Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2022 samvatsara Vrishchika rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Vrishchika Rashi in Telugu

విశాఖ 4వ పాదం(తో)
అనురాధ 4 పాదాలు (న, ని,ను, నే)
జ్యేష్ట 4 పాదాలు (నో, య, యి, యు)
ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి, 5వ ఇంటిలోకి, మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో, 6వ ఇంటిలోకి రాహువు మరియు తులారాశిలో, 12వ ఇంటిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి, 4వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి, 3వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.
ఈ సంవత్సరం, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి, ఏప్రిల్ వరకు సామాన్యంగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ నుంచి గురు గోచారం ఐదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా ఏప్రిల్ వరకు గురు గోచారం కొంత సామాన్యంగా ఉండటం వలన, ఈ సమయంలో వృత్తి పరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు మీ కీర్తి ప్రతిష్టల కొరకు, మరియు వృత్తిలో అభివృద్ధి కొరకు విపరీతంగా శ్రమిస్తారు. శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి విషయంలో ఎక్కువగా ఆందోళనకు, భయానికి గురవటం వలన కూడా ఎక్కువగా శ్రమించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చేయకండి. అది మీ వృత్తిలో మీ సహోద్యోగులతో సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్లో గురువు తో పాటుగా శని, రాహు మరియు కేతువులు రాశి మారటం వలన మీకు వృత్తి విషయం లో ఉండే ఆందోళన తొలగిపోవడమే కాకుండా పదోన్నతి లభిస్తుంది. కొత్త ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వారికి, ఉద్యోగంలో మంచి మార్పు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఏప్రిల్ నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనికి గుర్తింపు లభించడమే కాకుండా దాని ద్వారా లాభాలు కూడా అందుకోగలుగుతారు. మీ ఆలోచనలకు, మీ ప్రణాళికలకు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో వృత్తిలో అభివృద్ధి తో పాటుగా పని ఒత్తిడి కూడా ఉంటుంది. జూలైలో శని తిరిగి మూడవ ఇంటికి రావడంతో ఈ పని ఒత్తిడి తగ్గి వృత్తిలో అనుకూలమైన సమయం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మీ సహోద్యోగులు నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. గతంలో మీకు చెడు చేయాలని చూసిన, లేదా చెడు చేసిన వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పొందుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అలాగని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈ సంవత్సరం విదేశీ యానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ద్వితీయార్ధంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది. ఏప్రిల్లోపు అవకాశాలు వచ్చినప్పటికీ అది వాయిదా పడటం కానీ లేదా సరైన అవకాశాలు కాకపోవడం వలన మీ అంతట మీరు వదిలేయడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా జూలై నుంచి మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి విదేశీ యానం విషయంలో మీరు అనుకున్న విధంగా అవకాశం లభిస్తుంది.
మీకు ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు శని గోచారం బాగుండటం ఆ తర్వాత గురు మరియు రాహు గోచారం బాగుండటం వలన మీ ఆదాయం మెరుగు పడుతుంది. అంతేకాకుండా గతంలో చేసిన అప్పులు తీర్చగలుగుతారు. ఈ సమయంలో ఖర్చులు ఉన్నప్పటికీ వాటికి తగిన ఆదాయం సమకూర్చుకో గలుగుతారు. ఏప్రిల్ నుంచి గురు గోచారం ఐదవ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక లాభాలు పెరుగుతాయి. గురు దృష్టి లగ్నం పై, లాభ స్థానం పై మరియు భాగ్య స్థానంపై ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. ఇల్లు కాని, వాహనం కానీ కొనాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, చేసే ఆలోచన కానీ సరైన ఫలితాలనిచ్చే ఆర్థికంగా సాధించేలా చేస్తుంది. గతంలో ఏర్పడిన నష్టాలకు తగిన ఆదాయం రావడంతో ఆ నష్టాలు పూరించబడతాయి. రాహు గోచారం ఆరవ ఇంట అనుకూలంగా ఉండటం వలన కోర్టు కేసులలో, వారసత్వ వివాదాలలో విజయం సాధించడం వలన ధన లాభం కానీ, స్థిరాస్తులు కానీ లభిస్తాయి. బ్యాంకు లోను కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ, ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ ఈ సమయంలో వారి అవసరాలకు తగిన డబ్బు లభిస్తుంది. కేతు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు. అలాగే ఆరోగ్య విషయంగా కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం, కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్ధంలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ, ద్వితీయార్ధంలో కుటుంబ జీవితం సంతోషంతో నిండి ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన, ఏడవ ఇంట రాహువు గోచారం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ కారణంగా మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. దాని కారణంగా భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య అకారణమైన అపోహలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అహంకారం కారణంగా కానీ, ఇతరులు మీ మధ్య అపోహలు రేపడం వల్ల కానీ ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని సహనంతో ఎదుర్కొని మీ సమస్యలను తొలగించు కుంటారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం ఐదవ ఇంటిలో అనుకూలంగా ఉండటం, రాహు గోచారం ఆరవ ఇంటికి మారడం వలన కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ సంతానం అభివృద్ధి లోకి వస్తుంది. వారి విషయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ సమయంలో వివాహం కాని వారికి కానీ, సంతానం కానీ వారికి కానీ అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబ పరంగా కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ ఉన్నవారికి ఈ సమయంలో లో విజయం లభిస్తుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో శని గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన కుటుంబంలో సమస్యలు రావడం కానీ, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం దెబ్బతినటం కానీ జరగవచ్చు. అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తొందరగానే తగ్గిపోతాయి. మీలో ఆధ్యాత్మికత, దైవ చింతన ఈ సంవత్సరంలో ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, గురు దర్శనం కానీ చేసుకుంటారు. అంతే కాకుండా, ఈ సమయంలో మీరు గురు ఉపదేశం పొందడం కానీ, లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ చేస్తారు.
ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. గత సంవత్సర కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి. ఏప్రిల్ వరకు శని గోచారం బాగుండటం, ఏప్రీల్ తర్వాత గురు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఉండవు. ఏప్రిల్ వరకు గురు గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం, రాహు మరియు కేతువు గోచారం కూడా అనుకూలంగా ఉండకపోవటం వలన, కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శారీరక ఆరోగ్య సమస్యల కంటే, మానసిక ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా లేని భయాలను ఊహించుకోవటం, లేని రోగాలు ఉన్నవి గా భావించి భయపడటం చేస్తారు. ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోవడం వలన అనవసరమైన సమస్యలకు లోనవుతారు. కాలేయం, వెన్నెముక, మూత్రపిండాలు మొదలైన సంబంధించి సాధారణ సమస్యలు ఈ సమయంలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమస్యలను పెద్దగా ఊహించుకొని, ఎక్కువ మందులు వాడటం కానీ, ఎక్కువమంది వైద్యులను సంప్రదించడం కానీ చేస్తారు. దాని వలన అనవసరమైన ఆందోళనకు గురి అవుతారు. ఏప్రిల్ లో గురువు ఇంటికి రావటం, రాహు కేతువులు కూడా రాశి మారటం వలన ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. గురు దృష్టి లగ్నం పై ఉండటం వలన మీలో ధైర్యం పెరగడమే కాకుండా, మానసిక ఆందోళనలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. సరైన వైద్యం అందడం కానీ, సరైన సలహాలు పాటించడం కానీ చేయడం వలన ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిగతా సంవత్సరమంతా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా బాధించవు .
వృశ్చికరాశిలో జన్మించిన వ్యాపారస్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గత కొద్ది కాలంగా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్న మీకు ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా మారటంతో ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఏప్రిల్ వరకు గురువు మరియు రాహు గోచారం కొంత వ్యతిరేకంగా ఉండటం వలన వ్యాపారంలో సమస్యలు ఎదుర్కుంటారు. భాగస్వాముల వలన కానీ, ఇతర వ్యక్తుల వలన కాని ఈ సమయంలో మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరపడి ఎవరినీ నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టకండి. ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ రిస్కు చేయటం మంచిది కాదు. ఏప్రిల్ లో గురువు తో పాటుగా రాహు, కేతువులు రాశి మారటంతో వ్యాపార పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార సంబంధ వివాదాలు కానీ, కోర్టు కేసులు గాని మీకు అనుకూలంగా ముగుస్తాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకునే వారు, మోసం చేయాలనుకునేవారు నష్టపడతారు. గురు దృష్టి లాభ స్థానం పై మరియు భాగ్య స్థానం పై ఉండటం వలన పెట్టిన పెట్టుబడులు, మీరు చేసిన శ్రమకు, అదృష్టం కలిసి వచ్చి వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు అనుకునేవారు, లేదా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలనుకునే వారు జూలై వరకు ఆగటం మంచిది. ఇది ఏప్రిల్లో గురు గోచారం అనుకూలంగా మారినప్పటికీ, శని గోచారం ఏప్రిల్ నుంచి జులై మధ్యలో అనుకూలంగా ఉండదు కాబట్టి ఇటువంటి వాటిని శని తిరిగి మూడవ ఇంటికి వచ్చాక చేసుకోవడం మంచిది. దాని వలన నష్టపోయే అవకాశాలు తక్కువ అవుతాయి. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించేవారు, కళాకారులు ఈ సంవత్సరం మంచి అవకాశాలను పొందుతారు. గత కొద్ది కాలంగా సరైన అవకాశాలు గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్న మీకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి గురు గోచారం ఐదవ ఇంట్లో ఉండటం వలన మీ సృజనాత్మకతకు, మీ అదృష్టం తోడై మీకు ఆర్థిక లాభాలతో పాటుగా మంచి గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం సన్మానాలు, సత్కారాలు పొందుతారు. రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీ వృత్తిలో చాలా కాలం నుంచి చేయాలనుకున్న పనులను విజయవంతంగా చేయడమే కాకుండా ప్రజల మన్ననలు కూడా అందుకుంటారు. మీ కళకు, నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో శని గోచారం అనుకూలంగా ఉండవు కాబట్టి ఎక్కువ కష్టపడడం వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వచ్చిన అవకాశాల్లో మంచి వాటిని మాత్రమే ఎన్నుకొని, తగిన విశ్రాంతి కూడా తీసుకుంటే ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా ఈ సంవత్సరంలో మంచి అభివృద్ధి సాధిస్తారు.
