పితృస్మరణ · మహాలయ పక్షం
పితృపక్షం 2026 తేదీలుమీ ప్రాంతానికి శ్రాద్ధ తిథులు, సమయాలు
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మన వంశానికి మూలమైన పెద్దలను కృతజ్ఞతతో స్మరించుకునే కాలమే పితృపక్షం. ఈ పక్షంలో శ్రాద్ధం ఏ రోజు చేయాలి, ఏ సమయం తీసుకోవాలి అనే విషయాలను మీకు సులభంగా అర్థమయ్యేలా ఇక్కడ వివరిస్తున్నాను.
మీ ఊరికి తేదీలు చూడండి
ప్రస్తుత సంవత్సరంశ్రాద్ధం చేసే ప్రదేశాన్ని ఎంచుకోండి. మొదట హైదరాబాద్ వివరాలు కనిపిస్తాయి. విదేశాల్లో ఉంటే అక్కడి నగరాన్ని ఇవ్వండి.
ఎంచుకున్న ప్రాంతం: Hyderabad, Telangana, India · Asia/Kolkata
సమయాలన్నీ ఎంచుకున్న ప్రాంతపు స్థానిక సమయాలు (24 గంటల పద్ధతి). వర్తించే చోట డేలైట్ సేవింగ్ మార్పులు పరిగణించబడతాయి.
2026 పితృపక్ష శ్రాద్ధ తిథుల పట్టిక
మీకు కావలసిన తిథి వరుసను చూడండి. తిథి ప్రారంభం–ముగింపును పూర్తి తేదీతో ఇచ్చాను. ఒకే తేదీకి రెండు శ్రాద్ధ తిథులు రావచ్చు.
| శ్రాద్ధం | తిథి ప్రారంభం → ముగింపు | కుతుప | రౌహిణ | అపరాహ్నం |
|---|---|---|---|---|
| భాద్రపద పూర్ణిమ శ్రాద్ధం పక్షానికి ముందు | 25 సెప్టెంబర్ 2026 · 23:07→ 26 సెప్టెంబర్ 2026 · 22:19 | 11:43–12:31 | 12:31–13:19 | 13:19–15:44 |
| పాడ్యమి (ప్రతిపద) శ్రాద్ధం | 26 సెప్టెంబర్ 2026 · 22:19→ 27 సెప్టెంబర్ 2026 · 20:59 | 11:43–12:31 | 12:31–13:19 | 13:19–15:43 |
| విదియ (ద్వితీయ) శ్రాద్ధం | 27 సెప్టెంబర్ 2026 · 20:59→ 28 సెప్టెంబర్ 2026 · 19:14 | 11:42–12:30 | 12:30–13:18 | 13:18–15:43 |
| తదియ (తృతీయ) శ్రాద్ధం మహాభరణి శ్రాద్ధం | 28 సెప్టెంబర్ 2026 · 19:14→ 29 సెప్టెంబర్ 2026 · 17:10 | 11:42–12:30 | 12:30–13:18 | 13:18–15:42 |
| చవితి శ్రాద్ధం తిథి ద్వయం | 29 సెప్టెంబర్ 2026 · 17:10→ 30 సెప్టెంబర్ 2026 · 14:55 | 11:42–12:30 | 12:30–13:18 | 13:18–15:42 |
| పంచమి శ్రాద్ధం తిథి ద్వయం | 30 సెప్టెంబర్ 2026 · 14:55→ 1 అక్టోబర్ 2026 · 12:35 | 11:42–12:30 | 12:30–13:18 | 13:18–15:42 |
| షష్ఠి శ్రాద్ధం | 1 అక్టోబర్ 2026 · 12:35→ 2 అక్టోబర్ 2026 · 10:15 | 11:41–12:29 | 12:29–13:17 | 13:17–15:41 |
| సప్తమి శ్రాద్ధం | 2 అక్టోబర్ 2026 · 10:15→ 3 అక్టోబర్ 2026 · 08:00 | 11:41–12:29 | 12:29–13:17 | 13:17–15:40 |
| అష్టమి శ్రాద్ధం | 3 అక్టోబర్ 2026 · 08:00→ 4 అక్టోబర్ 2026 · 05:52 | 11:41–12:29 | 12:29–13:16 | 13:16–15:40 |
