Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2021 samvatsara Simha rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Simha Rashi in Telugu

మఖ 4 పాదాలు (మ, మి, ము, మే),
పుబ్బ 4 పాదాలు (మో, ట, టి, టు)
ఉత్తర 1వ పాదం (టె)
ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో ఆరవ ఇంటిలో, రాహువు 10వ ఇంటిలో, వృషభ రాశిలో , కేతువు వృశ్చిక రాశిలో, నాలుగవ ఇంటిలో ఉంటారు. గురుడు ఏప్రిల్ 06న కుంభ రాశిలో, ఏడవ ఇంటిలో ప్రవేశిస్తాడు. వక్రగతి పొందిన తరువాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో, 6వ ఇంటిలో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు, నవంబర్ 20న గురుడు మళ్లీ కుంభరాశిలో ఏడవ ఇంటిలో ప్రవేశిస్తాడు.
సింహ రాశి వారికి, వృత్తి పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు, వృత్తిలో మీకు సామాన్యంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులు కష్టంమీద పూర్తి చేయగలుగుతారు. ఏప్రిల్లో గురువు సప్తమ స్థానమైన కుంభ రాశి లోకి మారటంతో వృత్తి పరంగా మీకు అనుకూలమైన మార్పులు వస్తాయి. గతంలో వాయిదా పడిన పనులు కానీ, లేదా వదిలి వేసిన పనులు కానీ ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. గతంలో మీరు గుర్తింపు కొరకు ఎంత కష్టపడినా, సరైన ఫలితం దక్కక చిరాకుకు లోనయ్యేవారు. ఏప్రిల్ తర్వాత గురువు అనుకూలంగా ఉండటంతో మీకు పేరు, ప్రతిష్టల తో పాటు వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ యానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి లేదా వృత్తిలో మార్పు కోరుకుంటున్న వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యలో అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న ప్రదేశానికి మారడం కానీ, లేదా వృత్తిలో అనుకున్న స్థాయికి ఎదగటం కానీ జరుగుతుంది. మీ సహోద్యోగులు సహాయ, సహకారాలు అందించడం వలన కష్టమైన పనులు కూడా సులువుగా పూర్తి చేయగలుగుతారు. దాని కారణంగా మీ పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆరవ ఇంటిలో శని గోచారం కారణంగా, మీకు చెడు చేయాలనుకునేవారు కానీ, లేదా ఇబ్బందులు కలుగజేసే వారు కానీ దూరం అవుతారు. అయితే రాహువు గోచారం సంవత్సరమంతా పదవ ఇంటిలో ఉండటం వలన కొన్నిసార్లు వృత్తి విషయంలో గర్వానికి, అహంకారానికి లోనవుతారు. దాని కారణంగా మీ సహాయం కొరకు వచ్చే వారికి కానీ, లేదా సహోద్యోగులకు కాని ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే చేపట్టిన పని తొందరగా పూర్తి చేయాలని, వృత్తిలో మంచి పేరు సంపాదించాలనే ఆలోచనతో, కుటుంబ జీవితానికి, విశ్రాంతికి దూరం అవుతారు. వృత్తికి మరియు కుటుంబానికి సమపాళ్లలో సమయం వెచ్చించడం మంచిది. లేకున్న కుటుంబ సభ్యులతో సరైన అవగాహన లేకుండా పోతుంది. తిరిగి సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో గురువు గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన వృత్తిలో సవాళ్లను ఎదుర్కుంటారు. మీరు చేయాల్సిన పని వేరే వారు చేయటం, మీకు రావాల్సిన పేరు, ప్రతిష్టలను వేరే వారు పొందాలని చూడటం వలన కొంత అసహనానికి లోనవుతారు. దాని కారణంగా మీ సహోద్యోగులతో గొడవలు పెట్టుకుంటారు. ఈ సమయంలో వీలైనంత వరకు సహనం పాటించడం మంచిది. దానివల్ల గతంలో లో సంపాదించిన పేరు కోల్పోకుండా ఉంటారు. సంవత్సరాంతం నుంచి వృత్తిలో మంచి ఫలితాలు పొందుతారు.
సింహ రాశి వారికి, ఈ సంవత్సరం కుటుంబం పరంగా అనుకూలంగా ఉంటుంది. రెండవ ఇంటిపై గురు దృష్టి ఏప్రిల్ వరకు ఉండటం వల్ల కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి వివాహం అవటం కాని, లేదా సంతానం అవటం కానీ జరుగుతుంది. శని దృష్టి సంవత్సరమంతా మూడవ ఇంటిపై ఉండటంవలన మీ తోబుట్టువులులో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ, లేదా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గురువు ఏడవ ఇంటిలో అనుగుణంగా అనుకూలంగా ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సంబంధ, బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో మీ జీవిత భాగస్వామితో కానీ ఇతర కుటుంబ సభ్యులతో కానీ ఉన్న వివాదాలు సమసిపోతాయి. సప్తమ స్థానంలో గురు సంచారం వివాహానికి అనుకూలమైనది. వివాహం కాని వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ సోదరులకు వృత్తిలో అభివృద్ధి కానీ వారు చేపట్టిన పనిలో విజయం కానీ లభిస్తుంది. ఈ సంవత్సరం సంతానం విషయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో మీ సంతానానికి వారి రంగాల్లో విజయం లభిస్తుంది. అయితే సంవత్సరాంతంలో మీ సంతానంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.
ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మొదటి నుంచి గురువు మరియు శని గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన ఆర్థిక స్థితి మెరుగవుతుంది. గురు దృష్టి పదవ 12వ మరియు రెండవ ఇంటిపై ఉండటం వలన ఆదాయం పెరుగుతుంది. పదోన్నతి కారణంగా అలాగే గతంలో రావాల్సిన లేదా నష్టపోయిన డబ్బు తిరిగి రావడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయట పడగలుగుతారు. ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య గురువు గోచారం ఏడవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఆదాయంలో పెరుగుదల చూస్తారు. ముఖ్యంగా గురు దృష్టి లగ్నం మీద లాభ స్థానం మీద మరియు తృతీయ స్థానం మీద ఉండటం వలన సరైన విధంగా డబ్బులు పెట్టుబడి పెట్టడం అలాగే వాటి నుంచి అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలు రావడం జరుగుతుంది. ఇల్లు కాని, స్థిరాస్తులు కొనాలని అనుకునే వారు ఈ సంవత్సరం ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య గాని లేదా నవంబర్ 20 తర్వాత కాని కోనడం మంచిది. గురు దృష్టి ఈ సమయంలో లాభ స్థానం పై ఉంటుంది కాబట్టి మీరు అనుకున్న విధంగా వాటిని కొనుగోలు చేయగలుగుతారు. అలాగే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు కానీ మీకు లాభం చే కూరుస్తారు
ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఆరవ ఇంటిలో శని గోచారం మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్య తగ్గుముఖం పడుతుంది. అయితే, జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో గురువు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన కాలేయము లేదా కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. తిరిగి ఏప్రిల్ లో గురువు ఏడవ ఇంటికి వెళ్లడం వలన మీ ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. సంవత్సరమంతా ఆరోగ్య పరంగా మీరు పెద్దగా ఇబ్బంది పడే అవసరం ఉండదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అతి తక్కువ కాలంలోనే నయమవుతాయి.
విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు దృష్టి రెండవ ఇంటిపై మరియు లగ్నంపై, లాభ స్థానంపై ఉండటం వలన చదువులో రాణిస్తారు. జనవరి మరియు ఏప్రిల్ మధ్య గురు దృష్టి రెండవ ఇంటిపై మరియు 12వ ఇంటిపై ఉండటం వలన చదువులో ఏకాగ్రత తగ్గుతుంది. అయితే ఫలితాల విషయంలో అనుకూలంగా ఉండటం వలన తిరిగి చదువుపై ఆసక్తి పెరగడం జరుగుతుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య గురు దృష్టి లగ్నంపై, లాభ స్థానం పై ఉండటం వలన చదువుపై మంచి ఆసక్తి పెరగడం, రాసిన పరీక్షలలో మంచి ఫలితాలను పొందడం జరుగుతుంది. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి అనుకున్న ఫలితం లభిస్తుంది. అలాగే విదేశాల్లో ఉన్నత విద్య ప్రయత్నిస్తున్న వారికి ఏప్రిల్ లో కానీ లేదా సెప్టెంబర్ తర్వాత కానీ వారు అనుకున్న ఫలితాలను పొందుతారు.
సింహ రాశి వారికి ఈ సంవత్సరం గురువు మరియు కేతువు కొంత అనుకూలంగా ఉండరు కాబట్టి ఈ రెండు గ్రహాలకి పరిహారాలు చేయడం మంచిది. కేతువు ఈ సంవత్సరం అంతా నాలుగవ ఇంటిలో సంచరిస్తాడు. దీని కారణంగా ఇంట్లో కొంత అశాంతి ఏర్పడటం లేదా స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఏర్పడటం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కేతు స్తోత్ర పారాయణం చేయడం కానీ కేతు మంత్ర జపం చేయడం మంచిది. దాని వలన కేతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా కేతువు అధిదేవత అయిన గణపతి ఆరాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆరవ ఇంటిలో గురు గోచారం కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువుకు పరిహారాలు చేయడం మంచిది. దీనికి గాను ప్రతి రోజూ గురు స్తోత్రం పారాయణం చేయడం కానీ, గురు మంత్ర జపం చేయడం కానీ, లేదా గురు చరిత్ర పారాయణం చేయడం కానీ మంచిది.

People living in other countries, contribute via PayPal.