వృశ్చిక రాశి లో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు, రాహువు, మరియు కేతువుల గోచారం అనుకూలంగా లేకపోవడం వలన చదువు విషయంలో నిర్లక్ష్యం, మరియు వాయిదా వేసే స్వభావం, విద్యార్థులలో ఎక్కువ అవుతాయి దానివలన చదువులో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమస్యల నుంచి బయటపడటానికి అవకాశాలు వస్తాయి. ఏప్రిల్ వరకు చదువులో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ ఏప్రిల్లో గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన చదువులో బాగా రాణిస్తారు. గతంలో ఉన్న బద్ధకం కానీ, వాయిదా వేసే స్వభావం కాని తగ్గుతాయి. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న కోరిక పెరుగుతుంది. విదేశాలలో ఉన్నత విద్య కొరకు ప్రయత్నిస్తున్న వారు ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో అనుకూలమైన ఫలితం పొందుతారు. వారు కోరుకున్న విధంగా మంచి విద్యాసంస్థల్లో వారికి ప్రవేశం లభిస్తుంది. అలాగే గురువుల మరియు పెద్దల ఆశీర్వచనం తో వారి వారి విద్యల్లో బాగా రాణించగలుగుతారు. గత కొద్ది కాలంగా భయాల కారణంగా కానీ, ఆరోగ్య సమస్యల వల్ల కానీ చదువులో అడ్డంకులు వచ్చినవారు ఈ సంవత్సరం విద్యను నిరాటంకంగా పూర్తి చేయగలుగుతారు. గురు దృష్టి లగ్నం పై ఉండటం వలన వారిలో ధైర్యం, నమ్మకం పెరుగుతాయి. వారి శ్రమకు, దైవానుగ్రహం కూడా తోడై పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థం, ముఖ్యంగా జూలై తర్వాత బాగా అనుకూలిస్తుంది. వారు పడిన శ్రమకు తగిన ఉద్యోగం వారికి లభిస్తుంది.
ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు గురు మరియు రాహు, కేతువుల గోచారం అనుకూలంగా ఉండదు. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ గ్రహాలకు ఆయా సమయాల్లో పరిహారాలు ఆచరించడం వలన అవి ఇచ్చే సమస్యలు దూరం అవుతాయి. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో గురువు నాలుగవ ఇంటిలో ఉండటం వలన ఆరోగ్య సమస్యలు, వృత్తి పరంగా సమస్యలు మరియు చదువులో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రతి రోజు గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ, గురు చరిత్ర పారాయణం చేయడం కానీ మంచిది. ఈ సమయంలో రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు రాహు స్తోత్రం కానీ, దుర్గా స్తోత్రం కానీ చదవడం మంచిది. అలాగే ఆరోగ్య సమస్యలు తగ్గడానికి, ఆటంకాలు తొలగిపోవడానికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవి కి దీపారాధన చేయటం మంచిది. కేతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు గణపతి స్తోత్రం చదవడం మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఏప్రిల్ నుంచి జులై మధ్యలో శని గోచారం నాలుగవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజూ శని స్తోత్ర పారాయణం చేయటం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం కానీ మంచిది. దీని వలన ఈ సమయంలో వృత్తిలో వచ్చే సమస్యలు, ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.
Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Hindi.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.
Read More
People living in other countries, contribute via PayPal.