Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2023 samvatsara Vrishchika rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Vrishchika Rashi in Telugu

విశాఖ 4వ పాదం(తో)
అనురాధ 4 పాదాలు (న, ని,ను, నే)
జ్యేష్ట 4 పాదాలు (నో, య, యి, యు)
ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి ఐదవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఆరవ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశికి మూడవ స్థానమైన మకర రాశి నుంచి, నాలుగవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 న రాహువు ఆరవ స్థానమైన మేష రాశి నుంచి, ఐదవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు పన్నెండవ స్థానమైన తులా రాశి నుంచి పదకొండవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.
వృశ్చిక రాశి వారికి 2023వ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరమంతా శని గోచారం నాలుగవ ఇంటిలో అనుకూలంగా లేకపోవడం, ఏప్రిల్ నుంచి గురువు గోచారం ఆరవ ఇంటిలో సామాన్యంగా ఉండటం వలన ఈ సంవత్సరం ఉద్యోగస్థులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శని గోచారం కారణంగా ద్వితీయార్ధంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం, మరియు రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృత్తిలో అభివృద్ధి సాధ్యమౌతుంది. ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు విజయవంతం అవటమే కాకుండా మీ పై అధికారుల మెప్పును మరియు పదోన్నతిని ఇస్తాయి. మీ ఆలోచనలు మీరు పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడతాయి. గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీరు ఉత్సాహంగా పని చేయడమే కాకుండా మీ సహోద్యోగులను కూడా ఉత్సాహంగా, ఆనందంగా ఉంచుతారు. గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన మీకు ఉద్యోగం విషయంలో అదృష్టం కలిసి రావటమే కాకుండా మీరు విదేశాలకు వెళ్లడం కానీ, మీరు అనుకున్న పదోన్నతి సాధించడం కానీ సాధ్యమవుతుంది. ఈ సమయంలో రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీ అభివృద్ధిలో మీ సహోద్యోగుల సాయం కూడా తోడ్పడుతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో మీకు దూరం అవుతారు. దాని కారణంగా మీరు ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా లేనప్పటికీ ఏప్రిల్ వరకు గురువు గోచారం, నవంబర్ వరకు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన శని ఇచ్చే చెడు ప్రభావం కొంత మేరకు తగ్గుతుంది. శని దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీరు పడిన కష్టానికి కొన్నిసార్లు సరైన ఫలితం రాకపోవడం కానీ, సరైన గుర్తింపు రాకపోవడం కానీ జరగవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీరు నిరాశకు లోనుకాకుండా, మీరు చేసే పనిపై దృష్టి పెట్టినట్లయితే మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. శని దృష్టి ఆరవ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సర ద్వితీయార్ధంలో మీరు చేసే పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా కొన్నిసార్లు నిరాశకు లోనవుతారు. కొన్నిసార్లు మీ స్వయంకృతాపరాధాల వల్ల కూడా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఏ పని అయినా నిజాయితీగా చేయటం మరియు ఫలితంపై దృష్టి పెట్టకపోవడం వలన మీరు ఎటువంటి ఇబ్బందులకు లోనుకాకుండా మీ ఉద్యోగాన్ని చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఉద్యోగంలో అనుకోని విధంగా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా సంవత్సరం చివరలో ఇటువంటి మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీరు కొన్నిసార్లు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించ లేకపోతారు. మీకు పనులను వాయిదా వేసే స్వభావం కనబడటం, లేదా ఇంకా బాగా చేయాలనే ఆలోచనతో చేసిన పని మళ్లీ మళ్లీ చేయటం వలన కూడా మీ పై అధికారుల దృష్టిలో మీరు ఏ పని చేయని వారిగా గుర్తించబడతారు. ఈ సంవత్సరం నాలుగవ ఇంటిలో శని గోచారం కారణంగా మీకు ఇష్టం లేకున్నప్పటికీ దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావచ్చు. అయితే రాహు గోచారం సంవత్సరం చివరి వరకూ బాగుంటుంది కాబట్టి ప్రారంభంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ తర్వాత సమయంలో మీరుండే ప్రదేశం అనుకూలంగా ఉండటం వలన మీ ఉద్యోగాన్ని సక్రమంగా చేయగలుగుతారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 మధ్యలో జూన్ 15 నుంచి జూలై 17 మధ్యలో మరియు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 17 మధ్యలో వృత్తిలో ఎక్కువగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తి పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.