| నవమి శ్రాద్ధం | 4 అక్టోబర్ 2026 · 05:52→ 5 అక్టోబర్ 2026 · 03:54 | 11:40–12:28 | 12:28–13:16 | 13:16–15:39 |
| దశమి శ్రాద్ధం | 5 అక్టోబర్ 2026 · 03:54→ 6 అక్టోబర్ 2026 · 02:08 | 11:40–12:28 | 12:28–13:16 | 13:16–15:39 |
| ఏకాదశి శ్రాద్ధం | 6 అక్టోబర్ 2026 · 02:08→ 7 అక్టోబర్ 2026 · 00:35 | 11:40–12:28 | 12:28–13:15 | 13:15–15:38 |
| ద్వాదశి శ్రాద్ధం మఘా శ్రాద్ధం | 7 అక్టోబర్ 2026 · 00:35→ 7 అక్టోబర్ 2026 · 23:17 | 11:40–12:27 | 12:27–13:15 | 13:15–15:37 |
| త్రయోదశి శ్రాద్ధం | 7 అక్టోబర్ 2026 · 23:17→ 8 అక్టోబర్ 2026 · 22:16 | 11:39–12:27 | 12:27–13:14 | 13:14–15:37 |
| చతుర్దశి శ్రాద్ధం | 8 అక్టోబర్ 2026 · 22:16→ 9 అక్టోబర్ 2026 · 21:36 | 11:39–12:27 | 12:27–13:14 | 13:14–15:36 |
| సర్వపితృ అమావాస్య | 9 అక్టోబర్ 2026 · 21:36→ 10 అక్టోబర్ 2026 · 21:20 | 11:39–12:26 | 12:26–13:14 | 13:14–15:36 |
ఇవి ఆ రోజులోని కాల విభాగాలు. కర్మ సమయం నిర్ణయించేటప్పుడు తిథి ప్రారంభం–ముగింపును కూడా చూడండి. తిథి ద్వయం, శూన్య తిథి వివరణలు కింద ఉన్నాయి.
నేను పెట్టాల్సిన శ్రాద్ధం ఎప్పుడు?
పూర్వీకుల కోసం మీరు పెట్టాల్సిన మహాలయ శ్రాద్ధ తేదీని ఇక్కడ తెలుసుకోవచ్చు. వార్షిక ఆబ్దికానికి మరణించిన మాసం, పక్షం, తిథి వివరాలు అవసరం.
తిథి తెలియదు — మరణించిన తేదీ మాత్రమే తెలుసు
మరణించిన తేదీ, అప్పటి స్థానిక సమయం, ప్రదేశం ఇవ్వండి. మరణించిన ప్రదేశం, శ్రాద్ధం చేసే ప్రదేశం వేర్వేరుగా ఉండవచ్చు.
సమయం తెలియనప్పుడు ఆ రోజులో వచ్చే తిథులన్నీ చూపిస్తాను. ఒకటి కంటే ఎక్కువ ఉంటే కుటుంబ రికార్డు లేదా పురోహితుని సహాయంతో నిర్ధారించుకోండి.
పితృపక్షం అంటే ఏమిటి?
తెలుగు పంచాంగంలోని అమాంత పద్ధతిలో భాద్రపద బహుళ పక్షాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు. ఉత్తర భారతదేశంలో పూర్ణిమాంత పద్ధతి వల్ల ఇదే కాలాన్ని ఆశ్వయుజ కృష్ణ పక్షంగా వ్యవహరిస్తారు. మాసం పేరులో తేడా ఉన్నా, సూచించే పక్షం ఒకటే.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మన వంశానికి మూలమైన పెద్దలను కృతజ్ఞతతో స్మరించుకునే కాలమిది. శ్రద్ధతో పితృకార్యాలు చేయడం మన సంప్రదాయంలో బాధ్యతగా భావిస్తారు. తర్పణం, శ్రాద్ధం, పిండప్రదానం, అన్నదానం వంటి కార్యాలను కుటుంబ ఆచారం, కర్తకు వర్తించే విధి ప్రకారం నిర్వహిస్తారు.
