Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2021 samvatsara Mithuna rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Mithuna Rashi in Telugu

మృగశిర 3,4 పాదములు (కా,కి),
ఆరుద్ర 1,2,3,4 పాదములు(కు, ఘ, ఙ, ఛ)
పునర్వసు 1,2,3 పాదములు (కే,కో, హా)
ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో ఎనిమిదవ ఇంటిలో, రాహువు వృషభ రాశిలో 12వ ఇంటిలో, వృశ్చిక రాశిలో కేతువు ఆరవ స్థానంలో ఈ సంవత్సరమంతా ఉంటారు. గురుడు ఏప్రిల్ 06న కుంభరాశిలో తొమ్మిదవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో 8వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు, నవంబర్ 20న గురుడు మళ్లీ కుంభరాశిలో తొమ్మిదవ ఇంటిలో ప్రవేశిస్తాడు.
ఈ సంవత్సరం వృత్తి పరంగా కొంత సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా శని గోచారము 8వ ఇంట్లో ఉండటం, అలాగే గురువు ఏప్రిల్ వరకు ఎనిమిదవ ఇంట్లో ఉండటం, రాహు గోచారము పన్నెండవ ఇంటిలో ఉండటం వలన వృత్తి పరంగా కొంత సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా తలపెట్టిన పనులు అనుకోని అడ్డంకులతో ఆగిపోవడం లేదా వాయిదా పడడం జరుగుతుంది. ఎంత పని చేసినప్పటికీ సరైన ఫలితం రాక అసహనానికి అసంతృప్తికి లోనవుతారు. మీ పై అధికారులు కానీ మీ సహోద్యోగులు కానీ మిమ్మల్ని అవమానించాలని లేదా తక్కువ చేయాలని చూస్తారు. గురు గోచారం ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య తొమ్మిదవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన సమస్యల నుంచి బయటపడి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో మిమ్మల్ని అవమానించాలని లేదా ఇబ్బంది పెట్టాలని చూసిన వారికి సరైన సమాధానం చెప్పారు . ఈ సమయంలో ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చూస్తారు. గతంలో మీ దగ్గర దాకా వచ్చి దూరమైన అవకాశాలు మళ్లీ మీకు అందుబాటులోకి వస్తాయి. మీ సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ పరంగా మార్పు కోరుకుంటున్న వారు ఏప్రిల్ వరకు కానీ లేదా నవంబర్ వరకు కానీ ఆగటం మంచిది. జనవరి ఏప్రిల్ మధ్యలో ఉద్యోగ విషయంలో ఎటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. శని దృష్టి ఉండటం వలన మీకు నేర్చుకోవడానికి మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. మీలో ఉన్న లోపాలు, అలాగే మీకు చెడు చేసే రహస్య శత్రువులు మీకు తెలియడం వలన వాటిని సరి దిద్దుకొని విజయం దిశగా అడుగు వేస్తారు. ఈ సమయంలో ఏమైనా పనులు మధ్యలో ఆగిపోవడం కానీ వాయిదా పడడం జరిగితే తొందరపడి ఆ పనిని మళ్లీ ప్రయత్నించకుండా ఆపకండి. మీరు ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేయటం వలన ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో మీ ఓపికకు పట్టుదలకు పరీక్ష పెట్టే సంఘటనలు జరుగుతాయి వాటిని వీలైనంత సహనంతో ఎదుర్కోవడం వలన భవిష్యత్తులో అభివృద్ధికి దోహదపడుతుంది.
ఈ సంవత్సరం కుటుంబానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకూ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండటం, కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా, మీరు అనవసరమైన విషయాలను గురించి ఎక్కువగా ఊహించుకొని బాధపడటం చేస్తుంటారు. ఏప్రిల్ నుంచి గురువు తొమ్మిదవ ఇంటికి మారటం వలన కుటుంబంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోయి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గతంలో మీ కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు కానీ మనస్పర్థలు కానీ తొలగిపోతాయి. ఐదవ ఇంటిపై గురువు దృష్టి కారణంగా, సంతానం కొరకు ఎదురుచూస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు ఆరోగ్యం చేకూరటం జరుగుతుంది. మీ పిల్లలు వారి వారి రంగాలలో అభివృద్ధి సాధించడమే కాకుండా మీ ఆనందానికి కారణమగుతారు. మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. మీ సోదరులు మంచి అభివృద్ధిలోకి వస్తారు మరియు వారి ద్వారా మీకు అనుకోని సహాయ, సహకారాలు అందుతాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య మీ కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఈ సమయంలో మీ కుటుంబంలో అనుకోని వివాదాలు కానీ, సమస్యలు కాని వచ్చే అవకాశముంటుంది.
ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. గురు గోచారం ఏప్రిల్ వరకు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన అనుకోని ఖర్చులు, బాధ్యతలు మీద పడటం జరుగుతుంది. దాని వలన ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురవుతారు. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ ఏదో ఒక విధంగా ఆ డబ్బు ఖర్చు అవడంతో బ్యాంకు నుండి కానీ లేదా మిత్రుల నుండి కానీ ఆర్థిక సహాయాన్ని పొందుతారు. ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో చేసిన అప్పులు కానీ, తీసుకున్న లోన్లు కానీ తీర్చగలుగుతారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందడం వలన మానసిక ఆందోళన నుంచి బయట పడతారు. ఈ సంవత్సరం పెట్టుబడులకు, అలాగే స్థిరాస్తుల కొనుగోలుకు కొంత సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టాలనుకునే వారు లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునేవారు ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య చేయటం మంచిది. జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఆర్థిక వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం కానీ లేదా ఆర్థికంగా నష్ట పరచటం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని తొందరగా నమ్మకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండటం మంచిది. స్థిరాస్థుల కొనుగోలుకు సంబంధించి కొన్ని ఆటంకాలు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆస్తుల అమ్మకం లేదా కొనుగోలు విషయంలో, తీవ్రమైన ఆలోచన తరువాత తుది నిర్ణయం తీసుకోండి. ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టవద్దు; లేదంటే భారీ నష్టాలు చవిచూడాల్సి రావచ్చు.
