Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2023 samvatsara Makara rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Makara Rashi in Telugu

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు (బో, జ, జి)
శ్రవణం 4 పాదాలు (జు, జే, జో, ఖ)
ధనిష్టా 1, 2 పాదాలు (గ, గి)
ఈ సంవత్సరం మకర రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి మూడవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత నాలుగవ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశికి ఒకటవ స్థానమైన మకర రాశి నుంచి, రెండవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 న రాహువు నాలుగవ స్థానమైన మేష రాశి నుంచి, మూడవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు పదవ స్థానమైన తులా రాశి నుంచి తొమ్మిదవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈ సంవత్సరం మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. జనవరిలో శని గోచారం రెండవ ఇంటికి మారటం వలన, వృత్తి పరంగా, ఆర్థికంగా కొంత అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరమంతా శని గోచారం సామాన్యంగా ఉండటం వలన సంవత్సర ప్రథమార్ధంలో వృత్తి పరంగా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ సహోద్యోగులతో కాని, పై అధికారులతో కాని మీ మాట కారణంగా లేదా, మీరు పని చేసే విధానం కారణంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీరు ఎంత శ్రమ పడినప్పటికీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వలన కొన్నిసార్లు మీరు పరుషంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే మొదట మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న మీ పై అధికారులు తర్వాత మీరు నిజాయితీగా పని చేయడం గుర్తించి మీకు సహకరిస్తారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రథమార్ధంలో గురువు దృష్టి ఏడవ ఇంటిపై, తొమ్మిదవ ఇంటిపై, మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన మీరు మీ ఉద్యోగ రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అలాగే మీరు ఇతరుల పని చేస్తానని తొందరపడి ఒప్పుకొని ఒత్తిడి ఎక్కువ అవడం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం మీరు విరామం లేకుండా పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీలైనంతవరకూ ఇతరుల విషయాల్లో కానీ, పనిలో కానీ జోక్యం చేసుకోకుండా ఉండటం వలన మీ పని భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మీరు చాలా సార్లు పనిలో ఆటంకాలు ఏర్పడటం లేదా చేసిన పని మళ్లీ, మళ్లీ చేయాల్సి రావటం వలన కొద్దిగా అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసిన పనికి తగిన ఫలితం సమయానికి రాకపోవడం కానీ, మీరు అనుకున్నంత రాకపోవడం కానీ జరగవచ్చు. అయితే ఈ సంవత్సరం మీరు నైపుణ్యాన్ని మెరుగు పరచుకునే అవకాశాలు మీకు లభిస్తాయి. వాటిని సరిగా వినియోగించుకున్నట్లైతే భవిష్యత్తులో మీరు వృత్తిలో అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన మీరు మీ ఇంటికి లేదా కుటుంబానికి దూరంగా పనిచేయాల్సి రావచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. మీ వృత్తిలో పదోన్నతి కారణంగా కానీ లేదా ఇతరుల బాధ్యతలు స్వీకరించాల్సి రావటం వల్ల కానీ ఈ పని ఒత్తిడిని కొంతకాలం మీరు భరించాల్సి రావచ్చు. రాహు గోచారం కూడా సంవత్సరాంతం వరకు నాలుగవ ఇంటిలో ఉండటం కూడా పని ఒత్తిడికి కారణం అవుతుంది. అయితే పదవ ఇంట్లో కేతువు గోచారము ఉండటం అలాగే గురువు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీరు సరిగా పని చేయకుంటే ఉద్యోగాన్ని ఎక్కడ కోల్పోతామేమోనని భయంతో అతిగా పని చేయడం కానీ, ఇతరుల పని తలపై వేసుకోవడం కానీ చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసర భయాలకు పోకుండా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలన ఉద్యోగంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ సంవత్సరం ఉద్యోగ విషయంలో అలాగే ఉద్యోగ మార్పు విషయంలో అతిగా సాహసాలు చేయడం మంచిది కాదు. అలాగే ఈ సంవత్సరం ఎక్కువ ప్రయత్నం మేరకు మాత్రమే సరైన ఫలితం వస్తుందని గుర్తించండి. ఈ సంవత్సరం జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 మధ్య సమయం, ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్య, మరియు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 మధ్య వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు తమ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది.
మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో అనుకూల ఫలితాలను ద్వితీయార్ధంలో సామాన్య ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురువు దృష్టి ఏడవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ సంవత్సరమంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన మీరు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను చూస్తారు. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వామితో సరైన అవగాహన లేకుండా పోవటం లేదా, మీ మధ్య మనస్పర్థలు రావడం వలన వ్యాపారంలో అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. దాని కారణంగా మీకు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీ భాగస్వాములు కానీ, ఇతరులు కానీ మీకు సరైన సహకారం అందించక పోవడం వలన కొంతకాలం మీరు ఒంటరిగా వ్యాపారాన్ని నిర్వహించాల్సి వస్తుంది. అయితే ప్రథమార్ధంలో గురు దృష్టి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ సమస్యను విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. కొన్నిసార్లు పని ఒత్తిడి ఎక్కువ అవడం వలన ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతారు. ఈ సమయంలో శని దృష్టి పదకొండవ ఇంటిపై మరియు నాలుగవ ఇంటిపై ఉండటం వలన లాభాలు తగ్గటమే కాకుండా ఆర్థిక ఒత్తిడులను ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్లో గురువు నాలుగవ ఇంటికి మారటంతో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది. గురువుతో పాటు రాహువు కూడా నాలుగవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో మీరు మీ వ్యాపార అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేయాల్సి వస్తుంది. దాని కారణంగా మీరు విశ్రాంతిని, ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. మీకున్న బాధ్యతలను పూర్తి చేయడానికి మీరు చేసే శ్రమకు సరైన గుర్తింపు లేకపోవడం వలన మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. అయితే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకొని వారి సహకారం అందించడం వలన మీరు ఈ బాధ నుంచి బయట పడగలుగుతారు. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులకు కానీ, ఇతర ప్రాంతాల్లో ప్రారంభించాలని అనుకోవడం కానీ ఈ సంవత్సరం మంచిది కాదు. గురువు గోచారం కానీ, శని గోచారం కానీ అనుకూలంగా లేకపోవడం వలన ఈ విషయంలో మీరు ఎక్కువగా ప్రయత్నించాల్సి రావటం కానీ, ఎక్కువ డబ్బులు పెట్టాల్సి రావడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా మీ భాగస్వాముల సహకారం కూడా లేకపోవటం వలన మీరు కొంతకాలం ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది. అయితే సంవత్సరం చివరలో రాహు గోచారం అనుకూలంగా మారటంతో మీకు ఒత్తిడి తగ్గడమే కాకుండా మీ భాగస్వాముల సహకారం కూడా తిరిగి లభించడంతో వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది.
మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్ధం కొంత సామాన్యంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు దృష్టి తొమ్మిదవ ఇంటిపై, ఏడవ ఇంటిపై, మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి వరకు ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా గురు దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన మీరు చేసే పనుల వలన మరియు పెట్టుబడుల వలన లాభాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా వ్యాపారం ద్వారా గాని, వారసత్వ ఆస్తులు లభించడం వల్ల కానీ, వివాదాల్లో విజయం సాధించటం వల్ల కానీ ఈ సమయంలో మీకు ఆదాయం వస్తుంది. స్థిరచరాస్తులు కొనుగోలుకు ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సి వస్తే సూర్యుని గోచారం మరియు గురువు గోచారం అనుకూలంగా ఉన్న నెలల్లో కొనుగోలు చేయడం మంచిది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి గురు గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం, మరియు సంవత్సరమంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన సంవత్సర ద్వితీయార్ధంలో ఆర్థికంగా అంతగా అనుకూలించదు. మీరు మీ కుటుంబ విషయంలో లేదా మీరు గతంలో తీసుకున్న అప్పులు కానీ, బ్యాంకు లోన్లు కాని తిరిగి తీర్చాల్సిన రావటం వలన కూడా ఈ సమయంలో ఎక్కువ మొత్తాల్లో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. దాని కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీ ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కానీ డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం మధ్యలో ఈ విషయంలో డబ్బు ఖర్చు చేస్తారు. అయితే సంవత్సరమంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన ఎక్కువగా డబ్బు ఖర్చు చేసినప్పటికీ సమయానికి ఏదో ఒక రూపంలో అవసరానికి తగినంత డబ్బు మీకు అందే అవకాశం ఉంటుంది. మీరు ఈ సంవత్సరం రిస్కు తీసుకొని చేసే పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. గురు దృష్టి అనుకూలంగా లేకపోవడం వలన మీరు అనుకున్న విధంగా లాభాలు రాకపోవడం వలన, లేదా పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ ఒకే చోట ఉండిపోవడం వలన కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది. ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్యకాలం, జూన్ 15 నుంచి జూలై 17 మధ్యకాలం మరియు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 16 మధ్యకాలం సూర్యుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు చేయటానికి, చిన్న మొత్తం పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మార్చి 13 నుంచి మే 10 మధ్యలో, నవంబర్ 16 నుంచి ఈ సంవత్సరం చివరి వరకు కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్థిరాస్థి కొనుగోళ్లు ఈ సమయంలో చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరమంతా గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే పైన చెప్పిన సమయాల్లో కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలు చేయటం మంచిది.
మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు గురు దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరం ప్రయాణాలు మరియు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలకంటే కూడా శారీరక బడలిక మరియు మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ఏప్రిల్ వరకు గురు గోచారం మూడవ ఇంట్లో ఉండటం వలన మీరు ఉత్సాహంగా పని చేయగలుగుతారు మరియు ప్రయాణాలు చేయగలుగుతారు. ఏప్రిల్ చివరి వారంలో గురువు గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం మరియు సంవత్సరమంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా గురువు మరియు రాహువు నాలుగవ ఇంట్లో సంచరించడం వలన ఊపిరితిత్తులు, వెన్నెముక, కాలేయము మరియు జీర్ణ సంబంధ ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రయాణాలు ఎక్కువగా ఉండటం మరియు సమయానుసారంగా భోజనము మరియు నిద్ర లేకపోవటం వలన మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మీ నిర్లక్ష్యం కారణంగా కూడా మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. రెండవ ఇంటిలో శని గోచారం కారణంగా దంతాలు, ఎముకలు మరియు జననాంగ సంబంధ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. శని దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన వచ్చిన ఆరోగ్య సమస్యలు తగ్గడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ ఆహార నియమాల్లో మరియు జీవన విధానంలో క్రమశిక్షణను పాటించినప్పుడు మాత్రమే మీరు అనారోగ్యంపాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ జీవన విధానాన్ని సరిగా ఉంచుకున్నట్లయితే చాలావరకు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉండదు. ఈ సంవత్సరం మీలో శారీరకంగా మరియు మానసికంగా ఉన్న లోపాలను తొలగించి మిమ్మల్ని మరింత దృఢంగా మారటానికి సహకరిస్తుంది. ఈ సంవత్సరం జూలై 1 నుంచి ఆగస్టు 18 వరకు కుజుని గోచారం, ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకూ, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు మరియు డిసెంబర్ 16 నుంచి సంవత్సరాంతం వరకూ సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుజుడు మరియు సూర్యుడు ప్రభావం కారణంగా రక్తం మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
మకర రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరమంతా శని గోచారం కుటుంబ స్థానమైన రెండవ ఇంటిలో ఉండటం వలన కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం 3వ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్యన మంచి అవగాహన, ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామి తమ ఉద్యోగంలో కానీ, వారి రంగంలో కానీ అభివృద్ధి సాధించ గలుగుతారు. వారితో మీ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ఈ సమయంలో కుటుంబంలో వివాహం కానీ, ఇతర శుభకార్యాలు కానీ జరిగే అవకాశముంటుంది. గురుదృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన మీ తండ్రిగారి ఆరోగ్యం బాగుంటుంది మరియు వారికి ఉన్న న్యాయ పరమైన లేదా ఆస్తి సంబంధ తగాదాలు ముగుస్తాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు పుణ్యక్షేత్ర సందర్శన చేయటం కానీ, వినోద, విహార యాత్రలు చేయటం కానీ చేస్తారు. ఏప్రీల్ నుంచి గురువు గోచారం నాలుగవ ఇంటికి మారటం వలన కుటుంబంలో కొన్ని మార్పులు జరిగే అవకాశముంటుంది. మీరు మీ ఉద్యోగ రీత్యా లేదా ఇతర కారణాల వలన మీ కుటుంబాన్ని విడిచి విదేశాలకు కానీ, వేరే ప్రాంతానికి కానీ వెళ్లే అవకాశముంటుంది. రెండవ ఇంటిలో శని గోచారం కారణంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపించే అవకాశముంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మీ మాటకు విలువ ఇవ్వక పోవటం కానీ, మీ పట్ల నిర్లక్ష్యం వహించటం కానీ చేయటం వలన మీరు కోపానికీ, అసహనానికి గురయ్యే అవకాశముంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో మీ మాట తీరు కారణంగా కూడా మీ కుటుంబ సభ్యులతో లేదా బంధువులతో మీకు వివాదాలు ఏర్ప డే అవకాశముంటుంది. ఈ సమయంలో రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి మీ కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశముంటుంది. దాని కారణంగా మీరు మానసిక ఆందోళనకుగురయ్యే అవకాశముంటుంది. ఈ సమయంలో గురు దృష్టి 8వ ఇంటిపై మరియు 12వ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధితో పాటు, ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. సంవత్సరం చివరలో రాహు గోచారం 3వ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి మీరు తిరిగి మీ కుటుంబం తో కలిసి ఉండగలుగుతారు.
