పెట్టించడానికి కొంతమంది ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వారి విషయంలో జాగ్రత్త వహించండి. ఒకటవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీరు ఇతరుల ప్రలోభాలకు లొంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని నమ్మకుండా మీ శ్రేయోభిలాషులు సలహాలు కానీ అనుభవజ్ఞుల సలహాలు కానీ తీసుకొని పెట్టుబడి పెట్టడం లేదా వ్యాపారం ప్రారంభించడం చేయండి. ఏప్రిల్ నుంచి గురు గోచారం మధ్యమంగా ఉంటుంది కాబట్టి కొత్తగా వ్యాపారం చేసుకునే వారు ఈ సమయంలో వ్యాపారం ప్రారంభించవచ్చు.

2023వ సంవత్సరం మీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది?

2023 సంవత్సరంలో మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఒకసారి పరిశీలిస్తే ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సర ఆరంభం లో కుటుంబం కొరకు మరియు ఆరోగ్య కారణాల రీత్యా మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. పన్నెండవ ఇంటిలో గురువు గోచారం ఏప్రిల్ వరకు ఉండటం వలన ఖర్చులు ఒక్కోసారి అదుపు తప్పే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో పొగడ్తలకు లొంగిపోయి కానీ, అనవసర విలాసాలకు కానీ డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడటం మంచిది. అంతేకాకుండా ఈ సమయంలో ఒకటవ ఇంటిలో రాహు గోచారం ఉండటం, మరియు రాహు పైన శని దృష్టి ఉండటం వలన మీరు తొందరపడి డబ్బు పెట్టుబడి పెట్టడం కానీ, ఇతరుల మాటలకు లొంగి వారికి డబ్బు ఇవ్వడం కానీ చేసే అవకాశముంటుంది కాబట్టి, ఈ సమయంలో అలాంటి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్త పడటం మంచిది. అయితే ఈ సమయంలో శని గోచారం పదకొండవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు తొందరపడి డబ్బు ఖర్చు చేయటమో, నష్టపోవటమో జరిగినప్పటికీ, సంవత్సరమంతా పదకొండవ ఇంటిలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చేసిన తప్పును సరి దిద్దుకొని, తిరిగి డబ్బు సంపాదించుకునే అవకాశాలు పొందుతారు. పదకొండవ ఇంటి అధిపతి అయిన శని పదకొండవ ఇంటిలో సంచరించడం వలన మీకు ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా విషయాల్లో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధన లాభం కానీ, గతంలో వివాదాల కారణంగా లేదా కోర్టు కేసుల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన ఆస్తులు కానీ, డబ్బు కానీ ఈ సమయంలో మీకు తిరిగి వచ్చే అవకాశముంటుంది. అంతేకాకుండా గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుంచి కూడా మీకు ధన లాభం ఉంటుంది. అలాగే ఏప్రిల్ నుంచి గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం, గురు దృష్టి ఏడవ ఇంటిపై, 9వ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై ఉండటం వలన వ్యాపారం వలన మరియు షేర్ మార్కెట్ తదితర పెట్టుబడుల కారణంగా లాభాలు వచ్చి మీ ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ఈ సంవత్సరాంతంలో రాహు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో మీరు ఆరోగ్యం కొరకు కానీ, శుభకార్యాల కొరకు గాని, లేదా ఇతరులు మోసపూరితంగా మీ వద్ద నుంచి డబ్బు తీసుకోవడం వల్ల కానీ ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం ఏప్రిల్ మరియు నవంబర్ మధ్య కాలంలో మీ మిత్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ లేదా తోబుట్టువుల నుంచి కానీ మీకు విలువైన బహుమతులు అందడం కానీ లేదా అవసరానికి వారు ఆర్థికంగా సహాయం చేయడం కానీ జరగవచ్చు. ఈ సంవత్సరం ఖర్చుల విషయంలో మీ మనసును ఆధీనంలో ఉంచుకోవటం అత్యంత అవసరం. ఈ సంవత్సరం ఆర్థికంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు సూర్యుని గోచారం మీకు అనుకూలంగా ఉండే ఫిబ్రవరి 13 మరియు మార్చి 15 మధ్యలో, జూన్ 15 నుంచి జూలై 17 మధ్యలో, అలాగే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 18 మధ్యలో పెట్టుబడులు పెట్టడం మంచిది. సూర్యుడు అనుకూలంగా లేని మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్యకాలం, జులై 17 నుంచి ఆగస్టు 17 మధ్య కాలం, అలాగే నవంబర్ 17 నుంచి డిసెంబర్ 16 మధ్యకాలం లో పెట్టుబడి పెట్టడం వలన డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది.

2023వ సంవత్సరం మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది?

