రాంభట్ల వేంకటరాయశర్మ,
ఎం.ఏ. తెలుగు., ఎం.ఏ. జ్యోతిషం., ఎం.ఎస్.సి. మైక్రోబయాలజీ,.
పరిశోధకవిద్యార్థి, (Ph.D.) ఆంధ్రవిశ్వకళాపరిషత్, విశాఖపట్నం. సెల్ - 99852 43171.
శ్లో|| ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ: ||
రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు,గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఈ తొమ్మిదింటిని నవగ్రహాలంటారు.
శ్లో|| 'మేషో వృషశ్చ మిధున: కర్క, సింహ కుమారికా: |
తులా విచాప మకరా: కుంభమీనౌ యథా క్రమమ్ ||
(బృహత్పరాశర హోరాశాస్త్రం)
మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఇవి 12 రాశులు. 27 నక్షత్రాలు, 108 పాదాలు కలిసి ఒక్కొక్క రాశికి 9 పాదాల చొప్పున 12 రాశులేర్పడుతున్నాయి. సృష్ట్యాది నుండి ఈ నక్షత్రాలు, రాశులు మానవజీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ 27 నక్షత్రాలను నాలుగు పాదాలు చేస్తే 108 పాదాలువుతున్నాయి. 108 పాదాలను 12 రాశులకు పంచితే ఒక్కొక్క రాశికి 9 పాదాలొస్తున్నాయి. ఇదేదో గణితంకోసం విభజించారనుకుంటే పొరపాటే. అలాగే ఎన్నో వేల నక్షత్రాలు మనకు రోజూ కనిపిస్తున్నా కేవలం ఈ 27 నక్షత్రాల్నే గుర్తించడం, వాటికి మాత్రమే ఇంత ప్రాముఖ్యమివ్వడానికి గల కారణాన్ని అన్వేషిస్తే ఈ 27 నక్షత్రాలు, అవి ఏర్పస్తున్న ఈ 12 రాశులుకూడా భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యామార్గంలో ఉన్నాయని తెలుసుకోవాలి. సూర్యుని చుట్టూ భూమితిరిగే కక్ష్య అండాకారంలో (దీర్ఘవృత్తాకారం) ఉందని మనందరికీ తెలుసు. ఈ కక్ష్యామార్గంలోఉన్న నక్షత్రాలు మరియు రాశులే మనం పైన పేర్కొన్నవి.
ఈ రాశులు, నక్షత్రాలు గ్రహగతులు తెలుసుకొని వాటి ప్రభావం భూమ్మీద నివసించే ప్రాణుల్లో ముఖ్యంగా మానవుల మీద వాటి ప్రభావమెలా ఉందో తెలియజేసే శాస్త్రమే జ్యోతిషశాస్త్రం. విజ్ఞానశాస్త్రం బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో గ్రహాలప్రభావముందని కనుక్కోవడం జరిగింది. కానీ వేదాంగాల్లో ఒకటయిన జ్యోతిశ్శాస్త్రం వేలసంవత్సరాల ముందే బాగా అభివృద్ధిచెంది ఈ విషయాలన్నిటినీ వివరించింది. ఇక హిందువులందరికీ ఆరాధ్యదైవమయిన శివుని కుటుంబానికి రాశిచక్రంతోగల సన్నిహితసంబంధాన్ని పరిశీలిద్దాం.
మేషం : రాశుల్లో ఇది మొదటిది. మేక అని దీనికి సామాన్యార్థం. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిసి ఈ రాశి ఏర్పడుతోంది. ఈ రాశ్యధిపతి కుజుడు. వేదవాఙ్మయాన్ని అనుసరిస్తే కృత్తికనుండి నక్షత్రాలను లెక్కవెయ్యడం జరుగుతుంది. అంటే నక్షత్రగణనం కృత్తికతోప్రారంభమై భరణితో ముగుస్తుంది. కృత్తిక అగ్ని నక్షత్రం. దీనికి 'అగ్ని' అధిదేవత. ఇక్కడ గమనించవలసింది అగ్నిదేవుని వాహనం మేషం. కేవలం వాహనమేకాదు ఆతని ధ్వజంకూడా మేషమే. తూర్పున మొట్టమొదట ఉదయించే మేషరాశి మొదట ధ్వజమై, ఆ తర్వాత పశ్చిమంలో అస్తమించే సమయంలో వాహనంగా గోచరించడం విశేషం. ఇక శివునికి మేషరాశికిగల సంబంధం చూస్తే వెంటనే గుర్తుకువచ్చేది. దక్షయజ్ఞనాశఘట్టం. దక్షప్రజాపతి పెద్దకుమార్తె అయిన సతీదేవిని వివాహమాడిన శివుడు దక్షప్రజాపతికి తగిన గౌరవమీయడం లేదన్న నెపంతో తనుచేస్తున్న యజ్ఞానికి సతీశ్వరులనాహ్వానించడు. తండ్రి పిలవకపోయినా ఆ యజ్ఞానికివెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. అది సహించని ఆమె అక్కడే ఆహుతయింది. అది తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో ప్రమథగణాన్నిపంపించి, దక్షయజ్ఞాన్ని ధ్వంసంచేయించి, దక్షుని తలనరికిస్తాడు. దక్షునిభార్య వేడుకోగా మేకతలను అతడికి అమరుస్తారు.