ఈ సంవత్సరం మకర రాశి లో జన్మించిన విద్యార్థులకు ప్రథమార్థం మరియు సంవత్సరం చివరలో అనుకూలంగా ఉంటుంది సంవత్సరం మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల విషయంలో వారు ఎక్కువగా శ్రమించ పోవటం వలన పరీక్షలలో మంచి ఫలితాలను సాధించలేరు. అయితే ఏప్రీల్ వరకు గురు గోచారం 3వ ఇంటిలో ఉండటం వలన చదువు విషయంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ ఉత్సాహం తగ్గకుండా ప్రయత్నిస్తారు. దాని కారణంగా ప్రథమార్థంలో చదువు విషయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఒక్కోసారి ఏకాగ్రత తగ్గటం మరియు ఇతర విషయాల మీద ఆసక్తి పెరగడం వలన చదువులో మిగతా వారికంటే తక్కువ శ్రమచేసే అవకాశముంటుంది. అయితే ఈ సమయంలో గురువు దృష్టి 9వ ఇంటిపై మరియు లాభ స్థానంపై ఉండటం వలన గురువులు మరియు పెద్ద వారి సహకారంతో మళ్లీ చదువు మీద దృష్టి మళ్లుతుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం నాలుగవ ఇంటిలో అనుకూలంగా లేకపోవడం వలన అలాగే నాలుగవ ఇంటిలో రాహు గోచారం కూడా ఉండటం వలన ఈ సమయంలో ఇష్టం లేనప్పటికీ చదువు విషయంలో దూర ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంటుంది. దాని కారణంగా ప్రారంభంలో చదువుపై ఆసక్తి తగ్గుతుంది మరియు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకూ చదువు మీద దృష్టి మళ్లిస్తూ మానసిక ఉల్లాసం కొరకు విహార యాత్ర చేయడం కానీ లేదా సంగీతం లాంటి మనసుకు ఉల్లాసం కలిగించే వాటిపై కొంత సమయాన్ని పెట్టడం వలన మానసిక ఒత్తిడి తగ్గి తిరిగి చదువుపై ఆసక్తి పెంచుకోగలుగుతారు. ఈ సంవత్సరం నవంబర్ వరకు కేతు గోచారం పదవ ఇంటిలో ఉండటం వలన ఉద్యోగార్థులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ వారు ఉద్యోగ విషయంలో ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. శని దృష్టి నాలుగవ ఇంటిపై, మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన ఉన్నత విద్యాభ్యాసాన్ని కోరుకున్న విద్యాసంస్థల్లో చేయాలనుకునేవారు దాని గురించి ఒకటికి రెండు సార్లు ప్రయత్నించడం మంచిది. మొదటి ప్రయత్నంలో అనుకూల ఫలితం రాకుంటే తిరిగి ప్రయత్నించడం మంచిది. అంతేకానీ నిరాశ చెందడం ఈ సమయంలో ఏ రకంగా కూడా మీకు మంచి చేయదు. ఈ సంవత్సరం బద్ధకం లాంటి లోపాలను జయించేలా శని సహకరిస్తాడు కాబట్టి విద్యార్థులు ఫలితం కంటే ఎక్కువ జ్ఞానానికి విలువ ఇవ్వటం మంచిది. సంవత్సరం చివరలో రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు ఈ సమయం అనుకూలించి వారు కోరుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు.
ఈ సంవత్సరం మకర రాశి వారు గురువుకు, శనికి, రాహువుకు, మరియు కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. సంవత్సరమంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన శని ఇచ్చే కుటుంబ సమస్యల నుంచి, ఆర్ధిక సమస్యల నుంచి బయటపడటానికి మరియు శుభ ఫలితాలు పొందటానికి ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ శని స్తోత్ర పారాయణం చేయటం శని మంత్ర జపం చేయటం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మంచిది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం నాలుగవ ఇంటిలో ఉంటుంది కాబట్టి గురువు చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు కానీ, ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం, గురు మంత్ర జపం చేయటం లేదా గురు చరిత్ర పారాయణం చేయడం మంచిది. దీనివలన ఆరోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు తొలగిపోయి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. నవంబర్ వరకు రాహు గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన రాహువు ఇచ్చే ఆరోగ్య సమస్యలు మరియు మానసిక సమస్యలు తొలగిపోవడానికి శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ రాహు స్తోత్ర పారాయణం చేయడం, రాహు మంత్ర జపం చేయటం లేదా దుర్గా స్తోత్రం పారాయణం చేయటం మంచిది. నవంబర్ వరకు కేతువు గోచారం పదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి కేతువు ఇచ్చే వృత్తి పరమైన సమస్యలు మరియు మానసిక సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు గాని, ప్రతి మంగళవారం కానీ కేతు స్తోత్ర పారాయణం చేయటం, లేదా కేతు మంత్ర జపం చేయటం లేదా గణపతి స్తోత్రం పారాయణం చేయడం మంచిది.

People living in other countries, contribute via PayPal.