శ్రాద్ధ తిథి ఎలా నిర్ణయిస్తారు?
ఉదయ తిథి, శ్రాద్ధ తిథి ఒకటే కావాలని లేదు. సాధారణ పంచాంగంలో సూర్యోదయ సమయంలో ఉన్న తిథి కనిపిస్తుంది. శ్రాద్ధ దిన నిర్ణయంలో అపరాహ్న కాలంలోని తిథి వ్యాప్తిని పరిశీలించాలి.
ఒక తిథి రెండు రోజుల అపరాహ్నాలలో వ్యాపిస్తే, నా సైట్‌లోని గణన ఎక్కువ వ్యాప్తి ఉన్న రోజుకు ప్రాధాన్యం ఇస్తుంది. వ్యాప్తి సమానమైతే ముందురోజును తీసుకుంటుంది. అందుకే నగరం మారినప్పుడు కొన్ని సందర్భాల్లో శ్రాద్ధ తేదీ కూడా మారవచ్చు. ఇక్కడ మాసిక శ్రాద్ధ సాధనంలోని నియమాలనే ఉపయోగిస్తున్నాను.
తిథి ద్వయం అంటే ఏమిటి?
రెండు వేర్వేరు తిథులకు ఒకే తేదీ శ్రాద్ధ దినంగా నిర్ణయించబడితే దానిని తిథి ద్వయం అంటాం. తిథుల నిడివి ఎప్పుడూ 24 గంటలు ఉండదు. ప్రారంభం–ముగింపు, పక్కరోజుల అపరాహ్న వ్యాప్తిని పరిశీలించినప్పుడు ఇలా రావచ్చు.
ఒక అపరాహ్నంలో రెండు తిథులు కనిపించాయనే కారణంతోనే రెండింటికీ అదే రోజు శ్రాద్ధం అని నిర్ణయించకూడదు. పక్కరోజు వ్యాప్తిని కూడా పరిశీలించి, రెండు తిథులకూ ఒకే తేదీ వచ్చినప్పుడే ఈ పట్టికలో తిథి ద్వయం అని చూపిస్తున్నాను.
దీనివల్ల ఒక్కరికి రెండు శ్రాద్ధాలు చేయాలని అర్థం కాదు. మీ పితృదేవత మరణ తిథికి సంబంధించిన వరుసను తీసుకోండి. కుటుంబంలో రెండు వేర్వేరు శ్రాద్ధాలు ఒకే రోజున చేయవలసి వస్తే వాటి క్రమం, విధానం గురించి పురోహితునితో మాట్లాడాలి.
30 సెప్టెంబర్ 2026, బుధవారం: కృష్ణ చవితి, కృష్ణ పంచమి
శూన్య తిథి అంటే ఏమిటి?
ఒక తేదీకి ఒక్క శ్రాద్ధ తిథి కూడా కేటాయించబడకపోతే ఇక్కడ దానిని శూన్య తిథి లేదా శూన్య శ్రాద్ధ దినం అంటాం. ఆ రోజున అసలు తిథి లేదని కాదు. ప్రతి క్షణంలో ఏదో ఒక తిథి ఉంటుంది; శూన్యం అనే మాట ఇక్కడ శ్రాద్ధ దిన కేటాయింపునకు సంబంధించినది.
ఒక తిథి రెండు రోజుల అపరాహ్నాలలో ఉంటే, ఎక్కువ వ్యాప్తి ఉన్న రోజుకు దాని శ్రాద్ధం కేటాయిస్తాం. మరొక రోజుకు పక్క తిథుల శ్రాద్ధాలు కూడా కేటాయించబడకపోతే ఆ రోజు శూన్య శ్రాద్ధ దినంగా మిగులుతుంది. పంచాంగంలో తిథి ఉన్నా శ్రాద్ధ పట్టికలో శూన్య తిథి కనిపించడానికి ఇదే కారణం.