ఈ సంవత్సరం ఆరోగ్య దృష్ట్యా కొంత సామాన్యంగా ఉంటుంది. అష్టమ ఇంటిలో గురు, శని గోచారం వలన సంవత్సర ఆరంభంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఒకవేళ మీరు ఇప్పటికే అస్వస్థతతో బాధ పడుతున్నట్లయితే, అప్పుడు ఆరోగ్య విషయంలో కొన్ని నియమాలు పాటించటం మంచిది. మీ రోజువారీ దినచర్యను ఆహారపు అలవాట్లతో పాటు మెరుగు పరచుకుంటే ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రయాణాల విషయంలోనూ అలాగే మానసిక సమస్యల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అష్టమ శని కారణంగా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు యోగ ధ్యానం లాంటి పద్ధతులను పాటించడం మంచిది. అష్టమ గురువు కారణంగా లివర్ మరియు వెన్ను పూసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎక్కువ కూర్చోవడం కానీ, విశ్రాంతి లేకుండా అధికంగా పని చేయడం కానీ, సరైన ఆహార అలవాట్లు లేకుండా ఉండడం కానీ చేయకండి. అలాగే పన్నెండవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మెడ మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ తర్వాత నుంచి ఆరోగ్యపరంగా బాగుంటుంది. పైన చెప్పిన ఆరోగ్య సమస్యల నుంచి బయట పడగలుగుతారు. ఈ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, అనారోగ్యకరంగా ఉండే మీ జీవన విధానాన్ని మెరుగుపరచేవే తప్ప, మీకు నష్టం చేసేవి కాదని గమనించండి.
విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వారికి ఏప్రిల్ వరకు చదువులో ఆటంకాలు ఏర్పడడం లేదా చదువుపై శ్రద్ధ తగ్గడం జరుగుతుంది. వీరు అప్లై చేసిన లేదా కావాలనుకున్న ఉన్నత చదువు విషయంలో కొంత అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. వీరు చేసే ప్రయత్నాలను మధ్యలో ఆపకుండా మళ్లీ, మళ్లీ ప్రయత్నించడం మంచిది. దీనివల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి చదువులో ప్రగతిని సాధిస్తారు. వీరు చేసిన శ్రమకు మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే, వీరు కొన్నిసార్లు అతి ఆత్మవిశ్వాసంతో తమకు వచ్చిన మంచి అవకాశాలను కూడా వదులుకునే అవకాశం ఉంది. పన్నెండవ ఇంటిలో రాహు గోచారం కారణంగా జ్ఞాపకశక్తి తగ్గడం కానీ లేదా ఏకాగ్రత నిలపలేక పోవడం కానీ జరుగుతుంది. అయితే ఇది కేవలం తాత్కాలికమే తప్ప ఎక్కువ కాలం ఉండేది కాదని గమనించాలి. వీలైనంత వరకు ఏ విషయం పైన అయినా శ్రద్ధను ఆసక్తిని కనబరచడం వలన చదువులో ఉన్నతిని పొందుతారు.
ఈ సంవత్సరం మీకు గురువు, శని మరియు రాహువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ మూడు గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది. ముఖ్యంగా శని, రాహువులు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండరు కాబట్టి, వీరికి పరిహారాలు ఆచరించటం వలన చాలా సమస్యలు తొలగిపోయి ఈ సంవత్సరం ప్రశాంతంగా గడుస్తుంది. అష్టమ స్థానంలో శని సంచారం కారణంగా ఉద్యోగంలో అనుకోని మార్పులు, అవమానాలు, గుర్తింపు లేకపోవడం అలాగే పనుల్లో అడ్డంకులు మొదలైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి శని యొక్క చెడు ప్రభావం తగ్గడానికి శనికి తైలాభిషేకం చేయడం కానీ, శని స్తోత్రం చదవడం కానీ లేదా శని జపం చేయడం కానీ మంచిది. దీంతోపాటు పేదలకు లేదా అనాథలకు, అలాగే వికలాంగులకు ఆర్థికంగా లేదా శారీరకంగా సహాయం చేయటం వలన కూడా శని ప్రభావం తగ్గుతుంది. పన్నెండవ ఇంటిలో రాహువు గోచారం కారణంగా మానసిక సమస్యలు పెరగటం, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవటం జరుగుతుంది. ఈ చెడు ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతిరోజు రాహు స్తోత్రం చదవటం లేదా రాహు మంత్ర జపం చేయటం లేదా దుర్గా స్తోత్రం పారాయణం చేయడం మంచిది. అష్టమ గురు సంచారం కారణంగా ఆర్థిక సమస్యలు పెరగడం జరగచ్చు. ఈ చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు గురు సంబంధం స్తోత్రములు చదవటం లేదా గురు మంత్ర జపం చేయటం మంచిది.
Free Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Hindi.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Hindi.
Read More
People living in other countries, contribute via PayPal.