వృషభం: ద్వాదశరాశుల్లో ఇది రెండవది. కృత్తిక 3పాదాలు, రోహిణి 4పాదాలు, మృగశిర 2పాదాలు కలిసి వృషభం ఏర్పడుతోంది. ఈ రాశ్యధిపతి శుక్రుడు. వృషభమంటే ఎద్దు (నంది). శివునివాహనంగా ప్రఖ్యాతిగాంచిన వృషభం శివధ్వజం కూడా.దీని తర్వాత రాశియైన మిథునాన్ని ఆదిదంపతులయిన శివపార్వతులుగా అనుకుంటే ఆ మిధునరాశికంటే ముందుదయించే వృషభరాశి శివునికి ధ్వజంగా గోచరిస్తుంది. మిథునంకంటే వృషభం ముందు అస్తమిస్తున్నప్పుడు అది వాహనంగా గోచరిస్తుంది. ఈరాశి చంద్రునికి ఉచ్ఛ. దీనికి కారణం బహుశ: ఇందులో రోహిణీ నక్షత్రం ఉండడం కావచ్చు.
మిథునం: ద్వాదశరాశుల్లో ఇది మూడో రాశి.స్త్రీ పురుషుల జంటను మిథునమంటారు. శివపార్వతులే మిథునంగా లోకంలో ప్రతీతి. మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర 4పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు కలిసి ఈరాశి ఏర్పడుతుంది. ఈ రాశ్యధిపతి బుధుడు. మృగశిర నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. ఇది వృషభ, మిథునరాశుల్లో ఉంది. ఆరుద్రానక్షత్రానికి అధిదేవత శివుడు. అందుకే వృషభరాశి ఉదయిస్తున్నప్పుడు చివర్లో చంద్రుడు పైకొస్తున్నట్లు, ఆ వెంటనే ఉన్న మిథునరాశిలోని ఆరుద్ర నక్షత్రోదయంతో చంద్రుడు శివుని తలపై ఉన్నట్లు అనిపిస్తుంది. పార్వతీపరమేశ్వరులు: ఈ నక్షత్రాలను లాటిన్ భాషలో జెమిని అనుపేరు. ఆ మాటకు మిథునం లేదా దంపతులు అని అర్థం. పునర్వసు నక్షత్రంలో ఉత్తరాన ఉజ్జ్వలంగా మెరసే జంట చుక్కలు పార్వతీపరమేశ్వరులు మిథునంలోనివి. “పునర్వసు త్రయః మిథునమ్.” ప్రాచీన కాలపు చాల్దియా, అసీరియా, బాబిలోనియా వారి జ్యోతిర్గ్రంధాలో ఈ రాశికి శివమ్ అనే పేరు కనబడుతోంది.విఘ్నేశ్వరుడీ దంపతులకు చేరువనే ఉత్తర దిశలో కనబడటం గమనింపదగినది.
కర్కాటకం: ద్వాదశరాశుల్లో ఇది నాలుగోరాశి. ఎండ్రకాయ (పీత) అని దీనిసామాన్యార్థం. పునర్వసు 4వపాదం, పుష్యమి నాలుగుపాదాలు, ఆశ్లేషనాలుగు పాదాలు కలిసి ఈ రాశిని ఏర్పరుస్తున్నాయి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు పాలసముద్రంనుండి పుట్టాడు. చంద్రుడు జలగ్రహం. మన:కారకుడు. ''చందమామో మనసో జాత: '' అని సూక్తం. చంద్రుని చూస్తే మానవులందరికీ చెప్పలేని అనుభూతికలుగుతుంది. ఎంతోమందికవులు ఎన్నోవిధాలుగా వర్ణించారీచంద్రుడ్ని. ఇక మేషాదిగా ఇది నాలుగోరాశి. శివునితో చంద్రునికిగల సంబంధవిషయానికొస్తే చంద్రుడు శివునికి తోడల్లుడని పురాణగాథలవల్ల తెలుస్తోంది. ఈ కథనుకూడా ఓసారి పరిశీలిద్దాం.