శూన్య తేదీకి బదులుగా మీ తిథికి కేటాయించిన రోజును చూడండి. ఆ రోజున పితృస్మరణ, దానం వంటి అన్ని కార్యాలూ నిషిద్ధమని ఈ గుర్తు చెప్పదు. నిర్దిష్ట కర్మకు మీ కుటుంబ ఆచారాన్ని అనుసరించాలి.
ఎంచుకున్న ప్రాంతం–సంవత్సరానికి ఈ మహాలయ పక్షంలో శూన్య శ్రాద్ధ దినాలు లేవు.
అపరాహ్న వ్యాప్తి లేకపోవడం, శూన్య తిథి ఒకటేనా?
రెండూ వేర్వేరు. శూన్య శ్రాద్ధ దినం అంటే ఒక రోజుకు శ్రాద్ధ తిథి కేటాయించబడకపోవడం. అపరాహ్న వ్యాప్తి లేని తిథి అంటే ఒక తిథి ఏ రోజు అపరాహ్నంలోనూ వ్యాపించకపోవడం. రెండో సందర్భంలో మాసిక గణన ప్రకారం తిథి ప్రారంభమయ్యే స్థానిక తేదీకి కేటాయించి ప్రత్యేక గుర్తు చూపిస్తాను.
అటువంటి వరుసలోని కాలాలు ఆ రోజువి మాత్రమే; ఆ సమయమంతా సంబంధిత తిథి ఉంటుందని కాదు. కర్మ సమయాన్ని పురోహితునితో నిర్ధారించుకోండి. సాధారణ పంచాంగంలో క్షయ తిథి అంటే ఒక సూర్యోదయం తరువాత మొదలై తరువాతి సూర్యోదయానికి ముందే ముగిసే తిథి. దానిని శూన్య శ్రాద్ధ దినంతో కలపకూడదు.
కుతుప, రౌహిణ, అపరాహ్నం అంటే ఏమిటి?
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పగటి కాలాన్ని 15 సమాన భాగాలుగా తీసుకుంటే, 8వది కుతుప, 9వది రౌహిణ. పగటిని ఐదు భాగాలుగా విభజించినప్పుడు నాలుగో భాగం అపరాహ్నం.
కుతుప: పగటిలో 7/15 నుంచి 8/15 వరకు. రౌహిణ: 8/15 నుంచి 9/15 వరకు. అపరాహ్నం: 3/5 నుంచి 4/5 వరకు. కాబట్టి రౌహిణ ముగిసే దగ్గర అపరాహ్నం మొదలవుతుంది. పగలు సరిగ్గా 12 గంటలు ఉన్నప్పుడే ఒక్క ముహూర్తం 48 నిమిషాలు అవుతుంది.
శ్రాద్ధానికి కుతుప ప్రశస్తమైన ప్రారంభ కాలంగా చెప్పబడింది. తరువాత రౌహిణ మొదలైన కాలాలలో అపరాహ్నం ముగిసేలోగా కర్మ చేసే సంప్రదాయం ఉంది. అయితే సంబంధిత తిథి వ్యాప్తిని కూడా చూడాలి. ఇవి అన్ని నగరాలకూ ఒకే గడియార సమయాలు కావు.
మరణ తిథికి మహాలయ శ్రాద్ధం ఎలా చూడాలి?
సాధారణ మహాలయ ఎంపికలో మరణం శుక్లపక్షంలో జరిగినా కృష్ణపక్షంలో జరిగినా సంబంధిత తిథి పేరుతో పితృపక్షంలోని శ్రాద్ధ దినాన్ని చూస్తారు. ఉదాహరణకు శుక్ల అష్టమి లేదా కృష్ణ అష్టమి మరణ తిథి అయితే మహాలయ అష్టమి శ్రాద్ధ తేదీ చూడాలి.
