Telugu Rashi Phalalu (Rasi phalamulu) - 2023 samvatsara Karkataka rashi phalaalu. Family, Career, Health, Education, Business and Remedies for Karkataka Rashi in Telugu

పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1, 2, 3, పాదములు (హు, హె, హో, డా)
ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)
ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి తొమ్మిదవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత పదవ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మీ రాశికి ఏడవ స్థానమైన మకర రాశి నుంచి, ఎనిమిదవ స్థానమైన కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 న రాహువు పదవ స్థానమైన మేష రాశి నుంచి, తొమ్మిదవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు నాలుగవ స్థానమైన తులా రాశి నుంచి మూడవ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు .
కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరమంతా శని ఎనిమిదవ ఇంటిలో సంచరించడం వలన వృత్తిలో సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం వృత్తి పరంగా ప్రథమార్ధంలో అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్ధంలో కొంత సామాన్యంగా ఉంటుంది. ఏప్రిల్ వరకూ గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో మీ అదృష్టం కూడా కలిసి వచ్చి కొన్ని పనులు సునాయాసంగా చేయటమే కాక వాటి ఫలితంగా వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు. ఈ సంవత్సరం రాహువు పదవ ఇంటిలో అక్టోబర్ చివరి వరకూ సంచరిస్తాడు. రాహువు గోచరము కారణంగా కొన్నిసార్లు మీరు మీ వృత్తికి సంబంధించి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు గొప్పలకు పోయి మీ స్థాయికి మించిన పనులు కూడా చేయాలని చూస్తారు. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు అలా చేసిన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కానీ ఏప్రిల్ తర్వాత గురువు గోచారం పదవ ఇంటికి మారటం వలన ఈ సమయంలో మీ వృత్తి విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. గతంలో మీకు సహకరించిన వారు ఇప్పుడు మీకు పనుల విషయంలో అడ్డు పడే అవకాశం ఉంటుంది. మీరు ఈ పనులు పూర్తి చేయడానికి ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. గురువు దృష్టి ఆరవ ఇంటిపై మరియు రెండవ ఇంటిపై ఉండటం వలన మీకు సహకరించేవారు కొంతమంది ఉన్నప్పటికీ వారి సహాయం సమయానికి అందకపోవడం వలన మీరు చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి చేయాల్సి వస్తుంది. కేతువు గోచారం అక్టోబర్ చివరి వరకు నాలుగవ ఇంట్లో ఉండటం వలన మీరు మీ ఇంటిని విడిచి, మీ కుటుంబానికి దూరంగా బయటి ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీ ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి వ్యతిరేకత ప్రదర్శించకుండా దానిని పూర్తి చేయటం మంచిది. ఈ సంవత్సరం మీ ఓపికకు, మరియు మీ సహనానికి పరీక్ష పెట్టె సందర్భాలు వస్తాయి. ఇటువంటి సందర్భాల్లో మీరు సహనంగా పని చేసినట్లయితే భవిష్యత్తులో ఇది మీకు సహాయకారిగా ఉంటుంది. ఇంటిపై రెండవ ఇంటిపై మరియు అయిదవ ఇంటిపై శని దృష్టి ఉండటం వలన ఈ సంవత్సరం మీరు ఎవరికీ ఏ విషయంలోనూ మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. మీరు చేస్తానని మాట ఇచ్చి పనులు చేయకపోవడం వలన అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే సలహాలను అసందర్భంగా ఇవ్వటం చేయకండి అది కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వీలైనంతవరకు ఆలోచనలకు కాకుండా పనికి ప్రాధాన్యత ఇవ్వటం వలన మీరు మీకు వచ్చే సమస్యలను విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. నవంబర్‌లో కేతువు గోచారం మూడవ ఇంటిలోకి రాహు గోచారం తొమ్మిదవ ఇంటికి మారటం వలన ఈ పరిస్థితుల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిలో అభివృద్ధితో పాటు మీరు తిరిగి మీ కుటుంబంతో కలిసి ఉండటం సాధ్యమౌతుంది. ఎనిమిదవ ఇంటిలో శని సంచారం ఉన్నప్పుడు మనలో ఉండే లోపాలను శని తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఆ సందర్భంగా కొన్నిసార్లు వృత్తిలో కానీ ఇతర సందర్భాల్లో కానీ అవమానాలు ఇతర సమస్యలు ఎదురైనప్పటికీ మీరు ఓపిక గా ఉండటం వలన అది మీ భవిష్యత్తులో అభివృద్ధికి సాయపడుతుంది. ఈ సమయంలో మీరు ఆవేశానికి లోను అయితే మాత్రం అది మీకు నష్టాన్ని మరియు కష్టాన్ని మిగులుస్తుంది. కొత్తగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు, అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు ఏప్రిల్‌లోపు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయటం మంచిది ఆ తర్వాత గురు గోచారం మధ్యమంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 మధ్యలో, జూన్ 15 నుంచి జూలై 17 మధ్యలో అలాగే నవంబర్ 17 నుంచి డిసెంబర్ 16 మధ్యలో ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో ఉద్యోగం మారాలను కోవడం అంతగా అనుకూలించే విషయం కాదు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఇచ్చిన బాధ్యతలు ఎంత కష్టమైనప్పటికీ పూర్తి చేసే ప్రయత్నం చేయండి తప్ప వాయిదా వేయాలనుకోకండి
ఈ సంవత్సరం వ్యాపారస్థులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారంలో కొద్దిగా ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ లాభాలను గడిస్తారు. శని గోచారం ఎనిమిదవ ఇంటిలో సంవత్సరమంతా ఉండటం వలన ఈ సమయంలో భాగస్వాములతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు గొడవలకు దిగకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. దాని వలన వ్యాపారంలో నష్టాలు రాకుండా కాపాడుకోవచ్చు. గురువు గోచారం ప్రథమ భాగంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో చేయడం మంచిది. ఆ తర్వాత గురువు గోచారం పదవ ఇంటికి మారటం అలాగే అక్టోబర్ వరకు రాహు గోచారం తో పాటు శని గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి వ్యాపారంలో ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. డబ్బు వచ్చినప్పటికీ అది వ్యాపార అభివృద్ధికి ఎక్కువ ఖర్చు అవడం వలన ఈ సమయంలో పెద్దగా లాభాలు రావు. అంతేకాకుండా శని గోచారం కారణంగా వ్యాపారంలో కొన్నిసార్లు నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నష్టాల్లో చాలా మటుకు మీరు తీసుకునే అనవసరమైన నిర్ణయాల కారణంగా వస్తాయి కాబట్టి వీలైనంతవరకు నిపుణులు, మరియు అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని మాత్రమే కొత్త నిర్ణయాలు కానీ, కొత్త పనులు కానీ చేసే ప్రయత్నం చేయండి. ఏప్రిల్ నుంచి ఒక సంవత్సరం పాటు ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి డబ్బును అవసరానికి తగినంత మాత్రమే ఖర్చు చేసే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు రాహు గోచారం పదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు ఇతరులను చూసి వారిలాగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మీరు మీ స్థాయికి తగిన పనులు మాత్రమే చేయండి తప్ప గొప్పలకు పోకండి.
స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో అనుకూల ఫలితాలను, ద్వితీయార్ధంలో కొంత శ్రమ చేయడం ద్వారా అనుకూల ఫలితాలను పొందుతారు. మీ ప్రతిభకు గుర్తింపు లభించినప్పటికీ మీరు సరైన విధంగా మీరు ఒప్పుకున్న పనులను పూర్తి చేయలేక పోవడం వలన మీ సేవలు వినియోగించుకునేవారు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అలా ఒప్పుకున్న పనులు చేయలేక పోవడం వలన మీరు మీ పేరును చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పని అయినా సమయానికి పూర్తయ్యేలా, నిజాయితీగా చేయటం మంచిది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో గురువు మరియు రాహువు పదవ ఇంటిలో ఉండటం పదవ స్థానం పై శని దృష్టి ఉండటం వలన పేరు ప్రతిష్టల కొరకు మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీ పనిలో అడ్డంకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వచ్చే ప్రతి అడ్డంకి కూడా భవిష్యత్తులో మీ ప్రతిభను మరింతగా పదును పెట్టి మీకు అభివృద్ధిని ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి నిరాశకు లోనుకాకుండా చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయండి.
ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఈ సమయంలో ఖర్చు ఉన్నప్పటికీ ఆదాయం బాగుండటం వలన ఇబ్బంది ఉండదు. ఇల్లు గాని, వాహనం కానీ లేదా స్థిరాస్థులు కానీ కొనుగోలు చేయాలనుకునే వారు వాటిని ఏప్రిల్ లో కొనుగోలు చేయడం మంచిది ఆ తర్వాత గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం, కొనుగోళ్లు చేయడం మంచిది కాదు. ఈ సంవత్సరమంతా శని గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన శని దృష్టి రెండవ ఇంటిపై, పదవ ఇంటిపై మరియు ఆరవ ఇంటిపై ఉంటుంది. దీని కారణంగా ఖర్చులు పెరగడమే కాకుండా మీకు ఆర్థిక సంబంధ ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరంలో ద్వితీయార్ధంలో మీరు చేసే ఖర్చులు ఎక్కువ అవడం వలన బ్యాంకు నుంచి లోన్లు కానీ మిత్రుల నుంచి డబ్బు చేబదులు కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ నుంచి గురు దృష్టి రెండవ ఇంటిపై, ఆరవ ఇంటిపై ఉండటం వలన ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి బయటపడే మార్గాలు కూడా లభిస్తాయి. దానివలన ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గుతుంది. అయినప్పటికీ ఈ సంవత్సరము మీరు ముందు వెనక చూడక డబ్బు ఖర్చు చేయటం మంచిది కాదు. ఇతరుల మాటలు విని గొప్పలకు పోయి విలాసాల కొరకు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఖర్చుల విషయంలో తొందర పడకుండా ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఏప్రిల్ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలను వారు తప్పనిసరిగా మీ శ్రేయోభిలాషుల సలహాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడం మంచిది. ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం మంచిది. అలాగే తక్కువ ధరలో వస్తుంది కదా అని ఇల్లు కానీ, భూమి కానీ కొనుగోలు చేయకండి. దాని కారణంగా చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అవటమే కాకుండా కొన్న ఇల్లు కాని, భూమి కానీ నిరుపయోగం అవుతుంది. అలాగే డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి తర్వాత ఇబ్బంది పడకండి. ఈ సంవత్సరం మీరు ఎంతగా పొదుపు చేయగలిగితే మీకు భవిష్యత్తులో అంత ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. నవంబర్ నుంచి కేతువు గోచారం మూడవ ఇంటిలో రాహు గోచారం తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన ఆర్థిక ఒత్తిళ్ళు కొంత మేరకు తగ్గుతాయి. ఈ సమయంలో స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్న సమస్యలు తొలగిపోయి వాటి ద్వారా కూడా కొంత డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ చివరి వరకు గురువు చాలా అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య విషయంలో మీకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. చిన్న, చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగానే నయమవుతాయి. గురువు దృష్టి ఐదవ ఇంటిపై, మరియు లగ్నం పై ఉండటం వలన గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడం జరుగుతుంది. జనవరి నుంచి శని గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన ఈ సంవత్సరం గురు గోచారం బాగున్న అంతవరకు ఆరోగ్య విషయం ఇబ్బందికరంగా ఉండక పోయినప్పటికీ ఏప్రిల్ తర్వాత నుంచి అక్టోబర్ చివరి వరకు గురువు, కేతువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శని మన శరీరంలో మోకాళ్లు మరియు ఎముకలకు కారకత్వం వహిస్తాడు కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో మీరు ఎముకల సంబంధ ఆరోగ్య సమస్యలతో పాటు, జననాంగ సంబంధ ఆరోగ్య సమస్యలు మరియు దంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధ పడే అవకాశం ఉంది. కేతువు గోచారం నాలుగవ ఇంటిలో అనుకూలంగా లేకపోవడం వలన మీరు ఊపిరితిత్తులు మరియు చర్మ సంబంధ అనారోగ్యాలతో బాధ పడే అవకాశం ఉంటుంది. అలాగే గురువు మరియు రాహువు గోచారం మధ్యమంగా ఉండటం వలన వెన్నెముక మరియు కాలేయ సంబంధ ఆరోగ్య సమస్యల విషయంలో కూడా మీరు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. శని దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారకత్వం వహిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం శని కారణంగా వచ్చే జబ్బులు తొందరగా తగ్గే అవకాశం ఉండదు. అందువలన వీలైనంత వరకు ఆరోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మంచిది. శని బద్ధకస్తులు మీద తన చెడు ప్రభావం ఎక్కువగా చూపిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం మీరు బద్ధకాన్ని విడిచిపెట్టి శారీరకంగా శ్రమించ వలసిన అవసరం ఉంది. మీరు ఏ పని చేయక బద్ధకం గా ఉండడం కానీ అలాగే సరైన వ్యాయామాలు చేయకుండా ఉండటం వలన ఈ సంవత్సరంలో మీరు ఎక్కువ కాలం ఆరోగ్య సమస్యలతో బాధ పడే అవకాశం ఉంటుంది. శారీరక శ్రమ చేసే వారిని శని అనుకూల దృష్టితో చూస్తాడు కాబట్టి మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులై ఉండటం అలాగే సరైన ఆహార నియమాలు పాటించడం వలన ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యల నుంచి బయట పడగలుగుతారు.
