Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2022 samvatsara Tula rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Tula Rashi in Telugu

చిత్త 3, 4 పాదాలు (ర,రి),
స్వాతి నాలుగు పాదాలు (రు, రె, రో,త),
విశాఖ 1, 2, 3 పాదాలు (తి, తు, తే)
ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి, 6వ ఇంటిలోకి, మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో, 7వ ఇంటిలోకి రాహువు మరియు తులారాశిలో, 1వ ఇంటిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి, 5వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి, 4వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.
ఈ సంవత్సరం తులా రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఏప్రిల్ వరకు గురు గోచారం అయిదవ ఇంట్లో ఉండటం వలన ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యం అవటమే కాకుండా ఆర్థికంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. శని గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినప్పటికీ ఫలితం రావడం లో ఆలస్యం అవటమే కాకుండా దానికి తగిన గుర్తింపు కూడా రాకపోవచ్చు. దానివలన మీరు నిరాశా నిస్పృహలకు, అసహనానికి గురి అవుతారు. వృత్తిలో అభివృద్ధి వచ్చినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతుంటారు. అయినప్పటికీ మీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తారు. దాని కారణంగా కుటుంబ జీవితానికి దూరం అవుతారు. ఏప్రిల్లో గురువు, శని రాహువు, మరియు కేతువు గోచారం మారటం వలన ఈ పరిస్థితులలో కొంత అనుకూలమైన మార్పు వస్తుంది. గతంలో ఉన్న పని ఒత్తిడి వలన కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే గతంలో చేసిన కొన్ని పనుల కారణంగా ఉద్యోగంలో మార్పు జరుగుతుందేమో అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గోచారం ఐదవ ఇంట్లో ఉండటం వలన మీరు చేసే పనుల్లో ఆలస్యం తగ్గినప్పటికీ ఈ సమయంలో మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశాలు కూడా తగ్గుతాయి. దాని వలన వృత్తిలో అభివృద్ధి కొరకు కొంత కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ సహోద్యోగులు కానీ, మీకు నష్టాలు చేయాలనుకునేవారు కానీ ఈ సమయంలో మీ గురించి చెడుగా గోచారం చేసే అవకాశం ఉంటుంది. అటువంటి వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేయకూడదు. జూలైలో శని గోచారం తిరిగి నాలుగో ఇంటికి రావటం వలన కొంతకాలంగా తక్కువగా ఉన్న పని ఒత్తిడి మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఈ సమయంలో పేరు ప్రతిష్టల కొరకు పని చేసే అవకాశం ఉంటుంది. చేసే ప్రతి పనికి గుర్తింపు రావాలని బలమైన కోరికతో పని చేయడం వలన పని పై శ్రద్ధ తగ్గి ఇతర విషయాలపై శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది. గురు దృష్టి రెండు మరియు పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తి పరంగా ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఫలితం పై దృష్టి పెట్టకుండా మీరు చేసే పని నిజాయితీగా చేయడం వలన ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందుతారు.
ఈ సంవత్సరం తులా రాశి వారికి ప్రథమార్ధంలో ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో కొంత సామాన్యంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా గా అనుకూలంగా ఉంటుంది. గురు దృష్టి స్థానంపై ఉండటంవలన చేసే పని కారణంగా ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా, మీరు గతంలో చేసిన పెట్టుబడి నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి. దీని కారణంగా ఆర్థికంగా మెరుగైన స్థితి పొందుతారు. అయితే ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను, గొప్పలకు పోయి ఖర్చులను తగ్గించుకోకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏప్రిల్లో నాలుగు గ్రహాలు మారడం వలన ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుంది. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరగడం వలన డబ్బు పొదుపు చేసే అవకాశాలు తగ్గుతాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో శని దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన లాభాలు తగ్గుతాయి అంతేకాకుండా పెట్టుబడులు ద్వారా వచ్చే లాభాలు కూడా గతంలో వచ్చినట్టుగా కాకుండా కొంత తగ్గుతాయి. తిరిగి జులై నుంచి శని గోచారం నాలుగు ఇంటికి మారటం వలన ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో ఆరోగ్య విషయంలో, కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శుభకార్యాలకు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు పెడతారు. తర్వాత పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. గురు గోచారం మధ్యమంగా ఉంటుంది కాబట్టి పెట్టుబడుల విషయంలో తొందర పడకుండా డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది.
కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం బాగుంటుంది కాబట్టి మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ లేదా అనుకూల వాతావరణం ఉండడం కానీ జరుగుతుంది. మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు. వారి కారణంగా మీరు ఆనందాన్ని పొందుతారు. ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహం కాని, సంతానం కాని వారికి సంతానం అవటం కానీ జరగవచ్చు. శని గోచారం మరియు రాహు గోచారం ఈ సమయంలో అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు పని ఒత్తిడి కారణంగా ఎక్కువ సమయం కుటుంబంతో గడిపే అవకాశం ఉండదు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య లేదా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో కొంత భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసరమైన అపోహల కారణంగా వారితో సమస్యలు ఏర్పడవచ్చు. అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. ఏప్రిల్లో గురువుతో పాటుగా నాలుగు గ్రహాలు రాశులు మారటం వలన కుటుంబంలో మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఉద్యోగ రీత్యా వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. దాని కారణంగా కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండటం జరుగుతుంది. అలాగే ఏడవ ఇంట రాహువు గోచారం కారణంగా భార్యాభర్తల మధ్య లో అవగాహన లోపిస్తుంది. సంబంధం లేని విషయాల గురించి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే అహంభావం కారణంగా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహకారం వలన ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో మీ సంతానానికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా వారి కారణంగా ఇబ్బందులు రావడం కానీ జరుగుతుంది. దాని కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. అకారణంగా కుటుంబ సభ్యుల విషయంలో ఎక్కువ ఆందోళన పడటం అతి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. దాని కారణంగా కుటుంబ సభ్యులకు మీ విషయంలో కొంత చికాకు ఏర్పడటం కానీ లేదా మీపై కోపానికి రావడం కానీ జరుగుతుంది. మీ రాశి పై కేతు గోచారం కారణంగా ఇలాంటి భయాలు, ఆందోళనలు ఎక్కువ ఉంటాయి కానీ వీటి విషయంలో ఎక్కువగా భయపడవలసిన అవసరం లేదు. చాలా వరకు అవి కేవలం భయాలు గానే ఉంటాయి తప్ప నిజాలు కావు.
తులా రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో శని మరియు రాహువు కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి వచ్చిన సమస్యలు తొందరగా తగ్గుతాయి. అయితే ఈ సమయంలో ఆహారం విషయంలో అలాగే పని విషయంలో కొంత జాగ్రత్త అవసరం మీ ఉద్యోగం కారణంగా విశ్రాంతి లేకుండా పని చేయాల్సి రావడం అలాగే సమయానికి భోజనం చేయకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మెడ, కడుపు, వెన్నెముక సంబంధ ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే గురు దృష్టి లగ్నం పై ఉండటం వలన తొందరగా వీటి నుంచి బయట పడగలుగుతారు. ఏప్రిల్ లో గురువు ఆరవ ఇంటికి రావడం, కేతువు ఒకటవ ఇంటికి, రాహువు ఏడవ ఇంటికి మారడం వలన ఆరోగ్య విషయంలో ఈ మార్పులు చోటు చేసుకుంటాయి. శారీరక ఆరోగ్యం కొంత మెరుగు పడుతుంది. అయితే కేతువు గోచారం కారణంగా ఈ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. డిప్రెషన్ కానీ, ఒంటరితనం అనే భావన కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన మీ కుటుంబం యొక్క సహకారంతో మీ మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయట పడగలుగుతారు. ఈ సమయంలో వీలైనంతవరకూ ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోవడం వలన మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంతగా మీ ఆరోగ్యం బాగుంటుంది.
తులా రాశి లో జన్మించిన వ్యాపారస్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత అనుకూలంగా ద్వితీయార్థం సామాన్యంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధి జరగడమే కాకుండా ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడితో పాటు ఆర్థికాభివృద్ధి కూడా ఉంటుంది కాబట్టి పని ఒత్తిడిని పట్టించుకోకుండా ఉంటారు. ఏప్రిల్ గురువు తో కలిపి నాలుగు గ్రహాలు రాశులు మారటంతో తో వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ మరియు జూలై మధ్య శని పంచమ స్థానంలో ఉండి ఏడవ ఇంటిని చూడటం వలన వ్యాపారంలో కొంత తగ్గుదల ఏర్పడుతుంది. మీ భాగస్వామి నుంచి వచ్చే సహాయ సహకారాలు కూడా తగ్గటం వలన లాభాల శాతం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార భాగస్వాములతో మనస్పర్థలు ఏర్పడటం కానీ లేదా వారు విడిపోవడం కానీ జరుగుతుంది. దానివలన మీకు మరింత పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకూ సంయమనం పాటించి ఎదుటివారిని అర్థం చేసుకొని ప్రవర్తించడం వలన చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకానీ అతి జాగ్రత్త వలన మీ భాగస్వామి మనసు నొప్పించి