సతీదేవి తరువాత కుమార్తెలయిన 27 నక్షత్రాలను చంద్రునికిచ్చి వివాహం చేస్తాడు దక్షుడు. అయితే చంద్రుడుమాత్రం మిగిలినవాటికంటే రోహిణితో సన్నిహితంగామెలిగాడట. ఈ విషయాన్ని తెలుసుకున్న దక్షుడు, ఎంతో అందంగాఉండే చంద్రుడ్ని క్షయరోగికమ్మని శపిస్తాడు. ఈశాపంకారణంగానే చంద్రుడు ఇప్పటికికూడా శుక్లపక్ష, కృష్ణపక్షాల్లో మార్పులు చెందుతున్నాడు. ఈశాపంనుండి బయటపడడానికి చంద్రుడు శివుడ్నిశరణువేడగానే శివడతడ్ని తనజటాజూటంలో అలకంరించుకుంటాడు. దక్షుడీవిషయం తెలుసుకుని కైలాసం చేరుకుని చంద్రుడ్ని విడిచిపెట్టమని అడిగితే శివుడు నిరాకరిస్తాడు. అపుడు విష్ణుమూర్తి వచ్చి, చంద్రుడ్ని రెండుభాగాలు చేస్తే, ఒకభాగం శివుడి తనపైన ఉండగా రెండోభాగం శాపఅనుభవిస్తాడని లోకప్రసిద్ధి. ఇలా చంద్రుడ్నిధరించిన శివుడు చంద్రశేఖరుడయ్యాడు.
సింహం: ద్వాదశరాశుల్లో ఇది అయిదోరాశి. మఖ 4పాదాలు, పూర్వఫల్గుణి (పుబ్బ) 4పాదాలు, ఉత్తరఫల్గుణి 1పాదం కలిసి ఈరాశి ఏర్పడుతోంది. ఈ రాశికిఅధిపతి సూర్యుడు (రవి). ఇది అగ్నితత్త్వరాశి. శివుడికి సింహానికి ఉన్నసంబంధం చూస్తే అమ్మవారివాహనం 'సింహం' అని ప్రసిద్ధి. జ్యోతిశ్శాస్త్రంలో అయిదోరాశి తెలివితేటలకు, సంతానవిషయాలకు కారకత్వమవుతోంది. తెలుగునెలలప్రకారం (చాంద్రమానం) భాద్రపదశుద్ధచవితినాడు వినాయకచవితి. అదే వినాయకుడి జన్మదినం. చైత్రమాసంనుండి భాద్రపదం ఆరోనెల. అంటే అయిదుమాసాలు గడిచాకవచ్చే చవితినాడు వినాయకుడి జననం జరిగింది.
విఘ్నేశ్వరుడు అనబడే గణేశుడు. గణేశుని ప్రశంస ఋగ్వేదం ౧౧-౨౩-౧ లో ఉంది. పాశ్చాత్యులు మన గణేశ నక్షత్రాలను వారి ursa major గుంపు చుక్కలతో కలిపి కలగా పులగంగా చేశారు. కానీ సప్త ఋషులు ప్రక్కనే పడమటగా హత్తుకొని గణపతి చుక్కలు ఉన్నాయి. మన స్ర్తీలు ముగ్గు బొట్లను కలుపుకొన్నట్లు, వరుసగా 10, బృహదృక్షపు కప్పా అయేటా, తీటా, ఆప్సిలాన్, ఒమిక్రాన్ గుర్తులు గల చుక్కలను వరుసగా కలుపుకొంటూ వస్తే ఏనుగు తొండం, లంబోదరుని ముఖ స్వరూపం చాలా స్పష్టంగా కనబడుతుంది.