ఆరోగ్య విషయంలో మేష రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాలేయము, ఊపిరితిత్తులు మరియు జననాంగ సంబంధ ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం జనవరి మరియు ఏప్రిల్ మధ్య కాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శని దృష్టి ఈ సంవత్సరాంతం వరకు రాహు పై ఉండటం వలన ఎముకలు మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరమంతా శని గోచారం పదకొండవ ఇంటిలో ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటి నుంచి తొందరగానే బయట పడగలుగుతారు. అయితే నవంబర్ వరకు రాహు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన శారీరక సమస్యలతో పాటుగా మానసిక సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమయంలో మీరు కావాలనుకున్నది మీకు సమయానికి అందకపోవడం వలన అలాగే చేయాలనుకున్న పనులకు అడ్డంకులు రావటం వలన మీరు చికాకులకు లోనవుతారు. దాని కారణంగా మీరు మానసిక ఆందోళన పొందుతారు. నవంబర్లో రాహు గోచారం పన్నెండవ ఇంటికి మారటం వలన మెడలకు మరియు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అలాగే పైల్స్ లాంటి జననాంగ సంబంధ ఆరోగ్య సమస్యలు ఈ కాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే ఒకటవ ఇంటిలో గురువు గోచారం కారణంగా మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ సంవత్సరం మీ జీవన విధానాన్ని, అలవాట్లను మార్చుకోవడం మంచిది. అలసత్వాన్ని కానీ వాయిదా వేసే స్వభావాన్ని కానీ మీరు తగ్గించుకోవాలి, మరియు శారీరక శ్రమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీరు చేసే శారీరక శ్రమ మిమ్మల్ని ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. మీరు మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి ధ్యానం కానీ, యోగా గాని, ప్రాణాయామం కానీ చేయడం మంచిది. శని దృష్టి సంవత్సరమంతా ఎనిమిదవ ఇంటిపై ఉండటం వలన గతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి. సంవత్సర ఆరంభంలో ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ సంవత్సరం చివరికల్లా ఈ ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయట పడగలుగుతారు. సరైన ఆహారంతో పాటుగా మరియు నిద్రకు కూడా తగినంత ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మిమ్మల్ని మీరు ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకోగలుగుతారు. ఈ సంవత్సరం మే మరియు జులై మధ్యకాలం అలాగే నవంబర్ మూడవ వారం నుంచి డిసెంబర్ చివరి వరకు ఉండే సమయం ఆరోగ్య విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే మరియు జూలై మధ్య కాలంలో వాహనాలు నడపడంలో మీరు జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే నవంబర్ మరియు డిసెంబర్ మధ్య కాలంలో కూడా మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

2023వ సంవత్సరం మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది?

2023 సంవత్సరంలో మీ కుటుంబ జీవితం మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన మీ కుటుంబ జీవితం సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో రాహు మరియు కేతువుల గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన మీ కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదాల కారణంగా కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం వలన చిన్న, చిన్న విషయాలకే మనస్పర్థలు ఏర్పడతాయి. ఒకటవ ఇంటిలో రాహు గోచారం మీలో అహంకారాన్ని పెంచుతుంది. దాని కారణంగా ఇంట్లో ఎవరి మాట వినకుండా మీకు తోచిన విధంగా చేయటం వలన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనల తో పాటు వారి అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వటం మంచిది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని తక్కువ చేసి చూడటం వలన, వారిని తప్పుగా అర్థం చేసుకోవడం వలన మీ ఇంట్లో ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్లో గురువు గోచారం ఒకటవ ఇంటిలో సంచరించడం వలన ఈ పరిస్థితుల్లో మార్పు కలుగుతుంది. ముఖ్యంగా గురు దృష్టి ఏడవ ఇంటిపై, అయిదవ ఇంటిపై మరియు 9వ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామితో అలాగే ఇతర కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్థలు, అభిప్రాయభేదాలు తొలగిపోతాయి. సంతానం కొరకు గాని, వివాహం కొరకు గాని ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఈ సమయంలో మీ పిల్లల ఆరోగ్యం మరియు మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీలో ఆధ్యాత్మికత పెరగటం వలన గతంలో కోల్పోయిన మనశ్శాంతిని తిరిగి పొందగలుగుతారు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలను కానీ, ఆధ్యాత్మిక రంగంలో ప్రముఖులను కాని సందర్శిస్తారు. ఒకటవ ఇంటిలో గురువు మరియు రాహు కలిసి ఉండటం వలన మీరు కొన్నిసార్లు వితండవాదం చేసే వారుగా, మరి కొన్నిసార్లు విలువైన సలహాలు ఇచ్చే వారుగా ఉంటారు. ఈ సమయంలో మీ కుటుంబం కొరకు మీరు చేసే పనులు విజయవంతం అవడం వలన కుటుంబంలో మరియు బంధువర్గంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మిత్రుల మరియు తోబుట్టువుల సహాయంతో చిరకాలంగా మీరు చేయాలనుకుని చేయలేక పోతున్న పనులను పూర్తి చేయగలుగుతారు.