వారికి దూరంగా ఉండటం వలన వ్యాపారంలో ఇబ్బందులు చదువుకునే అవకాశం ఉంటుంది. గురు దృష్టి ధన స్థానంపై ఉంటుంది కాబట్టి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించారు అనుకునేవారు ఏప్రిల్లోపు ప్రారంభం చేయటం మంచిది ఆ తర్వాత గురు గోచారం సామాన్యంగా ఉంటుంది కాబట్టి కొత్త పెట్టుబడులకు, వ్యాపార ప్రారంభాలకు అంతగా అనుకూలంగా ఉండదు. సప్తమ స్థానంలో రాహు గోచారం వ్యాపార విషయంలో తెగింపును, పట్టుదల ను ఇస్తుంది కానీ అది వ్యాపారంలో లాభాల కంటే నష్టాలను, సమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో పట్టుదలకు పోకుండా ఉండటం మంచిది. ఇతరులు మీకు చేసే నష్టం కంటే మీకు మీకు మీరే చేసుకునే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిపుణుల లేదా అనుభవజ్ఞుల సలహాల మేరకు నిర్ణయం తీసుకోవటం మంచిది. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి కళాకారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్ధంలో మంచి అవకాశాలు రావడమే కాకుండా మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ తర్వాత జూలై వరకు శని గోచారం ఇంట్లో ఉండటం రాహు గోచారం ఏడవ ఇంట ఉండటం వలన అవకాశాల విషయంలో కొంత కష్టపడాల్సి రావచ్చు. ఈ సమయంలో గర్వాన్ని కానీ, అహంకారాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. ద్వితీయార్ధంలో మీకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక పోవటం వలన పేరు ప్రతిష్టల విషయంలో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ గురించి తప్పుగా చెప్పేవారు కానీ, మీకు వచ్చిన అవకాశాలను లాగేసుకుని వారు కానీ ఈ సమయంలో ఎక్కువ అవుతారు. అటువంటి వారిని గుర్తించి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. గురు దృష్టి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
తులా రాశి లో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పరీక్షలలో మంచి మార్కులు రావడమే కాకుండా అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశాన్ని కూడా పొందుతారు. అయితే ఈ సమయంలో బద్ధకం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి వచ్చిన అవకాశాలను వ్యర్థం చేయకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం మంచిది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన బద్ధకం తగ్గుముఖం పట్టినప్పటికీ పరీక్షలలో కానీ చదువులో కానీ అనుకున్నంత స్థాయిలో రాణించక పోవటం జరగవచ్చు. కానీ పట్టుదల వీడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. గురు దృష్టి రెండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి పరీక్షలో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ మంచిగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి సంవత్సర ద్వితీయార్ధంలో అనుకున్న ఫలితం లభిస్తుంది. వీరు భయాన్ని, అపనమ్మకాన్ని విడిచిపెట్టి చదవటం వలన అనుకున్న ఫలితాన్ని పొందుతారు. జూలై తరువాత శని గోచారం తిరిగి నాలుగవ ఇంటిలో ఉంటుంది కాబట్టి చదువు విషయంలో ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది.
తులారాశి వారు ఈ సంవత్సరం గురువు, శని, రాహువు మరియు కేతువులకు పరిహార క్రియలు ఆచరించడం మంచిది. దీని వలన ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో మరియు ఆర్థికంగా ఈ గ్రహాలు ఇచ్చే చెడు ప్రభావం ఉంటుంది ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహ దోష నివారణకు ప్రతిరోజు గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ లేదా గురు చరిత్ర పారాయణం చేయడం మంచిది. లేదా 16,000 సార్లు గురు మంత్ర జపం కానీ, గురు గ్రహ శాంతి హోమం కానీ చేయడం వలన గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు శని స్తోత్ర పారాయణం చేయటం కానీ, లేదా హనుమాన్ స్తోత్ర పారాయణం చేయడం కానీ చేయాలి. లేదా 19,000 సార్లు శని మంత్ర జపం చేయటం కానీ లేదా శని గ్రహ శాంతి హోమం చేయించడం కానీ మంచిది. వీటితో పాటుగా పేదలకు, ముసలి వారికి, వికలాంగులకు సేవ చేయడం వలన కూడా శని శాంతించి అనుకూల ఫలితాలు ఇస్తాడు. రాహు గ్రహ దోష నివారణకు ప్రతిరోజు రాహు స్తోత్ర పారాయణం చేయటం కానీ, దుర్గా స్తోత్రం పారాయణం చేయడం కానీ మంచిది, లేదా 18 వేల సార్లు రాహు మంత్ర జపం చేయటం కానీ లేదా రాహు గ్రహ శాంతి హోమం చేయటం కానీ మంచిది. కేతు గ్రహ దోష నివారణకు ప్రతిరోజు కేతు మంత్ర జపం చేయడం కానీ, గణపతి స్తోత్రం పారాయణం చేయటం కానీ మంచిది. లేదా ఏడువేల సార్లు కేతు జపాన్ని చేయటం కానీ, కేతు గ్రహ శాంతి హోమం చేయటం మంచిది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.
Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.
Read MoreCheck your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.
Read MoreDetailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.
Read More
People living in other countries, contribute via PayPal.