వార్షిక ఆబ్దికం, మహాలయ శ్రాద్ధం వేర్వేరు. మరణించిన మాసం, పక్షం, తిథి ఆధారంగా చేసే ఆబ్దికానికి ఈ పక్షపు పట్టిక ప్రత్యామ్నాయం కాదు. అందుకోసం వార్షిక శ్రాద్ధ సాధనం ఉపయోగించండి.
మొదటి సంవత్సరం కర్మలు, సపిండీకరణ స్థితి, సుమంగళిగా మరణించినవారు, సన్యాసులు, దుర్మరణం వంటి ప్రత్యేక సందర్భాల్లో సాధారణ తిథి ఎంపికతో నిర్ణయం పూర్తికాదు. కుటుంబానికి వర్తించే విధిని పురోహితునితో నిర్ధారించాలి.
పూర్ణిమ రోజున మరణించినవారి సంగతి?
పితృపక్షానికి ముందు వచ్చే భాద్రపద పూర్ణిమ శ్రాద్ధం ఒక ప్రత్యేక పార్వణ శ్రాద్ధం. దానిని పట్టికలో చూపించినా మహాలయ కృష్ణపక్ష ప్రారంభంగా చూపించలేదు.
పూర్ణిమనాడు మరణించినవారి మహాలయ శ్రాద్ధాన్ని అమావాస్యనాడు చేసే సంప్రదాయాన్ని ఈ సాధనంలో అనుసరించాను. శుక్ల–పూర్ణిమ ఎంచుకుంటే సర్వపితృ అమావాస్య ఫలితం వస్తుంది. మీ ఇంటి ఆచారంలో సందేహం ఉంటే ముందుగా నిర్ధారించుకోండి.
25 సెప్టెంబర్ 2026 · 23:07 → 26 సెప్టెంబర్ 2026 · 22:19
కుతుప: 11:43–12:31
రౌహిణ: 12:31–13:19
అపరాహ్నం: 13:19–15:44
మహాభరణి శ్రాద్ధం
మహాలయ పక్షంలో అపరాహ్న కాలానికి భరణి నక్షత్ర వ్యాప్తి ఉన్న రోజుకు మహాభరణి శ్రాద్ధంగా ప్రాధాన్యం ఉంది. దీనిని ప్రతి సంవత్సరం ఒకే తిథితో ముడిపెట్టలేం. భరణి ఏ రోజు, ఎంతసేపు అపరాహ్నంలో ఉందో చూడాలి.
ఈ పేజీలో మీ ప్రాంతానికి నక్షత్ర ప్రారంభం–ముగింపు, నిర్ణయించిన తేదీ చూపిస్తున్నాను. ప్రత్యేక శ్రాద్ధాన్ని ఏ విధంగా ఆచరించాలనేది మీ సంప్రదాయం ప్రకారం నిర్ణయించుకోండి.
నక్షత్ర ప్రారంభం: 29 సెప్టెంబర్ 2026 · 09:03
నక్షత్ర ముగింపు: 30 సెప్టెంబర్ 2026 · 07:36
అపరాహ్నం: 13:18–15:42
మఘా శ్రాద్ధం
మఘా నక్షత్రానికి పితృదేవతలతో సంబంధం ఉన్నట్లు సంప్రదాయం చెబుతుంది. మహాలయ పక్షంలో అపరాహ్నానికి మఘా వ్యాప్తి ఉన్న రోజును మఘా శ్రాద్ధంగా చూస్తారు. రెండు రోజుల అపరాహ్నాలలో ఉంటే ఎక్కువ వ్యాప్తి ఉన్న రోజును ఈ గణన తీసుకుంటుంది.
మఘా నక్షత్రం, త్రయోదశి తిథి అపరాహ్నంలో కలిసి ఉన్నప్పుడే మఘా త్రయోదశి అనే ప్రత్యేకతను పరిశీలించాలి. ప్రతి మఘా శ్రాద్ధాన్ని మఘా త్రయోదశి అనకూడదు.