2023వ సంవత్సరంలో వ్యాపారస్థులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి సాధించగలుగుతారు. ఏప్రిల్ వరకు గురువు దృష్టి పదకొండవ ఇంటిపై, ఒకటవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు, పనులు విజయవంతం అవడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది. గురువు ఐదవ ఇంటిలో సంచరించడం వలన మీరు పెట్టే పెట్టుబడుల్లో కూడా లాభాలు రావటం జరుగుతుంది. భాగ్య స్థానంపై గురు దృష్టి అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో మీకు అదృష్టం కూడా కలిసి వచ్చి మీరు చేసే వ్యాపారం లో అభివృద్ధితో పాటు కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా వస్తుంది. ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాముల సహకారం కూడా కలిసి రావడంతో మీరు మరింత అభివృద్ధి సాధించగలుగుతారు. ఈ సంవత్సరమంతా శని దృష్టి పదవ ఇంటిపై, ఆరవ ఇంటిపై మరియు ఒకటవ ఇంటిపై ఉన్నప్పటికీ ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి శని ప్రభావం ఎక్కువగా ఉండదు. ఏప్రిల్లో గురువు గోచారం మారటం వలన కొన్నిసార్లు మీరు వ్యాపార విషయాలలో మూర్ఖంగా ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే నవంబర్ వరకు రాహు గోచారం ఆరవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు తొందరపడి నిర్ణయం తీసుకున్నప్పటికీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మీరు మీ శ్రమతో వ్యాపారంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. శని దృష్టి సంవత్సరమంతా ఒకటవ ఇంటిపై ఉంటుంది కాబట్టి సంవత్సర ద్వితీయార్ధంలో మీరు కొన్నిసార్లు ముఖ్యమైన వ్యాపార ఒప్పందాల విషయంలో అలసత్వం వహించడం వలన వాటిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు వ్యాపార అభివృద్ధికంటే కూడా పేరు ప్రతిష్టల కొరకు ఎక్కువగా శ్రమించడం వలన కూడా వ్యాపారంలో నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. మీ పేరు ప్రతిష్టల కొరకు వ్యాపారానికి పక్కన పెట్టడం వలన, మీ ప్రత్యర్థులు మీకు నష్టం చేయాలని ప్రయత్నించే అవకాశం ఉంటుంది. నవంబర్లో రాహు గోచారం ఐదవ ఇంటికి మారటంతో మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో ఇతరుల మాటలు విని తప్పుడు వ్యాపారాల్లో కానీ, అవసరానికి మించిన డబ్బు కానీ పెట్టుబడి పెట్టి తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా అనుకూలిస్తుంది. ముఖ్యంగా గురు దృష్టి పదకొండవ ఇంటిపై, తొమ్మిదవ ఇంటిపై మరియు ఒకటవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ ఆలోచనల వలన, మీరు పెట్టిన పెట్టుబడుల వలన మంచి లాభాలు ఆర్జిస్తారు. గురు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన మీ భాగ్య అభివృద్ధి జరిగి గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా చాలా విషయాల్లో అదృష్టం కలిసి వచ్చి కూడా ఈ సంవత్సరం ప్రథమార్ధంలో మీరు డబ్బు సంపాదించగలరు. గురు దృష్టి పదకొండవ ఇంటి పై ఉండటం వలన మీరు మీ తోబుట్టువుల వలన మరియు మిత్రుల కారణంగా ఆర్థిక లాభాలను పొందుతారు. గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటంవల్ల సరి అయిన ఆలోచనా విధానం కలిగి ఉండి లాభాలు వచ్చే వాటిలో పెట్టుబడులు పెట్టడం వలన కూడా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా అనుకూలిస్తుంది. ఏప్రిల్ నుంచి గురు గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన అలాగే శని దృష్టి కూడా ఆరవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు అవసరం ఉన్నా లేకున్నా డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విలాసాల విషయంలో అలాగే కుటుంబ అవసరాల విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. గురు దృష్టి 12వ ఇంటిపై ఉండటం వలన మీరు ప్రయాణాల విషయంలో మరియు ఆరోగ్య విషయంలో కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇల్లు కాని, వాహనం కానీ లేదా ఇతర పెట్టుబడుల విషయంలో ఈ సంవత్సరం ప్రథమార్థం ఎక్కువగా అనుకూలిస్తుంది. ద్వితీయార్ధంలో మీరు తొందరపడి పెట్టే పెట్టుబడులు లాభాలకంటే నష్టాలను ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు పెట్టుబడుల విషయంలో ఆలోచించి అడుగు వేయడం మంచిది. మీరు బ్యాంకు లోన్ ల విషయంలో కానీ, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం గురించి కానీ ఎదురుచూస్తున్నట్లు అయితే ఈ సమయంలో మీకు ఆ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. రాహు గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన వివాదాలు, కోర్టు కేసుల్లో విజయం సాధించడం వలన కూడా ఈ సంవత్సరం మీకు ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 14 మధ్యకాలం, జూన్ 15 నుంచి జులై 17 మధ్యకాలం మరియు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 17 మధ్యకాలం సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఆర్థిక సంబంధ ఒప్పందాలు, కొనుగోళ్ల విషయంలో ఇది అనుకూలించే సమయం కాదు కాబట్టి వీలైనంత వరకు ఈ సమయంలో కొనుగోలు చేయకుండా, పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది.
వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం చివరలో ఆరోగ్య విషయంలో సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా పెద్దగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంవత్సరమంతా శని గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన ఊపిరితిత్తులు, ఎముకలు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం, నవంబర్ వరకు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో శని కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బందికి గురి చేయవు. అయినప్పటికీ శని దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం, మరియు కేతువు గోచారం నవంబర్ వరకు పన్నెండవ ఇంటిలో ఉండటం వలన మీరు మీకున్న సమస్యకంటే ఎక్కువగా భయపడటం కాని, అతి జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేస్తారు. దీనివలన మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వచ్చిన ప్రతి చిన్న సమస్యను పెద్దగా ఊహించుకోవడం వలన, మరియు మీకు వచ్చిన సమస్యకు వైద్యం లేదని తప్పుగా అర్థం చేసుకోవడం వలన మీరు ముఖ్యంగా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఎక్కువగా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో గురువు గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన మీరు సరైన ఆహార నియమాలు పాటించకపోవడం మరియు విశ్రాంతి తీసుకోకపోవడం వలన కూడా మీరు కొన్ని ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం గురు దృష్టి 12వ ఇంట్లో ఉండటం వలన మీరు సమస్య ఉన్నా లేకున్నా తరచుగా ఆస్పత్రికి వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఉండే భయాలు, అనుమానాల కారణంగా ఈ విధంగా చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మీరు సరైన ఆహార నియమాలు పాటించడం అలాగే మానసిక ప్రశాంతత కొరకు యోగా, ప్రాణాయామం లాంటి పద్ధతులను అలవాటు చేసుకోవటం వలన మీరు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడే అవసరం ఉండదు. నవంబర్ నుంచి రాహు గోచారం ఐదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఉదర సంబంధ వ్యాధులు, గుండెకు సంబంధించిన సమస్యలు మరియు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పైన చెప్పిన విధంగా మీరు మానసికంగా శాంతంగా ఉండి మీ జీవన శైలిని కొద్దిగా మార్చుకున్నట్లు అయితే ఈ సంవత్సరం వచ్చే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బందికి గురి చేయవు. ఈ సంవత్సరం మార్చి 13 నుంచి మే 10 మధ్యకాలం, అక్టోబర్ 3 నుంచి నవంబర్ 16 మధ్యకాలం ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు ఆవేశానికి, అతిగా కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో ఆవేశానికి లోనై వాహనాలు వేగంగా నడవడం వలన అనవసరమైన సమస్యలను తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండటం మంచిది.
ఈ సంవత్సరం కుటుంబ విషయంగా వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరమంతా శని గోచారం నాలుగవ ఇంటిపై ఉండటం వలన మీరు ద్వితీయార్ధంలో కొంతకాలం మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు. ఇది ముఖ్యంగా మీ వృత్తి కారణంగా జరిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది. గురు దృష్టి తొమ్మిదో ఇంటిపై, పదకొండవ ఇంటిపై మరియు ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీరు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులను ప్రశాంతంగా, ఆనందంగా ఉంచగలుగుతారు. గురు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ పిల్లలు అభివృద్ధిలోకి రావడం, మరియు వారి రంగంలో విజయాలు సాధించడం వలన మీరు ఆనందిస్తారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి మంచి ఉద్యోగం రావడం కానీ లేదా వారి రంగాల్లో విజయం సాధించడం కానీ జరుగుతుంది. అది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి వినోద యాత్రలు, విహార యాత్రలు చేసే అవకాశం ఉంటుంది. మీలో ఆధ్యాత్మికత ఎక్కువ అవటం వలన మీరు పుణ్య క్షేత్ర సందర్శన కూడా చేస్తారు. మీ తోబుట్టువుల వల్ల కాని, స్నేహితుల వల్ల కాని మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన పని పూర్తి అవడం వలన మీరు మీ వృత్తిలో కానీ లేదా వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధిస్తారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం ఆరవ ఇంటికి మారటంతో కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ ఉద్యోగం కారణంగా కానీ, వ్యాపారం కారణంగా కానీ కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. దాని కారణంగా మీకు మీ కుటుంబ సభ్యులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అయితే నవంబర్ వరకు రాహు గోచారం ఆరవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ కుటుంబంలో సామరస్య పూర్వక వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్న కోర్టు కేసుల్లో గాని, వివాదాల్లో కాని మీరు విజయం సాధించడం వలన మీకు ఆర్థికంగా కలిసి రావటమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. శని దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యంగా వారికి ఇష్టం లేనప్పటికీ మీరు చేసే పనులు మీ జీవిత భాగస్వామికి, మరియు ఇతర కుటుంబ సభ్యులకు ఆగ్రహాన్ని కలిగించవచ్చు. అక్టోబర్ చివరలో రాహు గోచారం ఐదవ ఇంటికి మారటం వలన మీ పిల్లల విషయంలో కొంత ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో వివాహం కాని వారికి వివాహం అవటం కాని, సంతానం కాని వారికి సంతానం అయ్యే అవకాశం కానీ బలంగా ఉంటుంది.
