Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2022 samvatsara Mithuna rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Mithuna Rashi in Telugu

మృగశిర 3,4 పాదములు (కా,కి),
ఆరుద్ర 1,2,3,4 పాదములు(కు, ఘ, ఙ, ఛ)
పునర్వసు 1,2,3 పాదములు (కే,కో, హా)
ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి, 10వ ఇంటిలోకి, మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో, 11వ ఇంటిలోకి రాహువు మరియు తులారాశిలో, 5వ ఇంటిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి, 9వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి, 8వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.
ఈ సంవత్సరం మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అంతే కాకుండా చేసే పనికి సరైన గుర్తింపు రాకుండా ఉండటం మరియు సహోద్యోగుల నుంచి వ్యతిరేకత కాని సరైన సహకారం అందకపోవడం గాని జరగవచ్చు. ఈ సమయంలో మీ సహనాన్ని పరీక్షించే ఈ విధంగా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది వాటిని మీరు విజయవంతంగా ఎదుర్కొంటారు. మిమ్మల్ని తక్కువ చేసి చూసే వారిని పట్టించుకోక పోవడం వలన వలన మానసికంగా ప్రశాంతతను పొందుతారు. గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన, మీ పై అధికారుల సహాయం లభించడమే కాకుండా, దైవానుగ్రహం కారణంగా కూడా, మీకు ఏర్పడిన సమస్యల నుంచి బయట పడగలుగుతారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి లేదా కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది. శని దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీ పని విషయంలో, మీ ప్రవర్తనలో, ఇతరుల ప్రభావం అధికంగా ఉండటం వలన, మీరు తరచుగా అసహనానికి, కోపానికి గురవుతారు గురవుతారు. చేసే పనిలో అడ్డంకులు ఎదురవడం, పనులు ఆలస్యంగా జరగటం మొదలైనవి జరిగినప్పటికీ, మొదలుపెట్టిన పనులను సహనంతో పూర్తి చేయగలుగుతారు. కొన్నిసార్లు ఇతరుల ప్రలోభాలకు లోనై తప్పులు చేసినప్పటికీ, తొందరగానే వాటిని సరిదిద్దుకో గలుగుతారు. ఏప్రిల్ లో, రాహువు, కేతువు, గురువు మరియు శని రాశులను మారటం వలన, గత కొద్ది రోజులనుంచి ఉన్న చాలా సమస్యలు, తొలగిపోతాయి. మానసిక సమస్యలు, ఆందోళనలు తొలగిపోయి ఉత్సాహంతో పనులు పూర్తి చేయగలుగుతారు. పదవ గురువు గోచారం కారణంగా వృత్తి లో మార్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతి పొందడం కానీ, వేరే వృత్తిలోకి మారడం కానీ జరుగుతుంది. దీని వలన గతంలో ఉన్న పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది. విశ్రాంతి సమయం దొరుకుతుంది. గతంలో ఏర్పడిన అవమానాలు కానీ, పుకార్లు కానీ తొలగిపోయి మీ నిజాయితీ నిరూపించబడుతుంది. మీ సహోద్యోగులు సహాయ సహకారాలు తిరిగి పొందగలుగుతారు. జూలై తర్వాత వక్రగతుడైన శని అష్టమ స్థానంలో తిరిగి సంచరించడం వలన వృత్తిలో కొన్ని మార్పులు చోటు చేసుకొని అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. అయితే ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు.
మిధున రాశిలో జన్మించిన వారికి, ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు ఆర్థిక పరిస్థితి కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఏప్రిల్ నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. రాహు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన, మీరు అనవసరమైన వాటిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గొప్పలకు పోయి విలాసాల కొరకు కూడా డబ్బు ఖర్చు చేస్తారు. ఈ సమయంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి డబ్బు ఖర్చు చేసినప్పటికీ తగినంత ఆదాయం ఉండటం వలన ఆర్థిక పరిస్థితి దిగజారి పోదు. అయితే తొందరపడి పెట్టుబడి పెట్టిన వాటి వలన ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కుటుంబ సభ్యుల కొరకు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కొరకు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంటిలో జరిగే శుభకార్యాల కారణంగా కూడా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడి నుంచి ఈ సమయంలో మంచి లాభాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు. ఏప్రిల్లో రాహువు 11వ ఇంటికి రావడం, గురు దృష్టి 6వ మరియు రెండవ ఇంటిపై ఉండటం వలన ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు ఆర్జిస్తారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఇల్లు కాని, వాహనం కానీ, కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ జూలై మధ్యలో శని గోచారం కూడా కొంత అనుకూలంగా ఉండటం వలన గతంలో నష్ట పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రయాణాల కారణంగా కూడా మీరు డబ్బు ఖర్చు చేస్తారు. లాభ స్థానంలో రాహు ఏప్రిల్ తర్వాత నుంచి ఆర్థిక సమస్యలు తొలగించడమే కాకుండా ఆర్థికంగా మెరుగైన పరిస్థితి కల్పిస్తాడు. గతంలో చేసిన అప్పులు కానీ, లోన్లు కానీ ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో తీర్చ గలుగుతారు.
ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంత మెరుగుగా ఉంటుంది. ఏప్రిల్ వరకు రాహు, కేతు మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంటుంది. అయితే లగ్నం పై గురు దృష్టి కారణంగా ఈ సమస్యల నుంచి తొందరగా బయట పడగలుగుతారు. 12వ ఇంటిలో, రాహు గోచారం కారణంగా, నరములు, మెడ, మరియు గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధ పడే అవకాశం ఉంటుంది. రాహు మరియు కేతువు అంటురోగాలకు మరియు క్రిమి సంబంధం రోగాలకు కారకులు కాబట్టి, వీటి విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. అష్టమ శని కారణంగా ఎముకలు మరియు మూత్ర పిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు వచ్చినప్పటికీ ఇవి మిమ్మల్ని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టవు. గురు గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పిన సమస్యల్లో చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టక పోవచ్చు. ఏప్రిల్ తర్వాత రాహు, కేతువుల గోచారం అనుకూలంగా ఉండటం, గురు దృష్టి ఆరవ ఇంటికి ఉండటం వలన ఆరోగ్యపరంగా ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా పదకొండవ ఇంటిలో రాహువు గోచారం మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ద్వితీయార్ధంలో అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ, అది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేయదు. ఆరోగ్య విషయంలో, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తలు పాటించడం, బయట భోజనాలు ఎక్కువ చేయకపోవడం, అలాగే శారీరక వ్యాయామాలు, యోగా, ధ్యానం మొదలైనవి చేయటం వలన మిమ్మల్ని మీరు రక్షించుకో గలుగుతారు.
ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ప్రథమార్ధం కంటే ద్వితీయార్థం బాగా అనిపిస్తుంది. ఏప్రిల్ వరకు రాహు మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన, వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులకు గురికావలసి వస్తుంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. సరైన అవగాహన, పరిశోధన లేకుండా ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం అంత మంచిది కాదు. తొందరపడి చేసిన పెట్టుబడుల కారణంగా ఆర్థికంగా నష్టపోవడం కానీ లేదా వ్యాపారంలో ఇబ్బందులు రావడం కాని జరగవచ్చు. మీ వ్యాపార భాగస్వాములు కానీ, ఇతరులు కానీ మిమ్మల్ని వారి సలహాలు పాటించడానికి ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఏ సలహా అయినా కూడా పాటించే ముందు ఓపికతో ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. అష్టమ శని కారణంగా వ్యాపార భాగస్వామి తో సమస్యలు రావడం కానీ లేదా వారి ద్వారా మోసపోవడం కానీ జరగవచ్చు. మీతో భాగస్వామిగా వ్యాపారం చేయాలని మోసపూరితమైన ఆలోచనతో కొంతమంది మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి తప్పుడు వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఇటువంటి వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఏప్రిల్లో రాహువు పదకొండవ ఇంటికి రావటం అలాగే గురు దృష్టి ధన స్థానంపై ఉండటంవలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చి మీకు లాభాలను వ్యాపార అభివృద్ధి ఇస్తాయి. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారు, కళాకారులు మొదలైనవారు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. ఏప్రిల్ వరకు అవకాశాలు వచ్చినప్పటికీ ఆర్థికంగా పెద్ద ఎదుగుదల ఉండదు. కొన్నిసార్లు తక్కువ డబ్బులకు మీరు పనిచేయాల్సి రావచ్చు. అయితే ఏప్రిల్లో రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీరు మీ పనిలో బిజీ అవడమే కాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధిని సాధిస్తారు. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. అయితే అష్టమ శని కారణంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసే పనిలో నిజాయితీగా ఉండటం మంచిది.