గణపతి కొక్కురౌతు. ఆఖువాహనుడు. అతనికి వాహనమైన ఎలుక రూపము కూడా ఈక్రింది వరుస నక్షత్రాలను కలుపుకొంటూ వస్తే మనకు ప్రత్యక్షమౌతుంది. ఎలుక రూపు చుక్కలు, శుక్ల యజుర్వేదంలో వర్ణించబడ్డాయి. గణేశ నక్షత్రాలు, సర్పదైవతమైన ఆశ్రేష చుక్కలతో ఉదయించటం చేత అతడు నాగ యజ్ఞోపవీతుడయ్యాడు. భాద్రపద శుక్ల చవితినాడు సూర్యోదయానికి ముందు గణపతి చుక్కలు తూర్పుటాకాశంలో తొలిసారి కనబడుతాయి కనుక “ ప్రాతర్యావాణా ప్రథమాయజధ్వం” అనే వేదమంత్రార్థాన్ని బట్టి ఆనాడు వినాయక చవితి అయింది. మరో ఆరునెలలకు చైత్ర శుక్ల చతుర్థి నాడు ఈ చుక్కలే సూర్యాస్తమయం కాగానే తూర్పుటాకాశంలో పొడుచుట కారణంగా , ఆనాడు కూడా “నోతన వాయమస్తిదేవాయా అజుష్టం” అనే శృతి వచనం ప్రకారం మన పంచాంగకర్తలు గణేశపూజ విధించారు. భాద్రపద శుక్ల చవితినాడు విఘ్నేశ్వరుడు, ఆ మరునాడు పంచమినాడు మఘతో సప్తఋషులు ఉదయించి పూజలందుకొంటున్నారు.
కన్య: ద్వాదశరాశుల్లో ఇది ఆరోరాశి. ఉత్తరఫల్గుణి (ఉత్తర) 2,3,4పాదాలు హస్త 4పాదాలు, చిత్త 1,2 పాదాలు కలిసి కన్యారాశినేర్పస్తున్నాయి. ఈ రాశ్యధిపతి బుధుడు. సహజషష్ఠమభావంద్వారా శత్రువుల్ని, ఋణాల్ని, రోగాల్ని, భిక్షాటనాన్ని, విషప్రయోగాదుల గురించి తెలుసుకోవచ్చు. శివునికి సహజషష్ఠమరాశి అయిన కన్యారాశికిగలసంబంధాన్ని పరిశీలిస్తే ఆదిభిక్షువయిన శివుడికి ప్రత్యేకించి రుజలు లేకపోయినా కాలకూటవిషాన్ని తనకుతానుగా మింగి లోకాలను రక్షించి నీలకంఠుడయ్యాడు. ఇంతుకుమించిన విషప్రయోగం ఇంకొకటుంటుందా?
తుల: పన్నెండురాశుల్లో ఇది సప్తపరాశి. చిత్త 3,4పాదాలు, స్వాతి 4పాదాలు, విశాఖ 1,2,3పాదాలుకలిసి తులా (త్రాసు) రాశిని ఏర్పరుస్తున్నాయి. సహజసప్తమభావం కళత్ర (భార్య) స్థానం. తులారాశిసమానత్వానికి ప్రతీక. శివునివిషయంలో అందరూఅనుకున్నట్లుగా ఇద్దరి భార్యలందు సమానప్రేమ కలిగిఉంటాడని చెప్పుకోవడం పొరపాటు. ఇక్కడ తన శరీరంలో సగభాగమిచ్చి స్త్రీ పురుష సమానత్వాన్ని అన్నివిధాల చాటిచెప్పిన అర్థనారీశ్వరుడు శంకరుడు. తులారాశ్యధిపతి శుక్రుడు. కళత్రకారకుడు శుక్రుడవడం విశేషంగా చెప్పవచ్చు.
వృశ్చికం: ద్వాదశరాశుల్లో ఇది అష్టమరాశి. వృశ్చికం (తేలు) కీటకరాశి. విశాఖ 4వపాదం, అనూరాధ 4పాదాలు, జ్యేష్ఠ 4పాదాలు వృశ్చికరాశిని ఏర్పరుస్తున్నాయి. ఈ రాశ్యధిపతి కుజుడు. తేలు రహస్యజీవనం (గోప్యత) కు గుర్తు. సాధ్యమయినంతవరుకు నరులకంట పడకుండా గోప్యంగా జీవిస్తుంది. అష్టమభావం ఆయుర్భావమే కాకుండా జీవనభావంకూడా. సంసారంలో కొంతగోప్యత ఉండాలని ఈ రాశి తెలియజేస్తుంది. ఎందుకంటే కళత్రస్థానం తర్వాతరాశే కాబట్టి. శివుని విషంలో కూడా అదే అన్వయించుకోవచ్చు.