ఈ సంవత్సరం వృశ్చిక రాశి లో జన్మించిన విద్యార్థులు మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన వీరు చదువులో బాగా రాణిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఎక్కువ అవుతుంది అలాగే చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత అవుతారు. గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్లాలనుకునే వారు, లేదా స్వదేశంలోనే పేరున్న విద్యాసంస్థల్లో ప్రవేశం కోరుకునే వారికి అనుకూల ఫలితం లభిస్తుంది. గురు గోచారం ఏప్రిల్ వరకు ఐదవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. వారు పోటీపరీక్షల్లో ఉత్తీర్ణులై కోరుకున్న ఉద్యోగాలు పొందగలుగుతారు. ఏప్రిల్ చివరలో గురు గోచారం ఆరవ ఇంటికి మారటం వలన చదువుపై విద్యార్థులకు శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వారికి వారి శ్రమ పై నమ్మకం తగ్గడమే కాకుండా సులువుగా ఉత్తీర్ణులు అయ్యే మార్గాలని వెతికే ప్రయత్నం చేస్తారు. దానివలన సమయం వ్యర్థం అవటమే కాకుండా పరీక్షల్లో ఫలితాలు కూడా అనుకున్న విధంగా రాకపోవచ్చు. అంతేకాకుండా వారు తమ సామర్థ్యంకంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నది అనే భావనలో చదువు పట్ల నిర్లక్ష్య ధోరణి కనబరుస్తారు. దాని వలన కూడా చదువులో వెనుకబడే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా నాలుగవ ఇంటిలో శని గోచారం ఉండటం వలన వీరు చదువు విషయంలో వాయిదా వేసే పద్ధతిని అలవరచుకుంటారు. ముఖ్యంగా ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల్లో ఈ ధోరణి ఎక్కువ అవుతుంది. నవంబర్ వరకు ఆరవ ఇంటిలో రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన వీరు తమ తప్పు తెలుసుకొని మళ్లీ కష్టపడి చదివే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో గురువు మరియు రాహువు కలిసి ఉండటం వలన విద్యార్థుల్లో చదువుపై ఆసక్తికంటే, కీర్తి ప్రతిష్టల మీద ఆసక్తి ఎక్కువ అవుతుంది. దాని కారణంగా చదువును నిర్లక్ష్యం చేసి ఇతర వ్యాపకాలను అలవాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ మొదటి వారం నుంచి రాహు గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన వీరు పరీక్షల విషయంలో అహంకార ధోరణి అలవరచుకుంటారు. దాని కారణంగా చదువుపై పెద్ద పెట్టక పరీక్షల్లో సరైన ఫలితాలు సాధించలేరు.
ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు శని, గురువు, రాహువు మరియు కేతువులకు పరిహారాలు ఆచరించడం మంచిది. సంవత్సరమంతా శని గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన శ్రమకు తగిన ఫలితాన్ని పొందలేరు. దానివలన మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం తగ్గించుకోవటానికి శనికి పరిహార క్రియలు ఆచరించడం మంచిది. దానికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణం చేయటం, శని మంత్ర జపం చేయటం లేదా ఆంజనేయ స్తోత్రం పారాయణం చేయటం మంచిది. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో గురువు గోచారం ఆరవ ఇంటిలో అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గించుకోవటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణం చేయడం, గురు మంత్ర జపం చేయటం లేదా గురు చరిత్ర పారాయణం చేయడం మంచిది. సంవత్సరం చివరలో రాహు గోచారం ఐదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గించుకోవటానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు పూజ చేయటం, రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా దుర్గా స్తోత్రం పారాయణం చేయటం లేదా దుర్గా పూజ చేయటం వలన కూడా రాహు ప్రభావం తగ్గుతుంది. ఈ సంవత్సరం నవంబర్ వరకు కేతు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి కేతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గించుకోవడానికి ప్రతిరోజు కానీ, ప్రతి మంగళవారం కానీ కేతు పూజ చేయటం, కేతు స్తోత్రం పారాయణం చేయటం లేదా కేతువు మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గించుకోవటానికి ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ గణపతి స్తోత్రం పారాయణం చేయడం లేదా గణపతి పూజ చేయటం మంచిది.

People living in other countries, contribute via PayPal.