2023వ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?

విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సర ఆరంభంలో చదువుపై శ్రద్ధ తగ్గినప్పటికీ ఫలితాలు అనుకూలంగా రావటం వలన ఉన్నత విద్యావకాశాలు మెరుగుపడతాయి. అయితే తక్కువ శ్రమ చేసినప్పటికీ ఫలితం ఎక్కువగా రావడం వలన విద్యార్థులలో అహంకారం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దాని కారణంగా వారు ఉన్నత విద్య విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో వీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. దానివలన వీరి విలువైన సమయం వృధా కాకుండా ఉంటుంది. ఏప్రిల్లో గురువు గోచారం ఒకటవ ఇంటికి మారటం వలన వీరు చదువుపై శ్రద్ధ పెట్టడమే కాకుండా పరీక్షలలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. గురు దృష్టి ఐదవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునేవారికి మంచి అవకాశాలు వస్తాయి. దానివలన వారు అనుకున్న విద్యా సంస్థలలో ప్రవేశం పొందగలుగుతారు. ఈ సంవత్సరాంతం వరకు ఒకటవ ఇంటిలో రాహు సంచరించడం అలాగే రాహు పై శని దృష్టి ఉండటం కారణంగా వీరు కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువులను లేదా వారికంటే పెద్దవారిని విమర్శించడం వలన ఇతరుల దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఆవేశాన్ని, అపోహలను ఈ సంవత్సరం పక్కన పెట్టడం మంచిది. తార్కికమైన ఆలోచనలను మరియు తమ జ్ఞానాన్ని మెరుగు పరచుకునే అవకాశాలు మేష రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం వస్తాయి. వాటిని సరిగా ఉపయోగించుకున్నట్లయితే జీవితంలో మరింత అభివృద్ధి సాధించగలుగుతారు.

2023వ సంవత్సరం ఏ గ్రహాలకు, ఏయే పరిహారాలు చేయాలి?

ఈ సంవత్సరం మీరు చేయవలసిన పరిహారములు. ఈ సంవత్సరమంతా రాహు గోచారం ఒకటవ ఇంటిలో మరియు పన్నెండవ ఇంటిలో ఉండటం వలన రాహుకు పరిహారాలు చేయాలి. రాహు అజ్ఞానాన్ని, అపోహలను మరియు అహంకారాన్ని పెంచే గ్రహం. ఈ సంవత్సరం రాహు గోచారం మీకు అనుకూలంగా లేకపోవడం వలన మీలో అహంకారం కానీ అపోహలు కానీ ఎక్కువ అవుతాయి. దాని కారణంగా మీరు ఆత్మీయులకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సంవత్సరం ప్రతిరోజు కానీ లేదా ప్రతి శనివారం కానీ రాహుకు సంబంధించిన స్తోత్రం చదవడం మంచిది. లేదా రాహు ఇచ్చే తమోగుణాన్ని తగ్గించే దుర్గా స్తోత్రం గాని, దుర్గా అష్టోత్తర నామాలు కానీ లేదా దుర్గాదేవికి కుంకుమార్చన మీరు చేయడం వలన రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. ఈ సంవత్సరం నవంబర్ వరకు కేతువు గోచారం ఏడవ ఇంటిలో ఉంటుంది. కేతువు గోచారము కారణంగా కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కలతలు, అపోహలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు స్తోత్రం చదవడం లేదా కేతు మంత్ర జపం చేయటం మంచిది. అలాగే కేతువిచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి గణపతి స్తోత్రం చదవడం లేదా గణపతికి పూజ చేయడం మంచిది. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు గురువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది. ఈ సమయంలో గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి మీరు ప్రతిరోజు కానీ లేదా ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం మంచిది.

రాజాది నవనాయక ఫలితములు

12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు

శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2023 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2023 rashi phal
Gemini
Mithuna rashi, year 2023 rashi phal
Cancer
Karka rashi, year 2023 rashi phal
Leo
Simha rashi, year 2023 rashi phal
Virgo
Kanya rashi, year 2023 rashi phal
Libra
Tula rashi, year 2023 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2023 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2023 rashi phal
Capricorn
Makara rashi, year 2023 rashi phal
Aquarius
Kumbha rashi, year 2023 rashi phal
Pisces
Meena rashi, year 2023 rashi phal

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Hindi.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Telugu.

Read More
  

Marriage Matching

Free online Marriage Matching service in English Language.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.

Read More
  


Your family is your support system, cherish them and they will always be there for you.