ధనస్సు: ఇది నవమరాశి. దీని అధిపతి గురుడు. మూల 4పాదాలు, పూర్వాషాఢ 4పాదాలు, ఉత్తరాషాఢ 1వపాదం కలిసి ఈరాశి ఏర్పడుతోంది. ధనస్సు అంటే ఎక్కుపెట్టిన విల్లు. సహజనవమరాశి సంతానస్థానం. భాగ్యస్థానం పితృస్థానం. సంతానవిషయాలు ఈస్థానం ద్వారా తెలుసుకోవచ్చును. ధనుర్ధారిఅయిన మన్మథునిప్రభావంతో శివుని మనస్సు పార్వతిపై లగ్నమయి 'కుమారసంభవానికి' మార్గమయింది. తారాకాసుర సంహారానికి కుమారస్వామి ఉద్భవించి లోకాల్నిరక్షించాడు.చాంద్రమానం ప్రకారం భాద్రపదశుద్ధచవితినాడు వినాయకచవితి అయితే మార్గశీర్షశుద్ధషష్ఠి సుబ్రహ్మణ్యషష్ఠి. భాద్రపదమాసంనుండి నాలుగో నెల మార్గశిరం. అలాగే రాశులనుబట్టి చూసుకుంటే సింహం తరువాతిదయిన కన్య నుండి నాలుగోదయిన ధనస్సు నవమస్థానం. ఇదికూడా శివునికి సంతానకారణమయింది. పూర్వాషాఢనక్షత్రానికి అధిదేవతగంగాదేవి. కుమారసంభవంలో గంగపాత్రకూడా కొంతఉందని ఓకథ ప్రచారంలోఉంది.
మకరం: రాశిచక్రంలో పదోరాశిమకరం. ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణం 4పాదాలు ధనిష్ట 1,2పాదాలు కలిసి ఈ రాశి ఏర్పడుతోంది. ఈ రాశ్యధిపతి శని. దీనికంటే ముందురాశి ధనస్సును ధనుర్ధారి అయిన మన్మథునిగా భావిస్తే దానిపైన ధ్వజంగాఉన్న మకరం వలన మన్మథుడు 'మకరధ్వజుడు' అయ్యాడు. కుమారసంభవంకోసం దేవతలందరూ మన్మథున్ని ప్రేరేపించి శరసంధానం చేయించగానే ఆ ప్రభావంతో చలించిన ఫాలనేత్రుని కోపానికి మన్మథుడు భస్మమయ్యాడు. సహజదశమ భావం రాజ్యభావం. వృత్తిభావంకూడా. సమస్తవృత్తులకు ఆ నిటలాక్షుడే కారణభూతుడవుతున్నాడని చెప్పడంలో సందేహంలేదు.
కుంభం: రాశిచక్రంలో పదకొండోరాశి కుంభం. ధనిష్ట 3,4పాదాలు, శతభిషం 4పాదాలు, పూర్వాభాద్ర 1,2,3పాదాలు కలిసి ఈరాశిని ఏర్పస్తున్నాయి. కుంభం అంటే నీటికుండ. ఇది అర్థజలరాశి, సహజలాభస్థానం. కుంభానికి కూడా అధిపతి శని. ఈ భావాన్నిబట్టి పెద్ద సోదరి,సోదరులను గురించి, మామగారినుండి వచ్చే లాభాన్ని తెలుసుకోవచ్చు. శివుని మామగారయిన హిమవంతుడినుండి పుట్టి ప్రవహించే నదులన్నింటిలోని పెద్దదయిన గంగానదిని తనజటాజూటంలో బంధించి గంగాధరుడయ్యాడు. నిత్యాభిషేకప్రియుడు శివుడు. కుంభరాశిలోని శతభిషంనక్షత్రానికి అధిదేవత వరుణుడు. నదులపుట్టుకకు ప్రవాహానికి వరుణిడిదే కీలకపాత్ర.
మీనం: ద్వాదశరాశుల్లో చివరిది మీనరాశి. మీనం (చేప) పూర్ణజలరాశి. పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర4పాదాలు, రేవతి 4పాదాలు కలిసి ఈ రాశి ఏర్పడుతోంది. గురుడు ఈ రాశ్యధిపతి. సహజద్వాదశరాశికి వ్యయస్థానమని, మోక్షస్థామని పేరు. హిమాలయాల్లో పుట్టిననదులు ప్రవహించి, సముద్రంలో కలిసినట్లుగానే శివునినుండే జన్మించిన ప్రాణులు తమ జీవిత చక్రం ముగియగానే అతనిలోనే లీనమయిపోతాయి. లయకారుడుకదా శివుడు. సముద్రంనుండే మొదటి జీవం ఆవిర్భవించింది. కనుక ఈ చక్రం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది.
Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in English.
Read MoreDetailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.
Read More