కర్కాటక రాశి వారికి 2023 వ సంవత్సరం కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో కుటుంబంలో అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గురు గోచారం ఏప్రిల్ వరకు తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్యన మంచి అవగాహన ఉండడమే కాకుండా ఒకరికొకరు సహాయ కారులుగా కూడా ఉంటారు. మీ తోబుట్టువులు మరియు మీ పిల్లల కారణంగా మీరు ఆనందంగా ఉండటమే కాకుండా ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీరు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో మరియు సమాజంలో ఈ సమయంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే పదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు చేసే పనులు మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యంగా మీరు గొప్పలకు పోయి ఆ తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు మానసికంగా ప్రశాంతంగా ఉండి మీ కుటుంబ సభ్యులను కూడా ప్రశాంతంగా ఉంచడం మంచిది. ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహం అవటం, అలాగే సంతానం కాని వారికి సంతానం అవ్వటం జరిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ చివరి నుంచి గురువు గోచారం పదవ ఇంటికి మారటం వలన మీ కుటుంబంలో కొన్ని అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ స్థానంపై గురువు మరియు శని దృష్టి కారణంగా కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావడం కాని లేదా అనుకోని బాధ్యతల కారణంగా మీరు మీ కుటుంబానికి దూరంగా కాలం ఉండాల్సి రావడం కానీ జరుగుతుంది. అలాగే గురు దృష్టి నాలుగవ ఇంటిపై మరియు అరవై ఇంటిపై ఉండటం వలన మీ తల్లిగారికి సంబంధించి లేదా మీ తల్లి గారి తోబుట్టువులకు సంబంధించి కొన్ని సమస్యలు పరిష్కరించడంలో మీరు తలమునకలయ్యే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా శని దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీరు కీర్తి ప్రతిష్టల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్నిసార్లు మీరు తెలివి తక్కువగా చేసే పనులు మీకు, మీ కుటుంబానికి ఇబ్బందులను, అవమానాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు మాట విషయంలో మరియు పని విషయంలో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు తొందరపడి అనే మాట గాని, చేసే పని గాని మీ కుటుంబ సభ్యులకు మానసిక ఆందోళన ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండవ ఇంటిపై శని యొక్క దృష్టి మీరు మాట్లాడే మాటలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. మీ మనసులో చెడు భావన లేనప్పటికీ మాట్లాడే విధానం కారణంగా ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం వలన సమస్య పరిష్కారమవుతుంది. గురు దృష్టి ప్రథమార్ధంలో ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీ పిల్లలు అభివృద్ధిలోకి రావటమే కాకుండా వారు మీ ఆనందానికి కారణం అవుతారు.
విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన చదువు విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు. సంవత్సర ఆరంభం నుంచి ఏప్రిల్ చివరి వరకు గురువారం తొమ్మిదవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన విద్యార్థులు చదువులో రాణించగలుగుతారు. గురువు దృష్టి ఒకటవ ఇంటిపై, మూడవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై ఉండటం వలన చదువులో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఏకాగ్రతగా చదవడమే కాకుండా పరీక్షలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఈ సమయంలో గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉన్నత విద్యాభ్యాసం విదేశాల్లో చేయాలనుకునేవారు కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా వారు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందగలుగుతారు. ఏప్రిల్ చివరలో గురు గోచారం పదవ ఇంటికి మారటం వలన చదువులో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. నేర్చుకోవడం కంటే ఎక్కువగా మార్కులపై, కీర్తి ప్రతిష్టల పై దృష్టి పెట్టడం వలన ఈ సమయంలో పరీక్షలలో సరైన ఫలితాన్ని పొందలేరు. ముఖ్యంగా శని దృష్టి రెండవ ఇంటిపై, ఐదవ ఇంటిపై ఉండటం వలన బద్ధకం పెరగడమే కాకుండా వాయిదా వేసే స్వభావము కూడా అలవాటవుతుంది. తమకు అన్ని తెలుసు అనే భావన పెరగటం వలన కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కనబరచరు. దాని కారణంగా అంతవరకు చదువులో బాగా రాణించిన వారు కూడా కొంత వెనుకబడే అవకాశం ఉంటుంది. ఈ సమయములో వీలైనంత వరకు బద్ధకానికి, అహంకారానికి తావివ్వకుండా చదువు మీద దృష్టి పెట్టినట్లయితే చదువులో మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరం కాంపిటీటివ్ పరీక్షలు రాసే వారు కూడా ప్రథమార్ధంలో అనుకూల ఫలితాలు పొందుతారు కానీ ద్వితీయార్ధంలో శ్రమకు తగిన ఫలితం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అనుకున్నదానికంటే ఎక్కువగా శ్రమించడం వలన వారు అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు.
ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రథమార్ధంలో ఆధ్యాత్మికంగా మంచి పురోగతి సాధ్యమవుతుంది. తొమ్మిదవ ఇంటిలో గురు గోచారం కారణంగా ఆధ్యాత్మిక క్షేత్రం దర్శనం చేయటమే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో ప్రముఖులను సందర్శించగలుగుతారు. గురు దృష్టి ఐదవ ఇంటిపై గురు దృష్టి కారణంగా కొత్తగా ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరగడమే కాకుండా వాటిని నేర్చుకోవటానికి కృషి చేస్తారు. ఈ సంవత్సరం శని మరియు కేతువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కేతువుకు మరియు శనికి పరిహారాలు చేయటం మంచిది. ఏప్రిల్ తర్వాత గురువు గోచారం పదవ ఇంటిలో మధ్యమంగా ఉండటం వలన గురువుకు అలాగే రాహువుకు కూడా పరిహారాలు చేయడం మంచిది. సంవత్సరం అంతా శని గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. అంతేకాకుండా శనికి సేవ చేయడం శారీరక శ్రమ చేయడం ఇష్టం కాబట్టి మీరు శని ప్రభావం తగ్గించుకోవడానికి మీకు వీలైనంత పేదలకు, వికలాంగులకు సేవ చేయటం మంచిది. అక్టోబర్ చివరి వరకు కేతువు గోచారం నాలుగో ఇంటిలో ఉంటుంది కాబట్టి దాని కారణంగా ఏర్పడే శారీరక, మానసిక మరియు కుటుంబ సంబంధ సమస్యల ప్రభావం తగ్గటానికి కేతువుకు పరిహారాలు చేయడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్రం చదవడం కానీ కేతు మంత్ర జపం చేయడం కానీ మంచిది. వీటితో పాటు గణపతి పూజ చేయడం గణపతి స్తోత్రం చదవడం వలన కేతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. ఇప్పటివరకు రాహువు మరియు ఏప్రిల్ చివరి నుంచి గురువు గోచారం పదవ ఇంటిలో మధ్యమంగా ఉంటుంది కాబట్టి గురువు మరియు రాహువులకు పరిహారాలు ఆచరించడం వలన ఉద్యోగంలో మరియు ఆర్థికంగా ఈ గ్రహాలు ఇచ్చే సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్రం చదవడం లేదా గురు పూజ చేయడం మంచిది అలాగే రాహు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు పూజ చేయటం లేదా రాహు స్తోత్రం చదవడం మంచిది. ఈ పరిహారాలు ఆచరించడం వలన ఈ సంవత్సరంలో మీ జీవితంలో ఏర్పడే సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి.

People living in other countries, contribute via PayPal.