కుటుంబ పరంగా ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఎక్కువగా అనుకూలిస్తుంది. ప్రథమార్ధంలో ఏప్రిల్ వరకు శని మరియు రాహువు గోచారం అనుకూలంగా లేనందువలన కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో వృద్ధులకు ఆరోగ్య సమస్యలు రావడం, అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో, కొన్ని అపోహల కారణంగా గొడవలు ఏర్పడటం జరగవచ్చు. ముఖ్యంగా మీ విషయంలో ఇతరుల జోక్యాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. మీ మీద ఈర్ష్యతో గురించి మీ జీవిత భాగస్వామికి తప్పుడు విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటివి ఏర్పడ్డప్పుడు వీలైనంత తొందరలో ఆ అపోహల్ని తొలగించు కోవటం మంచిది. దానివలన సమస్య పెద్దది కాకుండా ఉంటుంది. అయితే ఈ సమయంలో లో గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు సమస్యలు సృష్టించిన వారిని గుర్తించి వారికి దూరంగా ఉండడం జరుగుతుంది. ఏప్రిల్లో రాహు గోచారం అనుకూలంగా ఉండటం అలాగే గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన, కుటుంబంలో వృద్ధి జరగుతుంది, అలాగే శుభకార్యాలు జరగడం వలన గతంలో ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోతాయి. మీ మాటకు విలువ పెరగడమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు పొందుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ప్రథమార్ధంలో మీ సోదరులు లేదా మీ బంధువుల కారణంగా ఒక సమస్య నుంచి బయట పడగలుగుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర కానీ, ఆధ్యాత్మిక ప్రదేశ సందర్శనం కానీ చేస్తారు. ఏప్రిల్ మరియు జులై మధ్యలో శని గోచారం శని గోచారం తొమ్మిదవ ఇంట్లో ఉండటం వలన మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ తర్వాత పంచమ స్థానం పై కేతు గోచారం కారణంగా సంతానం కు ఆరోగ్య సమస్యలు కానీ లేదా మనస్పర్థలు గాని వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ స్థానంపై గురు దృష్టి కారణంగా ఈ సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టకుండా తగ్గిపోతాయి.
ఈ సంవత్సరం మిధున రాశిలో జన్మించిన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్ధంలో గురువు చాలా అనుకూలంగా ఉండటం, ద్వితీయార్ధంలో గురువుతో పాటు రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరగడమే కాకుండా, పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. అయితే ఏప్రిల్ వరకు రాహు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన, కొంత అలసత్వము, చదువు విషయంలో నిర్లక్ష్యం ఏర్పడతాయి. దీని వలన పరీక్షల విషయంలో కొంత భయానికి ఆందోళనకు గురవుతారు. అయితే గురు దృష్టి ఒకటవ ఇంటిపై, అయిదవ ఇంటిపై అనుకూలంగా ఉండటం వలన, గురువుల లేదా పెద్దవారి సహాయ సహకారాలతో, విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఏప్రిల్ నుంచి గురు గోచారం పదవ ఇంటిలో, రాహు గోచారం పదకొండవ ఇంటిలో ఉండటంతో చదువులో రాణిస్తారు. అనుకున్న ఫలితం అనుకున్న విధంగా రావడంతో కొంత గర్వానికి, అహంకారానికి లోనవుతారు, దాని కారణంగా ఉన్నత విద్య విషయంలో తప్పటడుగులు వేసే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు సహనంతో, వినయంతో ఉండటంవలన , తప్పు చేయకుండా సరైన మార్గంలో ఉన్నత విద్యను పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలు రాసే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఏ కాకుండా ఉద్యోగాన్ని కూడా సంపాదిస్తారు. పరీక్షలు రాసే సమయంలో ఆందోళనకు గురి కాకుండా ఏకాగ్రతతో, నమ్మకంతో రాయటం మంచిది.
ఈ సంవత్సరం ప్రథమార్ధంలో రాహువు, సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ రెండు గ్రహాలకు పరిహారాలు ఆచరించడం మంచిది. దీని కారణంగా ఈ సంవత్సరంలో వచ్చే ఆరోగ్య, ఆర్థిక సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు తగ్గిపోయి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. రాహువు గోచారం ఏప్రిల్ వరకు పన్నెండవ ఇంటిలో అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు రాహు స్తోత్రం పారాయణం చేయడం కానీ, దుర్గా స్తోత్రం పారాయణం చేయడం కానీ మంచిది. ఇవే కాకుండా రాహు మంత్ర జపం 18 వేలసార్లు చేయటం లేదా రాహు గ్రహ శాంతి చేయటం మంచిది. శని గోచారం ఏప్రిల్ - జులై మధ్యలో తప్ప మిగిలిన సంవత్సరమంతా అష్టమ స్థానంలో ఉంటుంది కాబట్టి అష్టమ శని అవమానాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వృత్తిలో సమస్యలు తొలగించుకోడానికి ప్రతిరోజు శని సంబంధ స్తోత్ర పారాయణం చేయడం కానీ, లేదా హనుమాన్ చాలీసా లేదా వెంకటేశ్వర సంబంధ స్తోత్ర పారాయణం చేయడం కానీ చేయడం మంచిది. లేదా శని మంత్ర జపం 19 వేల సార్లు చేయడం, లేదా శని గ్రహ శాంతి జరపటం మంచిది. దానివలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. వీటితో పాటుగా శని దోష నివారణకు శారీరక శ్రమ చేయటం, వృద్ధులకు, వికలాంగులకు సాయం చేయడం మంచిది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.
Free Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.
Read MoreCheck May Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.
Read MoreCheck your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.
Read More
People living in other countries, contribute via PayPal.