నక్షత్ర ప్రారంభం: 6 అక్టోబర్ 2026 · 22:17
నక్షత్ర ముగింపు: 7 అక్టోబర్ 2026 · 21:40
అపరాహ్నం: 13:15–15:37
తిథి తెలియకపోతే — సర్వపితృ అమావాస్య
మరణ తిథి తెలియనప్పుడు, లేదా సంబంధిత తిథినాడు శ్రాద్ధం చేయలేకపోయినప్పుడు సర్వపితృ అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీనినే మహాలయ అమావాస్య, పెద్దల అమావాస్య అని కూడా అంటారు. కుటుంబ పెద్దలందరినీ స్మరించుకునే రోజుగా భావిస్తారు.
మరణించిన తేదీ, సమయం తెలిసి తిథి మాత్రమే తెలియకపోతే పై సాధనం ఉపయోగించండి. సమయం తెలియక ఒకే రోజులో రెండు తిథులు వస్తే వాటిలో ఒకదాన్ని ఊహించి నిర్ణయించవద్దు. తెలిసిన కుటుంబ వివరాలు, పురోహితుని సూచనతో నిర్ధారించుకోండి.
9 అక్టోబర్ 2026 · 21:36 → 10 అక్టోబర్ 2026 · 21:20
కుతుప: 11:39–12:26
రౌహిణ: 12:26–13:14
అపరాహ్నం: 13:14–15:36
ముందుగా ఏ వివరాలు సిద్ధం చేసుకోవాలి?
గోత్రం, పితృదేవతల పేర్లు, సంబంధం, తెలిసిన మరణ తిథి వివరాలు రాసుకోండి. శ్రాద్ధం చేసే ప్రాంతానికి తేదీ నిర్ణయించి పురోహితునితో సమయం మాట్లాడుకోండి. దర్భలు, నువ్వులు, పిండప్రదాన పదార్థాలు, భోజన ఏర్పాట్లను ఆయన సూచన ప్రకారం సిద్ధం చేయవచ్చు.
ఆడంబరానికి మించి శ్రద్ధ, శుచిత్వం, కుటుంబ ఆచారానికి ప్రాధాన్యం ఇవ్వండి. పితృకార్యం పేరుతో భయపడటం అవసరం లేదు. మన పెద్దలను కృతజ్ఞతతో స్మరించి, మనకు వర్తించే విధిని తెలుసుకొని ఆచరించడం ప్రధానమైన విషయం.
ప్రతి సంవత్సరం ఈ పేజీని ఉపయోగించవచ్చా?
ఈ పేజీ సాధారణ లింకు తెరిచినప్పుడు ప్రస్తుత సంవత్సరానికి తేదీలు లెక్కించబడతాయి. సంవత్సరం మార్చి గత లేదా రాబోయే తేదీలు కూడా చూడవచ్చు. పాత సంవత్సరం ఉన్న లింకుతో వచ్చినప్పుడు ప్రస్తుత సంవత్సరం ఎంపికను నొక్కండి.
పూర్ణిమతో పాటు 15 కృష్ణపక్ష తిథుల వరుసలు ఉంటాయి. ఒకే తేదీకి రెండు శ్రాద్ధ తిథులు రావచ్చు; శూన్య శ్రాద్ధ దినం కూడా ఉండవచ్చు. కాబట్టి 16 వరుసలు అంటే 16 వేర్వేరు తేదీలు అని భావించవద్దు.
గణన ఆధారం
తిథి, నక్షత్ర సమయాలు OnlineJyotish మాసిక శ్రాద్ధ సాధనంలో ఉపయోగించే Swiss Ephemeris గణనల నుంచి వస్తాయి. స్థానిక సూర్యోదయ–సూర్యాస్తమయాల నుంచి కాల విభాగాలు లెక్కించి అదే అపరాహ్న వ్యాప్తి నియమాన్ని ఉపయోగించాను.
నేను ఈ పట్టికను సరైన తేదీ, కాలం తెలుసుకోవడానికి అందిస్తున్నాను. కర్త అర్హత, ప్రత్యేక కర్మలు, కుటుంబ సంప్రదాయానికి సంబంధించిన నిర్ణయాలను పురోహితునితో మాట్లాడి తీసుకోండి.
— సంతోష్ కుమార్ శర్మ గొల్లపెల్లి

